Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Marxist parties mistakes: తప్పటడుగు వేసిన మార్క్సిస్టు పార్టీ

Marxist parties mistakes: తప్పటడుగు వేసిన మార్క్సిస్టు పార్టీ

సైద్ధాంతిక కారణాలతో చారిత్రక తప్పిదాలా?

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) కీలక సమయాల్లో తప్పటడుగులు వేస్తుంటుంది. గతంలో కూడా అనేక పర్యాయాలు ఇదే జరిగింది. సాధారణంగా మీడియా వీటిని ‘చారిత్రక తప్పిదాలు’గా అభివర్ణిస్తూ ఉంటుంది. సైద్ధాంతిక కారణాల మీద జ్యోతిబసును ఆపకపోయి ఉంటే 1996లో ఈ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి పదవిలో ఉండేవారు. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్క్సిస్టు పార్టీ మరో తప్పటడుగు వేసింది. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వం భారత-అమెరికా అణుశక్తి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రభుత్వానికి మార్క్సిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీన్ని కూడా చారిత్రక తప్పిదంగానే అభివర్ణించడం జరిగింది. మొదటిసారి యు.పి.ఏను తీర్చిదిద్దడంలో మార్క్సిస్టు పార్టీ కీలక పాత్ర పోషించింది. ఉపాధి హామీ పథకాన్ని తీసుకు రావడంలో ముఖ్య భూమిక నిర్వహించింది. ఇక 43 మంది సభ్యుల బలంతో యు.పి.ఏ ప్రభుత్వంలో శక్తిమంతంగా తయారైంది.
అయితే, యు.పి.ఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి మార్క్సిస్టు పార్టీ ప్రాబల్యం, ప్రాభవం క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. జాతీయ రాజకీయాల నుంచి అదృశ్యం కావడం కూడా మొదలైంది. దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి పేరుతో చేతులు కలుపుతున్న సమయంలో వీటినన్నిటినీ ఒక్క తాటి మీదకు తీసుకురావడంలో మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కీలక పాత్ర పోషించారు. ఈ పాత్ర నిర్వహించిన తర్వాత నుంచి మార్క్సిస్టు పార్టీ మళ్లీ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం మొదలైంది. అయితే, పార్టీలో అత్యంత శక్తిమంతమైన పొలిట్‌ బ్యూరో ఒక విచిత్రమైన ప్రకటన చేసి పార్టీని గందరగోళంలో పడేసింది. తమ పార్టీ ఇండియా కూటమిలో సభ్యురాలుగా, ఒక భాగంగా ఉంటుందే తప్ప, భాగస్వామిగా ఉండబోదని అది ప్రకటించడం సమస్యను మళ్లీ మొదటికి తీసుకువచ్చింది.
బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి ఇది గండి కొట్టినట్టయింది. దీనిపై మార్క్సిస్టు పార్టీ వాదన ఏమిటంటే, ఎన్నికల ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని 2022లో కన్నూరులో పార్టీ సమావేశం తీర్మానం చేసిందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని అది పేర్కొంది. అయితే, మార్క్సిస్టు పార్టీ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా సి.పి.ఐ నుంచి ఇందుకు అభ్యంతరం వచ్చింది. విచిత్ర మేమిటంటే, మార్క్సిస్టు పార్టీ తమ కార్యకర్తలకే తమ ధోరణిని వివరించుకోలేని పరిస్థితిలో ఉంది.
నిజానికి సంఖ్యాపరంగా ఈ పార్టీ బలహీన స్థితిలో ఉంది. లోక్‌ సభలో ఈ పార్టీకి ముగ్గురే సభ్యులున్నారు. ఈ పార్టీకి ప్రజల్లో ఏ ఇతర ప్రతిపక్షానికీ లేనంత విశ్వసనీయత ఉంది. ఈ విషయంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ తీసికట్టేనని చెప్పవచ్చు. ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్‌ కూడా తరచూ ఒప్పుకుంటూ ఉంటుంది. మార్క్సిస్టు పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.ఆర్‌. వేణుగోపాల్‌ ఒక ప్రకటన చేస్తూ, మార్క్సిస్టు పార్టీతో తమకెటువంటి భేదాభిప్రాయాలూ లేవని స్పష్టంచేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో ఈ పార్టీకున్న అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని అర్థమవుతూనే ఉంది. అయితే, ఈ పార్టీ ఇప్పటికైనా తమ ప్రధాన ప్రత్యర్థి ఎవరన్నది తేల్చుకోవాల్సి ఉంది. సైద్ధాంతిక కారణాలపై ప్రతి ప్రతిపక్ష కూటమికి ఇది దూరంగా ఉండడం అనేది దీర్ఘకాలంలో ఈ పార్టీకి తీరని చెరుపు చేసే అవకాశం ఉంది. మరో చారిత్రక తప్పిదాన్ని తట్టుకోగలిగిన స్థితిలో ఈ పార్టీ లేదన్న విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News