Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Manipur violence: మణిపూర్‌ హింసకు సరికొత్త రంగులు

Manipur violence: మణిపూర్‌ హింసకు సరికొత్త రంగులు

గత జూన్‌ 10న ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ కాన్యాయ్‌ మీద దాడి జరగడం మణిపూర్‌ రాష్ట్రంలో ఏడాదిగా కొనసాగుతున్న హింసా విధ్వంసకాండలకు, అరాచకత్వానికి పరాకాష్టగా కనిపిస్తోంది. అస్సాం సరిహద్దులో ఉన్న జిరిబాం జిల్లాను సందర్శించడానికి వెడుతున్న సమయంలో ఆయన వాహనాలపై ఈ దాడి జరిగింది. కాన్వాయ్‌ మీదే కాక, ఇతరత్రా కూడా జరిపిన దాడుల్లో ఒక పోలీస్‌ స్టేషన్‌ విధ్వంసం కాగా,ఒక వ్యక్తి మరణించడం, గృహ దహనాలకు పాల్పడడం కూడా జరిగింది. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్‌ మీదే దాడి జరిగిందంటే అక్కడి భద్రత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా హింసా విధ్వంసకాండలు చెలరేగుతున్నప్పటికీ, జిరిబామ్‌ మాత్రం ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అల్లర్లు, విధ్వంసకాండలు ఈ జిల్లాకు కూడా వ్యాపించినట్టు కనిపిస్తోంది. ఇటీవలి సంఘటనల తర్వాత వేలాదిమంది ప్రజలు ఈ జిల్లా నుంచి అస్సాం రాష్ట్రంలోకి పారిపోయారు. స్నేహితుల ఇళ్లల్లోనో, బంధువుల ఇళ్లల్లోనో తలదాచుకోవడం జరుగుతోంది. రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు జీవనాధారం లేక, ఆశ్రయం లేక చదువులు, ఉద్యోగాలు లేక నానా అవస్థలూ పడుతున్నారు.
మణిపూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి సత్వరం సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించడాన్ని బట్టి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారు సైతం మణిపూర్‌ విషయంలో ఏ విధంగా ఆందోళన చెందుతున్నదీ అర్థమవుతోంది. మణిపూర్‌ లో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్కడి ప్రజల నుంచి సహకారం లభించడం లేదు. మణిపూర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు, ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు సాగిస్తున్నారు. ఏడాదిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో అనేక పర్యాయాలు పర్యటించారు కానీ, మణిపూర్‌ రాష్ట్రాన్ని మాత్రం సందర్శించలేదు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆయన మణిపూర్‌ సమస్య గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. మణిపూర్‌ లో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన ఒకే ఒక సందర్భంలో పేర్కొన్నారు.
మణిపూర్‌ లో ఉద్రిక్తతలు, హింసా విధ్వంసకాండలు అడపాదడపా పేట్రేగుతూనే ఉన్నాయి. ఇవి కొత్త ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఇక్కడి రెండు స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోవడాన్ని బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఇక్కడి ప్రజలు నిరాకరిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మైతీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ వైదొలగాలని ఇక్కడి కుకీలు పట్టుబడుతున్నారు. ఒకవేళ ఇక్కడ కుకీలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించే పక్షంలో మైతీలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడ హింసా విధ్వంసకాండలుచెలరేగుతున్నది స్థానికుల కారణంగా కాదని, మైన్మార్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి మణిపూర్‌ లో ప్రవేశిస్తున్న కుకీలు, నాగాల వల్లే ఇక్కడ అల్లర్లు ప్రారంభమయ్యా యని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నది కూడా కుకీలేనని ప్రభుత్వం ఉద్దేశపడుతోంది. మణిపూర్‌ లో రాజ్యాంగ యంత్రాంగమంతా కుప్పకూలిపోయిందని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇందులోని రాజ్యాంగ, రాజకీయ, మతపరమైన కోణాలను పక్కన పెడితే, ప్రజల పరిస్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోంది. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలంటూ మోహన్‌ భాగవత్‌ చేసిన సూచనను ప్రభుత్వం తీవ్ర విషయంగా పరిగణించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News