Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Mizoram Election Results Usher in New Politics: పథ నిర్దేశక రాష్ట్రం మిజోరం

Mizoram Election Results Usher in New Politics: పథ నిర్దేశక రాష్ట్రం మిజోరం

యువతకు, వృత్తి నిపుణులకే MNF టికెట్లు

మూడు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయాలు సాధించిన వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి కానీ, మిజోరం గురించి దేశ ప్రజలంతా విస్మరించారన్నట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు విజయాలు సాధించడం అంత విస్మయకర విషయమే కాదు కానీ, ఈశాన్యంలో ఉన్న మిజోరం అనే చిన్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దాని ఫలితాలు మాత్రం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. నిజానికి అన్ని రాష్ట్రాల దారీ ఒకటైతే మిజోరం దారి మాత్రం వేరు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు మిజోరంలో కూడా ఎన్నికలు జరిగాయి కానీ, ఫలితాలు మాత్రం ఒక రోజు ఆలస్యంగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మిజోరంలోని జోరమ్‌ పీపుల్స్‌ పార్టీ (జె్‌డఆర్‌.ఎం)కి పోలయిన ఓట్లు 37.9 శాతం కాగా, ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ (ఎం.ఎన్‌.ఎఫ్‌)కి 35.1 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 20.8 శాతం, బీజేపీకి 5.1 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి జోరమ్‌ పార్టీ మొత్తం 40 స్థానాల్లో 27 స్థానాలను చేజిక్కించుకుని అధికారంలోకి వచ్చింది. మిగిలిన పార్టీల మధ్య సయోధ్య లేనందువల్ల ఈ పార్టీ అధికారంలోకి రాగలిగింది. సుమారు 36 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తుండగా, జోరమ్‌ పార్టీ ఆ ఆనవాయితీని భగ్నం చేసింది. ఇక్కడ ఇంత వరకూ మిజో నేషనల్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే మార్చి మార్చి అధికారంలోకి వస్తుండేవి. జోరంతాంగా నాయ కత్వంలోని ఎం.ఎన్‌.ఎఫ్‌ పార్టీని ఓడించడం సాధారణ విషయం కాదు. ఈ పార్టీకి స్థానిక జాతీయవాద ధోరణి ఎక్కువ. పైగా మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన కుకీలతోనూ, మయన్మార్‌ కు చెందిన చిన్‌ తెగవారితోనూ పటిష్టమైన సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఆ రెండు వర్గాలు తీవ్రస్థాయి ఘర్షణల్లో నిమగ్నమై ఉన్నాయి.
మిజోరంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఈ క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ చేయగలిగిందంతా చేసింది. బీజేపీ హిందుత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు, బీజేపీకి ఎం.ఎన్‌.ఎఫ్‌ అనుకూలమైన పార్టీ అని కూడా ప్రచారం చేసింది. ఈ ప్రచారం వల్ల తనకేమీ ఉపయోగం కలగలేదు కానీ, జోరమ్‌ పార్టీ మాత్రం విశేషంగా లబ్ధి పొందింది. వాస్తవానికి బీజేపీ నాయకత్వంలోని నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ లో ఎం.ఎన్‌.ఎఫ్‌ కూడా ఉంది. భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలలో రెండవ స్థానంలో ఉన్న మిజోరంలోని 8.5 లక్షల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎం.ఎన్‌.ఎఫ్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రకరకాలుగా జాతీయవాద ధోరణులతో ప్రచారం చేసినా, మత, జాతి, తెగల సంబంధమైన వరాలను ప్రకటించినా చివరికి జోరమ్‌ విధానాలు, ప్రచారాల పట్లే ఓటర్లు ఆకర్షితులయ్యారు. అవినీతి రహిత పాలనను అందిస్తామని, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచుతామని ప్రకటించిన జోరమ్‌ పార్టీనే ప్రజలు నమ్మినట్టు కనిపించింది.
పాలనలో గణనీయమైన మార్పు తీసుకువస్తామని ప్రకటించిన జోరమ్‌ పార్టీ ఎన్నికల్లో టికెట్లను ఎక్కువగా యువతకు, వృత్తి నిపుణులకు మాత్రమే ఇచ్చింది. మాజీ ఐ.పి.ఎస్‌ అధికారి లాల్దుహోమా నాయకత్వంలోని ఈ పార్టీ ఘన విజయం సాధించడానికి ఇదే ప్రధాన కారణం అయింది. జోరమ్‌ పార్టీ సొంతగా అధికారంలోకి వచ్చినందువల్ల తన విధానాలను, తన వాగ్దానాలను తేలికగా నెరవేర్చడానికి అవకాశం ఉంది. ఎన్నికలలో రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీని ఇది తమ మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కూడా ఉంది. కేంద్రం నుంచి రావలసిన నిధులను గరిష్ట స్థాయిలో రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే, ప్రజలకు స్వచ్ఛమైన, సక్రమమైన పాలనను అందించాలని, తన లక్ష్యాలను సాధించాలని ఆయన భావిస్తున్నారు. చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వనరుల సమీకరణ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. వనరులను సమీకరించడానికి అవి తప్పనిసరిగా కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది.
ఈ రాష్ట్రం 85.7 శాతం నిధులను కేంద్రం నుంచే పొందడం జరుగుతోంది. ప్రస్తుతం వ్యవసాయ రంగం మీదే ఎక్కువగా ఆధారపడుతున్న మిజోరం ఇక పర్యాటక రంగాన్ని కూడా విశేషంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. పర్యావరణ హితమైన ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టే ఉద్దేశంలో ఉంది. ఇక్కడ సంపూర్ణ అక్షరాస్యత నెలకొని ఉండడం, యువతలో విద్యావంతులు ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల టెక్నాలజీ రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని భావించడం జరుగుతోంది. తన హయాంలో రాష్ట్రాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనే ప్రముఖమైన, అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని, కుల, తెగ, మత పోరాటాలకు అతీతంగా ఉంచాలని లాల్దుహోమా ఎంతగానో ఆశపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News