Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్పార్లమెంట్‌ కమిటీల ఏర్పాటులో పక్షపాతం!

పార్లమెంట్‌ కమిటీల ఏర్పాటులో పక్షపాతం!

దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం..

పార్లమెంటుకు చెందిన స్థాండింగ్‌ కమిటీల ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. ఈ కమిటీల్లో ప్రతిపక్షాలకు కూడా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీలు పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగిపోవడానికి అవకాశం కల్పిస్తుంటాయి. అయితే, ఈ కమిటీలను ఏర్పాటు చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాన్చివేత ధోరణిని అనుసరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యసభలో పాలక పక్ష నాయకుడు జె.పి. నడ్డాకు తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రయన్‌ ఈ మేరకు ఇటీవల ఓ లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఆలస్యాలూ చేయడం లేదని, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని కనుక, ఈ చర్చల వల్ల కాలయాపన జరుగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ జిజిజు సమాధానమిచ్చారు.
ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి మొత్తం 24 పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్లమెంటులో వివిధ పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి ఈ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది. ఇదివరకటి లోక్‌ సభలో కంటే ప్రస్తుత లోక్‌ సభలో ప్రతిపక్షాలకు సంఖ్యా బలం పెరిగినందు వల్ల తమకు ప్రాతినిధ్యాన్ని పెంచాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అంతేకాక, కొన్ని అతి ముఖ్య మంత్రిత్వ శాఖలకు చెందిన కమిటీలకు తమనే చైర్మన్లుగా నియమించాలని కూడా అవి కోరుతున్నాయి. గత లోక్‌ సభలో బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందు వల్ల అత్యధిక కమిటీలకు బీజేపీకి చెందిన సభ్యులే చైర్మన్లుగా వ్యవహరించడం జరిగింది. కొన్ని బిల్లులను నిష్పక్షపాతంగా పరిశీలించడం, దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. అయితే, పాలక పక్షం ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది ఇలా ఉండగా, గత నెల ఆరు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను, కంప్ట్రోలర్‌ అండ్ ఆడిటర్‌ జనరల్‌ నివేదికలను పరిశీలించే అతి ముఖ్యమైన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి చైర్మన్‌ గా కాంగ్రెస్‌ సభ్యుడిని నియమించడం జరిగింది. మరో ముఖ్యమైన విదేశీ వ్యవహారాల కమిటీతో సహా లోక్‌ సభలో మూడు కమిటీలకు, రాజ్యసభలో ఒక కమిటీకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులనే చైర్మన్లుగా నియమించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే పద్ధతిలో సమాజ్‌ వాదీ పార్టీ, డి.ఎం.కె, తృణమూల్‌ కాంగ్రెస్‌ లకు కూడా తలా ఒక కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఇతర వెనుక బడిన తరగతుల కమిటీ, అంచనాల కమిటీలతో సహా నాలుగు కమిటీల ఏర్పాటును కూడా పూర్తి చేసింది. ఈ కమిటీలకు బీజేపీ ఎంపీలే చైర్మన్లుగా ఉంటారు. ఈ కమిటీలన్నీ పార్లమెంటు వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగాలు. పార్లమెంటరీ వ్యవహారాలు, కార్యకలాపాల నిర్వహణలో ఇవి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏడాదిలో పార్లమెంట్‌ ఉభయ సభలు 70 నుంచి 75 రోజుల వరకూ సమావేశమవుతాయి. ఇందులో కూడా చాలా రోజులు అరుపులు, కేకలు, గందరగోళాల వల్ల వృథా అయిపోతుంటాయి. అందువల్ల అనేక బిల్లులను పార్లమెంట్‌ పరిశీలించడం జరగడం లేదు. ఏడాదంతా పనిచేసే ఈ కమిటీలు ఈ బిల్లులను, ఇతర వ్యవహారాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.
బిల్లులను మెరుగుపరచడానికి ఈ కమిటీలలోని సభ్యులు, అధికారులు, నిపుణులు విలువైన సలహాలు, సూచనలతో పాటు అవసర సమాచారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. పాలక, ప్రతిపక్షాల సభ్యులు తమ బాధ్యతలను అంకిత భావంతో, సమర్థవంతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. పక్షపాత ధోరణితో వ్యవహరించకపోవడం చాలా అవసరం. దేశ భద్రత, ఎన్నికల నిర్వహణ, రాష్ట్రాలతో సంబంధాలు వంటి కీలక విషయాలు, బిల్లులు ఈ కమిటీల పరిశీలనకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. సమర్థవంతమైన, పటిష్టమైన కమిటీ వ్యవస్థ వల్ల పారదర్శకత పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News