ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి నిర్వహించే ‘మన కీ బాత్’ కార్యక్రమం దేశంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం, రేడియోలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కావడం ప్రారంభంఅయినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఇక దీన్ని ఎప్పుడు ప్రసారం చేసినా కనీసం 23 కోట్ల మంది ఈ దీన్ని వీక్షిస్తుంటారని కూడా వెల్లడైంది.గత ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం వందవ ఎపిసోడ్ పూర్తి చేసుకున్నందువల్ల దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 2014 నుంచి, అంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది.వీక్షకులను లేదా శ్రోతలను ఒక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షించేలా, వినేలా చేయడం అన్నది ఒక పెద్ద సవాలే. సాక్షాత్తూ ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందువల్ల సాధారణంగా ఇది ఎక్కువ కాలం విజయవంతం అయ్యే అవకాశం లేదు. అయితే, మోదీ మాత్రం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అనేక అంశాలను, సమస్యలను ప్రస్తావిస్తూ శ్రోతలు,వీక్షకులు దీన్ని అనుసరించేలా చేస్తున్నారు.
ఆయన అంతర్జాతీయ అంశాల నుంచి స్థానిక అంశాల వరకు వివరిస్తూ, మేధావులనే కాక, అట్టడుగు స్థాయివర్గాలను సైతం ఆకట్టుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం అడిగే ప్రశ్నలకు ఓర్పు, సహనాలతో సమాధానాలు, వివరణలు ఇస్తూ ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి పెంచుతున్నారు. పేద ప్రజానీకం తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించడం, స్ఫూర్తిని కలిగించడం, ఉత్తేజపరచడం వంటివి చేస్తున్నారు. మొత్తం మీద కోట్లాది మంది ప్రజలు ఈ కార్యక్రమం పట్ల ఆకర్షితులు కావడం వల్ల ఆకాశవాణి మీద కూడా కనక వర్షం కురుస్తోందనే చెప్పాలి. నిజానికి ఆకాశవాణి కార్యక్రమాలకు శ్రోతలు తక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ, మన్ కీ బాత్ విషయానికి వచ్చేసరికి అది టీవీలు, ఆన్‌లైన్ కార్యక్రమాలన్నిటినీ దాటిపోతోంది. దేశంలో డిజిటలీకరణకు పెరుగుతున్న విస్తృతికి ఇది అద్దం పడుతోంది. ఆయన మాట తీరు, సాధారణ ప్రజానీకానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం తెలియజేస్తున్న విధానం ప్రజల మనసుల్లోకి బాగా ఎక్కినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిలా ఇది ఇప్పుడు ఉపయోగపడుతోంది. ఇక దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఇందులో రాజకీయ ప్రచారాలకు అవకాశం ఇవ్వనందువల్ల, ఎన్నికల కమిషన్ కూడా దీని జోలికి రావడం లేదు. హర్యానాకు చెందిన ఒక వ్యక్తి ‘కుమార్తెతో సెల్ఫీ’ అనే కార్యక్రమాన్ని చేపట్టడం చూశానని, ఆడపిల్లలకు చదువు తప్పనిసరి చేయాలన్న నిర్ణయానికి అది తనకు స్ఫూర్తిదాయకం అయిందని మోదీ ఈ కార్యక్రమం సందర్భంగా వెల్లడించారు. ఆ కార్యక్రమం పుణ్యమాని హర్యానాలో ఇప్పుడు స్త్రీ, పురుష నిష్పత్తి కూడా పెరిగింది.
మోదీ ఒక మంచి వక్త అనీ, ఆయన ఎటువంటి విషయాన్నయినా తేలికపాటి మాటలతో ఇతరులకు అర్థమయ్యేలా వివరించగలరనీ, అదే ఆయన విజయాలకు కారణమనీ చాలామంది భావిస్తారు. 2014లో ఆయన ప్రధాని పదవిని అధిష్ఠించినప్పటి నుంచి నేరుగా ప్రజలతోనే ఆయన ప్రత్యక్ష సంబంధాలు నెరపుతున్నారు.ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి క్షణం ప్రజలకు గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. ఎల్లవేళలా ప్రజలకు దగ్గరగా ఉండాలనే తాపత్రయం ఒకపక్క, ఫోటోలతో పేపర్లకు ఎక్కడం మరో పక్క ఆయనను ప్రజలు క్షణం కూడా మరచిపోని పరిస్థితి కల్పిస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమం పుణ్యమాని ఆయన ప్రజలకు మరింతగా చేరువ కాగలుగుతున్నారు. అయితే, ఇంతవరకూ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించని ఏకైక ప్రధానమంత్రి మోదీ అని చెప్పుకోవచ్చు. బీజేపీ దీపావళి మంగళ్ మిలన్ వేడుకల సందర్భంగా మాత్రం ఆయన విలేఖరులతో కలిసి ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. ఆయన విలేఖరుల సమావేశాలు నిర్వహించనప్పటికీ, ప్రజలతో మమేకం కావడానికి ఇతర అన్ని పద్ధతులూ అనుసరిస్తున్నారు.