Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Meetha Kathalu: తెలంగాణ మట్టి పరిమళాల మీఠా కథలు

Meetha Kathalu: తెలంగాణ మట్టి పరిమళాల మీఠా కథలు

అమూల్యమైన తెలంగాణ బాల సాహిత్యం

ఏ భాషకైనా జీవధాతువు మాండలికమే. గత ఆరు దశాబ్ధాలుగా తెలంగాణ సాహిత్యాన్ని, సాహిత్యకారులను, సాంప్రదాయాలను, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పాలకులు విస్మరించారు. తెలంగాణ భాష, యాస, చిన్న చూపు చూడబడింది. సినిమాల్లో గూండాలకు, నాటకాల్లో నీచ పాత్రలకు తెలంగాణ మాండలిక భాష ఉపయోగించబడింది. రెండు జిల్లాల ప్రజలు మాట్లాడే భాషనే అసలైన భాషగా ముద్ర వేసి సాహిత్య లోకం మీదికి వదిలారు. మన అమ్మ, అమ్మమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ వల్లె వేయించిన మాటలు, ప్రేమతో పాడిన పాటలు తెలుగే కాదు పొమ్మన్నారు. ఈ అప ప్రదను తొలగించడానికే సురవరం ప్రతాపరెడ్డి గారు గోలుకొండ కవుల సంచిక వెలువరించిన సంగతి సాహిత్య లోకాన జగద్విధితమే. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పెనుగులాడే క్రమంలో నీళ్ళు, నిధులు, నియామకాలతో పాటు, తెలంగాణ మాండలిక భాష అస్తిత్వ సమస్య ముందుకు వచ్చింది. ఉధ్యమంలో పాట, కథ, నవల, వ్యాసం, విమర్శ మొదలగు సాహిత్య ప్రక్రియలు కసిగా, ఉప్పెనలా ఎగిశాయి . ఉధ్యమ జెండా ఎత్తుకోక ముందు కొంతమంది రచయితలు మాండలికంలో సాహిత్య సృజన చేసినా, నాడు అంతగా వారు గుర్తింపుకు నోచుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పాటుతో కవులు, రచయితలూ ధూంధాంలో గజ్జె కట్టి ఎగిరినంత తెగువతో, విస్తృతంగా నేడు రచనలు చేస్తున్నారు. అన్ని సాహిత్య ప్రక్రియలల్లో పునర్నిర్మాణం జరుగుతున్న నేటి తరుణంలో బాలల కథలను, కీ.శే . పెండెం జగదీశ్వర్‌, పత్తిపాక మోహన్‌, గరిపెల్లి అశోక్‌ గార్లు మాండలిక సౌరభంతో వెలువరించారు. అదేక్రమంలో ప్రసిద్ధ బాలల కథా రచయిత పైడిమర్రి రామకృష్ణ గారు కూడా, తెలంగాణ బాలల కథా పరిమళాలను పిల్లలకు అందించాలనే తలంపుతో ఈ జోర్దార్‌ కతలు భాషలో రాసి మీ ముందుకు తెచ్చారు. ఖమ్మం గడ్డమీద పుట్టి, ఇక్కడి మాండలిక గంధాలను మనసు నిండా నింపుకున్న నిఖార్సైన తెలంగాణ సాహిత్యకారుడు రామకృష్ణ . తను అచ్చమైన పసి హృదయమున్న బాలల రచయిత. ఇప్పటి వరకు 600 కు పైగా బాలల కథలతో, 8 కథా సంపుటాలతో, బాలల రచయితలకు మార్గదర్శకులుగా ముందువరుసలో ఉన్నారు. అంతేకాదు, తెలుగు నాట నాలుగు చెరగులా విస్తరించి ఉన్న 100కు పైగా బాలసాహితీ వేత్తలను గుదిగుచ్చి దండగా పేర్చి, బాలసాహితీ శిల్పులుగా పుస్తక రూపంలో తెచ్చారు. అకాడమీ లకు, యూనివర్సిటీలకు, పరిశోధక విధ్యార్థులకు ఈ గ్రంధం టార్చ్‌ లైట్‌ లాంటిది. తెలుగునాట ఉన్న అన్ని పిల్లల పత్రికలకు రచనలు చేసిన వాడు కావడంతో, సాహిత్య లోకాన వీరి గురించి, వీరి రచనల గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వీరి సాహితీ సృజనకు గుర్తింపుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహితీ సంస్థల నుండి అనేక అవార్డులు, రివార్డులు పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యా లయం, హైదరాబాదు వారి నుండి బాల సాహిత్యంలో కీర్తి, సాహితీ పురస్కారాలు .. రెంటినీ అందుకున్న మొదటి బాలసాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ. కథలని పరిచయం చేయడమంటే, విందు భోజనాన్ని ముందు పెట్టి, పదార్థాల గురించి చెప్పినట్లుగా ఉంటుంది. ఒక కథ ముట్టుకుంటే మోసాన్ని జయించడం గురించి అర్థమౌతుంది. మరో కథ పట్టుకుంటే తెలివైన నిర్ణయం తీసుకోవడం ఎలాగో తెలుస్తుంది. మరో కథలోకి వెళితే కడుపు నిండిన వాడికి కార్జాల కూర వడ్డించినా, అసంతృప్తి గానే ఉంటుంది. అనే విషయం తేట తెల్లమౌతుంది. ప్రతి కథలోనూ బాలలకు ఒక నీతి ప్రబోధము, తార్కిక జ్ఞానం, తల్లిదండ్రులను గౌరవించడం, పరుల కష్టాలను చూసి, సాయ పడాలే కానీ ఎగతాళి చేయకూడదు అనే మార్గనిర్దేశం కనిపిస్తుంది. ప్రతి కథలోనూ, ఒక ప్రబోధం, ఒక జ్ఞానం చదువరులకు అందుతుంది. గద్దించి, గుడ్లురిమి చెప్పినట్లు కాకుండా అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు ఒడిలో కూర్చో బెట్టుకొని ప్రేమతో బుదగరించి చెప్పినట్లు సరళ మాండలికంలో అలతి , అలతి పదాలతో రమ్యంగా కథలు చెప్పారు. ఈ కథలలో పులి, సింహం, ఏనుగు, నక్క, ఎలుగు బంటి, కోడిపుంజు, బాతు, చిలక, నెమలి, గద్ద, పావురం, కాకి, మొదలైన అడవి జంతువులు, పక్షులు తమ ప్రవర్తనతో కథను పరిపుష్టం చేస్తాయి. నిజానికి, అవి జంతువులైనా, పక్షులైనా – పాత్రలుగా మనకు మనుషులు, వారి చర్యలే కనిపిస్తాయి. ఈ కథలు చదువుతుంటే , పంచతంత్ర కథలతో రాజ కుమారులను తీర్చిదిద్దిన విష్ణు శర్మ వెంటనే గుర్తుకు వస్తారు. భావస్పోరకంగా పంచ రంగుల్లో ముఖ చిత్రమే కాకుండా, లోపల ప్రతీ కథకు బొమ్మలు వేసిన చిత్రకారుడు, మిత్రులు వడ్డేపల్లి వెంకటేష్‌ ఎంతైనా అభినందనీయులు. ఇంకా.. ఆలస్యం ఎందుకు కథల విందుకు కదలండి.

  • పుప్పాల కృష్ణ మూర్తి
    99123 59345
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News