Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Modi Mantra: మోడీ మోడీ మోడీ..ఇదే బీజేపీ ఎన్నికల నినాదం

Modi Mantra: మోడీ మోడీ మోడీ..ఇదే బీజేపీ ఎన్నికల నినాదం

మోడీ మోడీ మోడీ.. ఇదే 2024 బీజేపీ ఎన్నికల నినాదం. అందరూ ఊహించినట్టే బీజేపీ ఏకైక అస్త్రం మోడీ మాత్రమే. కాబట్టి ఎన్నికల్లో కూడా పోస్టర్ బాయ్ మోడీనే. మోడీ కోసం మోడీనే కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా తిరగక తప్పని పరిస్థితి. అదేమంటే మోడీ తప్పితే ప్రస్తుతం బీజేపీలో ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న నేత మరొక్కరు లేనేలేరు. ఇది నిర్వివాద అంశం అందుకే పార్టీని మించి ఎదిగిన మోడీ పెత్తనాన్ని ఆర్ఎస్ఎస్ భరించక తప్పటం లేదనే సన్నాయి నొక్కులు తరచూ ఆఫ్ ది రికార్డ్ గా వినిపిస్తుంటాయి.

- Advertisement -

పార్టీ, ప్రభుత్వం అంతా వన్ మ్యాన్ షో అన్నట్టు సాగుతోంది. అక్కడికీ మోడీ ఈమద్య నేషనల్ ఎగ్జిక్యుటివే భేటీలో ఈ విషయంపై పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అన్నిటికీ మోడీ వస్తాడనుకోకండి.. మోడీ రావాల్సిందే.. మోడీ వస్తే గెలుపు తథ్యం అనే మైండ్ సెట్ నుంచి మారాలి అని సీరియస్ గా హితబోధ చేశారు మోడీ. ప్రతి చిన్నా, పెద్ద పనికి తన ఇమేజ్, తన పేరు వాడుకోవటంపై మోడీ గతంలోనూ పలుమార్లు అభ్యంతర పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇక మోడీ అనే పేరు ఓ తారక మంత్రంగా మారింది. అయిన దానికి కాని దానికీ అన్నిటికీ ఒకటే మంత్రం ప్రయోగిస్తూ మోడీ నామ జపం చేయటం పార్టీకి అలవాటుగా మారింది.

మొన్నటికి మొన్న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ స్వయంగా రెబెల్ బీజేపీ నేతలకు కాల్స్ ఘుమాయించక తప్పని దుస్థితి. ఈ ఆడియో కాల్స్ అన్నీ వైరల్ అయ్యాయి కూడా. ఒక అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి.. పలు నియోజక వర్గాల్లో తమకు టికెట్ కేటాయించలేదని అలక బూనిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలవటాన్ని మోడీ వ్యక్తిగత హోదాలు అడ్డుకునే ప్రయత్నం చేయక గత్యంతరం లేని పరిస్థితులు దాపురించాయి. దీంతో మోడీ రెబెల్స్ కు కాల్స్ చేసి, బుజ్జగించే పనిలో పడ్డా చివరి నిమిషం కాబట్టి ఎన్నికల నామినేషన్ వెనక్కు తీసుకునే గడువు కూడా అయిపోయిన నేపథ్యంలో చేసేది లేక మోడీ రెబెల్స్ ను బుజ్జగించి కామ్ అయిపోయారు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ సాగుతున్న తీరే.

క్రమంగా భారతీయ జనతా పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోతోంది. ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అంటే ఆమాత్రం అభిప్రాయ బేధాలు ఉండవంటారా? సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన పాత బీజేపీ నేతలకు బయటి నుంచి, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి దిగుమతి అయిన నేతల మధ్య సైద్ధాంతిక విభేదాలు చాలా ఉన్నాయి. ఈగో క్లాషెస్ కు లెక్కేలేదు. ఇంతకాలం బీజేపీ జెండా, అజెండా మోసిన తమను కాదని బయటి నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత పెరగటం, వారికి అధికారం కట్టబెట్టడాన్ని ఓల్డ్ గార్డ్స్ ఎలాగూ భరించలేరు. ఇలాంటి సంఘటనలు ఇటు తెలంగాణలో అటు వెస్ట్ బెంగాల్ తోపాటు పలు రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటల రూపంలో బయటకు వస్తూనే ఉంది. మరి ఈ చిన్న చిన్న తగాదాలను కూడా మోడీ స్థాయి వ్యక్తి వచ్చి పరిష్కరించాలంటే అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. మరోవైపు వయసులో పెద్ద వారైన మోడీ దేశ వ్యవహారాలు చక్కబెడుతూనే పార్టీపై కర్ర పెత్తనం చేయాలంటే అది సాధ్యమయ్యే పని కానే కాదు.

ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఇమేజ్ అనే ఏకైక ఆయుధంతో యుద్ధానికి బీజేపీ సిద్ధమవుతోంది. మోడీ వన్స్ ఎగైన్ అనే హ్యాష్ ట్యాగ్ తో మోడీ సైన్యం ఎన్నికల బరిలోకే దిగుతోంది. వరుసగా మూడవసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టే కసిలో ఉన్న మోడీ-షా. 72 ఏళ్ల మోడీ ఎలాగైనా మూడవ సారి అతి పెద్ద మెజార్టీతో ప్రధాని పదవిని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం మోడీ ఎలాగైనా తన పేరు చరిత్రలో పదిలంగా, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఉన్నారని రాజకీయ పండితులంతా అంచనా వేస్తున్నారు. నెహ్రూ, ఇందిరా, వాజ్ పేయి వంటి వారి సరసన తన పేరుండాలని మోడీ బలంగా కోరుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతుండటంలో చాలా వరకు నిజం ఉందని కొందరు బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు కూడా. నెహ్రూ వరుసగా మూడుసార్లు దేశాన్ని ఏలినట్టు తన పేరు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

మీరు గమనించండి మోడీ తలపెట్టిన భారతదేశంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు వంటివి మీకు నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాన్ని కళ్లకు కట్టినట్టు అలీనోద్యమ కాలం నాటి పరిస్థితులు గుర్తు చేస్తాయి. పిల్లలతో పరీక్షా పే చర్చా అన్నా ఇంకోటి మరోటి అన్నా అవన్నీ చాచా నెహ్రూ స్టైల్ ను ఇమిటేట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతాయి. బాలల దినోత్సవం, టీచర్స్ డే వంటివన్నీ మోడీ ఎంత డిప్లమాటిక్ గా హైజాక్ చేశారో మనం 9 ఏళ్లుగా చూస్తున్నాం.

ఇక సోషల్ మీడియా ప్రపంచంలో మోడీ రారాజు అంటే అతిశయోక్తి కాదు. మోడీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ అత్యద్భుతం అనటంలో సంకోచించాల్సిన పని లేనేలేదు. ఇక స్లోగన్స్ ఇవ్వటంలో మోడీ తరువాతే ఎవరైనా అన్నట్టు ఆయనకు ప్రసంగాలు రాసేవారు దొరికారు. అందుకే మోడీ తన మాటల వాగ్భాణాలను సరికొత్తగా, ఆలోచింప చేసేలా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ఇంగ్లీష్, హిందీల్లో ఆయన చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు, ప్రసంగాలు అన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా అతి జాగ్రత్త తీసుకునే బలమైన బృందం మోడీ అసలు బలం. అందుకే సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోడీ ఎదిగారు.

ఎన్నికల్లో ఓటమెరుగని నేతగా మోడీకి అత్యంత బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 2001 నుంచి గుజరాత్ లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ, గెలుస్తూ వస్తున్నారు. మోడీకి ఎన్నికల్లో తిరుగు లేదంతే అనేలా ఇప్పటి వరకు ఆయన విజయ పరంపర సాగుతూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయన విజయ శిఖరాలకు చేరి నవ భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ చాప్టర్ ను లిఖించటంలో నిమగ్నమై ఉన్నారు.

మోడీ పోటీలో ఉన్న ఏ ఎన్నికలైనా అంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్సభ ఎన్నికలైనా అవి ప్రెసిడెన్షియల్ ఎన్నికలను గుర్తు చేస్తాయి. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ పార్టీ నొక్కి చెప్పింది. గెలుపు అనేది మోడీ ఇంటిపేరు, విజయచిహ్నం మోడీనే అంటూ రకరకాలుగా అభివర్ణించటంలో ఆయన ట్రాక్ రికార్డ్ దాగి ఉంది. బాల్ ఠాక్రే తరువాత ‘హిందూ హృదయ సమ్రాట్’ అనే పేరుతో మోడీని పిలవటం రొటీన్ గా మారింది కూడా. డెవలప్మెంట్ మ్యాన్ అంటూ మరో టైటిల్ కూడా మోడీకి ఉండగా తాజాగా ‘గ్లోబల్ స్టేట్స్ మ్యాన్’ అని కూడా ఆయన అభిమానులు పిలవటం మొదలుపెట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు పెద్దన్నయ్యలా మోడీ హితబోధ చేశారు. ”ఇది యుద్ధాల శకం కాదం”టూ మోడీ ప్రపంచ దేశాలకు బోధించటంతో గ్లోబల్ స్టేట్స్ మ్యాన్ అని పిలుస్తున్నారు.

త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ తరచూ కర్నాటకకు వస్తే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని సీఎం బసవరాజు బొమ్మై మోడీకి విజ్ఞప్తి చేశారు. కాగా ఎలాగైనా కర్నాటకలో మళ్లీ అధికారం నిలబెట్టుకుని దక్షిణాదిన పార్టీని విస్తరించాలని మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాది పార్టీగా, అగ్రవర్ణ పార్టీగా, పట్టణ పార్టీగా, హిందూ పార్టీగా బీజేపీకి ఉన్న ముద్రను చెరిపేయాలని మోడీ స్వయంగా సర్వం ఒడ్డుతూ పార్టీ కార్యకర్తలను కూడా ఒళ్లొంచి పనిచేయమని నూరిపోస్తున్నారు. అందుకే చర్చిలు సందర్శించాలని, మైనారిటీ వర్గాల వారు ఓట్లు వేయాలని ఆశించకుండా సూపీ నైట్స్ వంటివి ఏర్పాటు చేసి మైనారిటీలకు దగ్గరవ్వాలని మోడీ పదేపదే చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News