Friday, May 10, 2024
Homeఓపన్ పేజ్Congress future: కొత్తవి నేర్చుకోదు, పాతవి మరచిపోదు

Congress future: కొత్తవి నేర్చుకోదు, పాతవి మరచిపోదు

అధిష్ఠానానికే ప్రాధాన్యం లేకుండా పోయింది

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇది. కొత్తవి నేర్చుకోదు. పాతవి మరచిపోదు. ప్రపంచ పరిస్థితులు మారుతున్నా, దేశ కాల పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నా ఆ పార్టీ తన ఘనమైన గత చరిత్రనే పట్టుకుని వేళ్లాడుతుంటుంది. ఈ మాటల్ని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులే చేయడం జరుగుతోంది. రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్‌ నాయకుల్లో వస్తున్నంత మార్పు కూడా జాతీయ స్థాయిలో కనిపించడం లేదు. నిజానికి, భారత జాతీయ కాంగ్రెస్‌ మున్ముందు ఎలా వ్యవహరించాలో, ఏ పంథాను చేపట్టాలో, దేశానికి ఎటువంటి సేవలు అందించాలో మహాత్మా గాంధీ 1948 ఫిబ్రవరి 15న తన ‘హరిజన్‌’ పత్రికలో విపులంగా రాశారు. ఈ పార్టీకి ఒక రాజ్యాంగం ఉండాలని ఆయన అభిలషించారు. ఇప్పుడున్న రూపంలో ఆ పార్టీ కొనసాగరాదని కూడా ఆయన సూచించారు. “భారత జాతీయ కాంగ్రెస్‌ ఒక స్పష్టమైన విధానంతో, వ్యూహంతో దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకు వచ్చింది. దేశం రెండుగా విభజన అయిన తర్వాత, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రస్తుత రూపంలో కొనసాగడం భావ్యం కాదు. ఇది ఒక పోరాట వాహనం. ఓ ప్రచార వాహనం మాత్రమే. దీని ఉపయోగం తీరిపోయింది” అని ఆయన అందులో రాయడం జరిగింది. “ఇక ఈ వాహనం సామాజిక, నైతిక, ఆర్థిక స్వాతంత్య్రం కోసం పని చేయాలి. ఇది ఇక ఇతర రాజకీయ పార్టీలతో, మత సంస్థలతో పోటీ పడడం మానేయాలి. ఈ కారణాల వల్ల కాంగ్రెస్‌ రద్దయి, కొత్త రూపంలో, కొత్త భావజాలంతో ‘లోక్‌ సేవక్‌ సంఘ్‌’గా రూపాంతరం చెందాలి’ అని ఆయన కోరుకున్నారు.
ఈ పార్టీ అట్టడుగు స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పనిచేయాలని, నైతిక నిబంధనావళిని అత్యంత కఠినంగా పాటించాలని, గ్రామీణ స్థాయి ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడాలని ఆయన తన వ్యాసంలో సూచించారు. అయితే, ఆయన ఆలోచనలు, ఆయన భావాలన్నీ ఆయనతోనే గతించినట్టు కనిపిస్తోంది. నెహ్రూ, గాంధీల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నామని చెప్పే ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ గాంధీ భావజాలానికే కాక, నెహ్రూ సిద్ధాంతాలకు కూడా ఎంతో దూరంగా జరిగిపోయింది. గాంధీ, నెహ్రూలు ప్రవచించిన సిద్ధాంతాలకు భిన్నమైన మార్గాన్ని అనుసరించిన కాంగ్రెస్‌ ఇతర రాజకీయ పార్టీలలో ఒకటిగా మారిపోయింది. నెహ్రూ జీవించి ఉన్నంత కాలం ఈ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీకి పోటీగా మరో పార్టీ లేకుండా పోవడం వల్ల అది ఏం చేసినా చెలమణీ అయింది. అయితే, ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పార్టీకి పార్టీ నుంచి అసలైన ముప్పు మొదలైంది.
బూజుపట్టిన భావాలు పార్టీ మొదటిసారిగా చీలి పోయింది. చీలిన వర్గం ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన వర్గానికి ఇందిరా గాంధీ నాయకత్వం వహించారు. రెండవ వర్గం చీలికలు వాలికలై, అనేక కొత్త పార్టీలుగా అవతరించడం జరిగింది. ఈ చిన్న పార్టీలు ప్రధాన పార్టీకి పోటీ ఇవ్వలేక పోయాయి కానీ, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ముప్పు ప్రారంభం అయిపోయింది. 1977లో ఆ పార్టీకి ప్రధానమైన సమస్యలు మొదలయ్యాయి. ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన తర్వాత, దేశ ప్రజలంతా తనకు మద్దతునిస్తారని, సంఘటితంగా తన వెనుక నిలబడ్డారని ఆమె ఆశించారు. అయితే, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. దేశంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకోవడం ప్రారంభమైంది. ఆమె, ఆమె తర్వాత ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రకరకాల పేర్లతో కొత్త పార్టీలు అవతరించడం, కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. ముఖ్యంగా రాజీవ్‌ గాంధీ హత్యానంతరం ఈ చరిత్రాత్మక పార్టీ వైభవం మళ్లీ ఎక్కడా కనిపించకుండా పోయింది. అసలు పార్టీ అధిష్ఠానానికే ప్రాధాన్యం లేకుండాపోయింది.
క్రమంగా ప్రాభవం తగ్గిపోతూ వస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదగడం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మొదటిసారిగా పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అందులోనూ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ జగన్నాథ రథ చక్రాల మాదిరిగా దూసుకు పోతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. నెల రోజుల్లో జరిగే లోక్‌ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పరాజయం పాలయ్యే పక్షంలో ఆ పార్టీ ఇక పుట్టగతులుంటాయా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి, 2019 ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి అందక అవస్థలు పడుతోంది. అసలు ఈ పార్టీ నిలదొక్కుకుంటుందా అన్న ప్రశ్న ఆ ఎన్నికల సమయం లోనే ఉదయించింది. భవిష్యత్తును సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఆ పార్టీ ఏదో విధంగా పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి ప్రయత్నించి ఉండేది. ఆ పార్టీ అగ్ర నాయకత్వ వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు కానీ, ఇతర నాయకుల్లో మాత్రం పునరుద్ధరణ గురించిన ఆలోచన మొదలైంది.
అనుభవాల నుంచి పాఠాలు కేవలం మోదీని ఓడించి నంత మాత్రాన కాంగ్రెస్‌ సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదు. ‘మనం మోదీని తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన చేస్తున్న సానుకూల పనులను సానుకూలంగానే గుర్తించాలి. 2014లో, ఆ తర్వాత 2019లో ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను మనం అర్థం చేసుకోవాలి. ఆయన అమలు చేసిన పథకాల కారణంగానే ప్రజలు ఆయనను ఎన్నుకుంటున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి’ అని పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ పార్టీ సమావేశంలోనే స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు దారి తప్పిన పార్టీ అని, దాని పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని భూపీందర్‌ సింగ్‌ హుడా వ్యాఖ్యానించారు. ముందూ వెనుకా ఆలోచించకుండా ఎన్‌.డి.ఏ చేసిన ప్రతి పనినీ గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల తామెంతగా నష్టపోతున్నదీ చాలా మంది సీనియర్‌ నాయకులకు అర్థమైంది.
నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ తన చరిత్ర నుంచే తాను పాఠాలు నేర్చుకున్నా పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇందులో మొదటిది, కాస్తో కూస్తో నిస్వార్థంగా పని చేయడం. నిర్భయంగా వ్యవహరించడం, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడడం వంటివి మిగిలిన లక్షణాలు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గాంధీజీ తర్వాత పూర్తిగా అడుగంటిపోయింది. దిగువ స్థాయి వరకు పార్టీలో ఎన్నికలు జరగడం, నాయకులను ఎన్నుకోవడమన్నది ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలో కూర్చుని, అధిష్ఠానపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకోవడం, ద్వితీయ శ్రేణి నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను ఎదగనీయకపోవడం పార్టీ బలహీనపడడానికి దారి తీశాయి. 1950 లలో ప్రధానిని కూడా ప్రశ్నించగల, నిలదీయగల నాయకులు పార్టీలో ఉండేవారు. జాతీయ స్థాయి నాయకులెవరన్నది తెలియడానికి, వారి ఉనికిని అర్థం చేసుకోవడానికి ప్రతి ఏటా తప్పనిసరిగా అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ వార్షిక సమావేశాలు జరిగేవి. చిన్న పట్టణాల్లో సైతం ఈ సమావేశాలను నిర్వహించడం జరిగేది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పడం పార్టీకి దేశవ్యాప్త గుర్తింపును, జాతీయ స్థాయి వ్యాపకత్వాన్ని దెబ్బతీసింది.
రాష్ట్ర నాయకత్వ బలం ఇండీ కూటమి లాంటి కూటములు ఏర్పడడానికి, చిన్నా చితకా పార్టీలతో పొత్తులు కుదర్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కారణం, పార్టీ సంస్థాగతంగా శక్తిమంతం కాకపోవడమే. ఇండీ కూటమి ఏర్పడడానికి ముందుకు వచ్చిన నితీశ్‌ కుమార్‌ ఆ తర్వాత ఎన్‌.డి.ఎలో మళ్లీ చేరిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ వామపక్షాలనే కాకుండా కాంగ్రెస్‌ పార్టీని సైతం పక్కన పెట్టేయడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీని మొదట్లో దూరం పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆ తర్వాత ఢిల్లీలో మాత్రం ఈ పార్టీతో చేతులు కలిపి, పంజాబ్‌ లో పక్కన పెట్టింది. మొత్తానికి కాంగ్రెస్‌ కారణంగా ముఖ్య మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలయిన ప్రతి నాయకుడూ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి స్వస్తి చెప్పి, ఇతర పార్టీల్లో చేరిపోవడం జరుగుతోంది. పార్టీకి నాయకత్వం వహించడానికే చాలా కాలం పాటు ఇష్టపడని రాహుల్‌ గాంధీ ప్రస్తుతం పాదయాత్రలు, జోడో యాత్రలతో దేశ పరిస్థితిని కొత్తగా అర్థం చేసుకుంటూ, మధ్య మధ్య కేంబ్రిడ్జికి వెళ్లడం జరుగుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ భవితవ్యం ఏం కాబోతోంది? అది తనను తాను బలోపేతం చేసుకోకపోగా, బీజేపీ ఎప్పుడు బలహీనపడు తుందా అని ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షాల మీద దూకుడుగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఇదే పంథాను మరికొంత కాలం కొనసాగిస్తే, ఆత్మ వినాశనం కాక తప్పదని దేశంలో అనేక పార్టీలు భావించడం జరుగుతోంది. జూన్‌ 4న లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఏ పార్టీ భవిష్యత్తు ఏమిటో తేలిపోతుంది. అయితే, ఇప్పుడైనా, ఎప్పుడైనా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తన పంథాను మార్చుకోవలసిన అవసరం మాత్రం ఉంది.

  • వి. సుబ్రహ్యణ్యేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News