Sunday, December 29, 2024
Homeఓపన్ పేజ్Manmohan the reformer: ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్

Manmohan the reformer: ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్

ఆమ్ ఆద్మీ సర్కార్..

అస్తవ్యస్తంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించిన ఘనుడు మన్మోహన్‌ సింగ్‌. సంక్షోభంలో ఉన్న భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలపడంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెరగని ముద్ర వేశారు. ప్రధానిగా పని చేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించినా విధాన నిర్ణయాల్లో దూకుడు ప్రదర్శించి దేశాభివృద్ధిలో తనదైన మార్క్‌ చూపించారు. ఎల్‌పీజీ ఆర్థిక సంస్కరణలు, అమెరికాతో అణు ఒప్పందం, ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆధార్‌ గుర్తింపు కార్డు, సమాచార హక్కు చట్టం, రైతు రుణమాఫీ, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ లాంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో పాటు మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా మన్మోహన్‌ ప్రభుత్వంలోనే జరిగింది. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌.. 2014 వరకూ కొనసాగారు. అంతకు ముందు ఆర్థికమంత్రిగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా పని చేసి దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. అనారోగ్యంతో 92 ఏళ్ల వయసులో మరణించినా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.

- Advertisement -

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26వ తేదీన సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్‌ సింగ్‌ దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతోపాటు 1954లో పీజీ చేశారు.1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చిన మన్మోహన్‌ పంజాబ్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి పీహెచ్‌డీలో చేరారు. 1966 నుంచి 69 వరకూ ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తరువాత విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 1969 నుంచి 71 వరకూ ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. 1972లో మన్మోహన్‌ కేంద్ర ఆర్థికశాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 1976 నాటికి ఆర్థికశాఖ కార్యదర్శి అయ్యారు. 1980-82లో ప్రణాళికా సంఘంలో పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 నుంచి 87 వరకూ ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేశారు. 1987 నుంచి 90 వరకూ స్విట్జర్లాండ్‌లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పని చేసే సౌత్‌ కమిషన్‌కు సెక్రటరీ జనరల్‌గా పని చేశారు. 1990 నవంబరులో మన్మోహన్‌ జెనీవా నుంచి తిరిగొచ్చాక అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌ ఆయనను ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. ఆ తరువాత యూజీసీ ఛైర్మన్‌ అయ్యారు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్‌ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరుగెత్తించాలనే ఉద్దేశంతో పీవీ ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్‌లో మన్మోహన్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. 1991లో అస్సాం నుంచి మన్మోహన్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లలో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేతగా వ్యవహరించారు.

మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. దేశంలో తిరుగులేని ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి బాటలు వేశారు. పన్నుల్ని తగ్గించారు. రూపాయి విలువ నిలబెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. 1990ల్లో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి. ముఖ్యంగా ఎల్ పీజీ సంస్కరణలుగా చెప్పబడే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తగ్గించి, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాడు. అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించి, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులు తొలగించాడు. చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడతో పెట్టుబడులు పెరిగి విదేశీ మారక నిల్వలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది.

ఇటలీ మూలాల విషయంలో పార్టీపై విమర్శలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని పదవిని తిరస్కరించడంతో 2004లో అనుకోకుండా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. మన్మోహన్‌ ప్రధాని అయినప్పటికీ సోనియాగాంధీనే నిజమైన అధికార కేంద్రంగా ఉన్నారనీ, ఆయనెప్పుడూ పూర్తిస్థాయి అధికార బాధ్యతలు నిర్వహించలేదని విమర్శకులు ఆరోపించేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న తొలి ఐదేళ్లకాలంలో అతిపెద్ద విజయం అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం.అమెరికాతో అణుఒప్పందాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోకుండా మరో పార్టీ మద్దతు తీసుకుంది కాంగ్రెస్. క్లిష్టపరిస్థితులున్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా విభిన్న ప్రాంతీయ పార్టీలకు, మద్దతుదారులకు నేతృత్వం వహించి సక్సెస్‌ అయ్యాడు. విదేశాంగ విధానంలో మన్మోహన్ సింగ్ పూర్వ ప్రధానుల ఆచరణాత్మక విధానాలనే అనుసరించారు. పాకిస్తాన్‌తో శాంతి సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2008 నవంబరులో ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడులతో ఈ విధానానికి ఆటంకం కలిగింది. ఈ దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అన్న ఆరోపణలొచ్చాయి. చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. 40 ఏళ్లకు పైగా మూసి ఉన్న నాథులా పాస్‌ను తిరిగి తెరిచేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం పెంచారు. అప్పటికి దాదాపు 30 ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. ఇరాన్‌తో స్నేహసంబంధాలకు ముగింపు పలికినట్టు కనిపించిన మన్మోహన్ వైఖరిపై ప్రతిపక్షనేతలు అప్పట్లో తీవ్రవిమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ జీవితంపై ఆయన సన్నిహితుడు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో మూవీ వచ్చింది. ఇందులో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించగా.. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. 2019 జనవరి 11న విడుదలైన ఈ చిత్రంలోని పలు డైలాగ్ లపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది.

ప్రధానిగా తీసుకొచ్చిన సంస్కరణలు

2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచాడు. ఉపాధి హామీ పథకం ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని సామాన్యులకు తెలుసుకునే విధంగా ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ చేపట్టారు. మన్మోహన్‌ సింగ్‌ పాలనాకాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్‌ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపత్రాస్త్రంలాంటి సమాచార హక్కును అందించింది. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంలోనూ మన్మోహన్ సింగ్ సర్కారే క్రియాశీలక పాత్ర పోషించింది.

  • కొత్త.ప్రశాంత్‌
    సీనియర్‌ జర్నలిస్ట్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News