Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Modi charisma: వచ్చే ఎన్నికలపై మోదీ చరిష్మా ప్రభావం

Modi charisma: వచ్చే ఎన్నికలపై మోదీ చరిష్మా ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న మోడీ ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుస్తుందా?

నరేంద్ర మోదీ ఇతర గతంలో పనిచేసిన ప్రధాన మంత్రుల కంటే కొన్ని ప్రత్యేకమైన, విశిష్టమైనటువంటి లక్షణాలున్న వ్యక్తిగా దేశంలో గుర్తింపు పొందారు. తన వాక్చాతుర్యంతో ఎటువంటి సమస్యనైనా అధిగమించే విధంగా ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ, భారత దేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా మోదీ చేస్తున్నటు వంటి కృషి నిజంగా అభినందనీయమే. ఉదా హరణకు 2014 సంవత్సరంలో మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థగా ఉంటే, నేడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందేలా దూసుకు వెళ్తుంది. కేవలం ఆర్థిక సంబంధించినటువంటి అంశాలే కాకుండా అన్ని ప్రధాన రంగాలలో కూడా భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో నేడు పోటీ పడుతుంది. దానికి మన దేశం అనుసరిస్తున్నటువంటి అనేక విధాన అంశాలు ఉన్నప్పటికీ, మోదీ ఇలాంటి అత్యంత జనాధారణ మరియు సమర్థ వంతమైన ప్రధాని లాంటి నాయకత్వం కూడా మన దేశ అభివృద్ధికి దోహదపడిందని చెప్పవచ్చు. అదేవిధంగా మోదీకి ఉన్న పాపులారిటీ ఆధారంగా 2024లో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో కూడా మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని నేడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ మోదీ మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తప్పకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కృషి చేస్తారని, అదేవిధంగా ప్రపంచానికి భారత్‌ విశ్వ గురువు నమ్మకాన్ని ప్రపంచానికి బలంగా తీసుకెళ్తారని చాలామంది విశ్వసిస్తున్నారు.
మన దేశంలో మెజారిటీ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నేడు భారత దేశ ప్రభావం ప్రపంచంపై మరింత బలోపేతం అవుతోందని బలంగా నమ్ముతున్నారు. ఇందుకు ఇటీవల విడుదలైన ప్యూ సర్వేనే నిదర్శనం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి వెల్లడైంది. 80 శాతం మంది భారతీయులు ప్రధాని మోదీకి అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌’ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం, ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది ఆయనకు ఫేవరబుల్‌ ఉన్నారని అందులో వివరించింది. ఎన్డీఏకు మద్దతిచ్చే వాళ్లు, ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రభావం పెరుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వేదికపై భారతదేశం మరింత శక్తిమంతమవుతోందని పురుషులు ఎక్కువగా నమ్ముతున్నారని పేర్కొంది. మన దేశంలో వచ్చే నెల సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సమ్మిట్‌ జరగనున్న నేపథ్యంలో ఈ రిపోర్టును ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లోని 30,861 మందిపై సర్వే చేసినట్లు వెల్లడించగా, అందులో 2,611 మంది భారతీయులు, 3,576 మంది అమెరికన్ల అభిప్రాయాలను సేకరించినట్లు చేసినట్లు చెప్పింది. ప్రధాని మోదీకి సంబంధించిన గ్లోబల్‌ వ్యూస్‌, గ్లోబల్‌ పవర్‌గా ఇండియా పరిధి, ఇతర దేశాలపై భారతీయుల అభిప్రాయాలు, ఇండియాపై ఇతర దేశాల అభిప్రాయాలను పరిశీలించడానికి ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. నరేంద్ర మోదీకి 80 % మంది ఫేవరబుల్‌గా ఉండగా, అందులో 55 శాతం మంది అత్యంత అనుకూలంగా ఉన్నట్లు ‘ప్యూ’ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వాళ్లలో 46 శాతం మంది ఇండియా విషయంలో సానుకూలంగా ఉన్నారని, 34 శాతం మంది సానుకూలంగా లేరని, మరో 16 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పలేదని ప్యూ తెలిపింది. ఇజ్రాయెల్‌లో 71 శాతం, యూకేలో 66 శాతం, కెన్యాలో 64 శాతం, నైజీరియాలో 60 శాతం, సౌత్‌ కొరియాలో 58 శాతం, జపాన్‌లో 55 శాతం మంది ఇండియాపై ఫేవర్‌ బుల్‌గా ఉన్నారని చెప్పింది, అంటే ఇతర దేశాలలో కుడా మోదీ చరిష్మా కూడా ఇందుకు దోహదపడింది.
అదే విధంగా ఈ ఏడాది జనవరి 26 నుంచి 31 వరకు సేకరించిన సమాచారం ఆధారంగా అమెరికాకు చెందిన కన్సల్టింగ్‌ సంస్థ ’మార్నింగ్‌ కన్సల్ట్‌’, ‘గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌’ సర్వే నిర్వహించింది. 78 శాతం ఆమోదం రేటింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే ఓ సంస్థ, ప్రపంచ దేశాధి నేతల పాలన, నిర్ణయాలు తదితర అంశాలపై ఏటా సర్వే నిర్వహించి, రేటింగ్‌ ఇస్తుంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన 2014లో ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ పని ప్రపంచ స్థాయిలో డేటా ఇంటెలిజెన్స్‌. మార్నింగ్‌ కన్సల్ట్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఆధారిత కంపెనీగా చెబుతారు ఈ ఏడాది కూడా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో భారత ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు కనీసం 50 శాతం ఓట్లను సాధించలేక పోవడం గమనార్హం. తనదైన మార్కు నిర్ణయాలు, అభివృద్ధి, అందర్నీ కలుపుకుని వెళ్లడం, అవినీతి రహిత పాలన వంటి అంశాలే మోదీ ప్రజాదరణను పెంచాయని చెప్పడంలో ఎలాంటి సందే హం లేదు. ప్రధాని మోదీ మార్చి 2020 నుంచి జూన్‌ 2022 మధ్య కరోనాను సమర్ధంగా ఎదుర్కొని, భారత దేశాన్ని కరోనా బారి నుండి ఎక్కువ నష్టపోకుండా కృషి చేసాడు. ఇది కూడా ఆ సర్వేలో మోదీ మొదటి స్థానంలో రావడానికి దోహదపడింది.
దాదాపుగా గత దశాబ్దపు కాలం నుండి మన దేశంలో ఉన్నటువంటి యువతకు బలంగా తెలిసిన పేరు, అదే విధంగా ప్రధానమంత్రిగా అందరికి సుపరిచితమైన పేరు మోదీ మాత్రమే. ఈ మధ్యకాలంలో కొత్తగా ఓటు పొందినటువంటి దేశ యువత వారి వారి రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, మతాలకు, సంఘాలకి అతీతంగా దాదాపు ఎక్కువగా మంది ఇష్టపడే వ్యక్తిగా మోదీ ఉండడం కూడా మూడవసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక అనుకూలమైనటువంటి అంశంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇటీవల ఏర్పడ్డ ఇండియా కూటమిలో కూడా మోదీని ఎదుర్కొనే విధంగా ఒక బలమైన జాతీయ నాయకుడు లేకపోవడం కూడా ఇండియా కూటమికి ఒక ప్రతికూల అంశంగా పేర్కొనవచ్చు. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మాతోనే మళ్లీ యన్‌.డి.ఏ. కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచి మూడవసారి అధికారం చేపడుతుందని ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు కూడా చెబుతున్నాయి. ఓ రకంగా బిజెపి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోదీ కూడా కారణం అవుతాడని పలు సర్వేలు కూడా చెప్పడం బిజెపికి బాగా కలిసి వచ్చే అంశంగా పేర్కొనవచ్చు. చివరగా, అంతర్జాతీయంగా, జాతీయంగా ఏ సంస్థకు చెందిన సర్వే తీసుకున్న అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రిగా, ప్రభావంతమైన వ్యక్తిగా, నాయకుడిగా మోదీ వస్తున్నారంటే ఇది భారతదేశానికి గర్వకారంగా చెప్పుకోవచ్చు.

  • డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News