Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్INDIA alliance: వామ్మో.. మోడీ స్కెచ్ మామూలుగా లేదే

INDIA alliance: వామ్మో.. మోడీ స్కెచ్ మామూలుగా లేదే

ప్రతిపక్ష కూటమిలో చిచ్చుపెట్టిందేవరు?

ఇండీ కూటమికి పురిట్లోనే సంధి కొట్టినట్టయింది. ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే దాదాపు అంతరించి పోయింది. నరేంద్ర మోదీని గద్దె దించాలనే ఏకైక సదాశయంతో చేతులు కలిపిన ప్రతిపక్షాలలో చిచ్చు పెట్టిం దేవరు? ఎందుకిలా రసాభాసమయింది? రాజకీయాలనే సరికి ఎత్తులు పైఎత్తులు తప్పవు. అందులోనూ ఎన్నికల సమయంలో ఇవి మరీ ఉధృతంగా, మరీ నిర్దాక్షిణ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఆందోళనకర విషయమేమిటంటే, ఇప్పటి రాజకీయాలు పార్లమెంటు సమావేశాలను కూడా తమ లక్ష్య సాధనకు, ప్రత్యర్థులపై దాడికి బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కాంగ్రెస్‌ పార్టీ తదితర ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. సోషల్‌ మీడియా ప్రకారం చూస్తే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చివరికి చైనా పాలకులను, జార్జి సోరోస్‌ను కూడా మోదీని దెబ్బ కొట్టడానికి ఉపయోగించుకుంది. మోదీ, తదితర బీజేపీ నాయకులు, మంత్రులు కూడా కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తదితర ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేయడానికి, ఎదురు దాడి సాగించడానికి తమ వంతుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఎవరి ఎత్తులు, జిత్తులు గొప్పవో సార్వత్రిక ఎన్నికలతో తేలిపోతుంది.
బీజేపీని ఏదో విధంగా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యం తో 28 పార్టీలతో ‘ఇండియా’ పేరుతో ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి ఆయనను గద్దె దించడం తప్ప, మరో లక్ష్యం లేకుండా, మరో ఎజెండా లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రపంచ స్థాయి రికార్డే కానీ, ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచిస్తారన్న ధ్యాస కూడా లేకుండా ప్రతి పక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. పాద యాత్రలు జరిపాయి. ఎన్నో అవాకులు చవాకులు పేలాయి. చివరికి ఈ కూటమికి సారథి ఎవరో తెలియక, ప్రధాని అభ్యర్థి ఎవరో నిర్ణయించ లేక, సీట్లను ఏ విధంగా పంచుకోవాలో కూడా తెలియక, ఎజెండాను తేల్చలేక ఈ కూటమి కకావికలైంది. నరేంద్ర మోదీ ‘ఇండియా’ అనే పేరుతో ఈ కూటమిని ఏర్పాటు చేయగానే, ఇండియా పేరును భారత్‌ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి దేశాన్ని ఇండియా అని పిలవరాదని, భారత్‌గా పరిగణించాలని ఆయన దేశ ప్రజలను కోరిన దగ్గర నుంచి ఈ ప్రతిపక్ష కూటమిలో అలజడి, అయోమయాలు ప్రారంభమయ్యాయి. భారతదేశానికంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమిగా తాము పెట్టుకున్న ఇండియా అనే పేరుకు విశ్వసనీయత ఏర్పడదన్న భయం వాటిని పట్టుకుంది. ఫలితంగా ప్రతిపక్ష కూటమిలో కొద్దిపాటి అస్థిరత మొదలైంది. మోదీ అండ్ కోని తక్కువ అంచనా వేసిన ప్రతిపక్ష కూటమి మీద మొదటి దెబ్బ పడింది.
ఎత్తులు పైఎత్తులు
మోదీ అంతటితో ఆగలేదు. ఎన్నికలలోగా ఈ కూటమిని బలహీనపరచడమే ఏకైక ధ్యేయంగా ఆయన మరో ఎత్తుకు శ్రీకారం చుట్టారు. ఆయన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇక్కడ రామాలయం ప్రారంభం అవుతుందనే విషయం 2019లోనే ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అంశంలో కొత్త ఎత్తుగడేమీ లేదు కానీ, రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించడమే ఇప్పుడు మోదీ వేసిన ఎత్తు. ఆయన ప్రతిపక్షాలను ఆహ్వానించిన మరుక్షణం నుంచి ఆ పార్టీల నాయకుల్లో, ముఖ్యంగా ఇండీ కూటమి నాయకుల్లో అలజడి, కంగారు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధ పరిస్థితిలో ప్రతిపక్ష కూటమి సభ్య పక్షాలు కొట్టుమిట్టాడాయి. ప్రాణ ప్రతిష్ఠకు వెడితే ముస్లింల ఓట్లు పోతాయనే భయం. వెళ్లకపోతే హిందువుల ఓట్లు పోతాయనే ఆందోళన. ప్రతిపక్షాలు ఎటూ తేల్చుకోలేక పోయాయి. ఇది ఈ కూటమిలో మరికొన్ని బీటలకు కారణమైంది.
మోదీని, ఆయన పార్టీని ఒక దెబ్బ కొట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తే ఆయన అయిదు దెబ్బలు కొట్టి తానే పైచేయిగా నిలిచారు. ప్రతిపక్షాలకు రానురానూ తమ కూటమి మీద తమకే నమ్మకం పోవడం మొదలైంది. సభలు, సమావేశాలు తగ్గిపోయాయి. కలవడమే మానుకోవడం జరిగింది. వాటి విభేదాలు క్రమంగా బహిరంగమవటం కూడా మొదలైంది. మోదీ అక్కడితో ఆగలేదు. ప్రతి పక్షాల మీద మరో దెబ్బ వేయడానికి పన్నాగం ప్రారంభమైంది. ఈసారి ఆయన మళ్లీ ఒకే దేశం, ఒకే ఎన్నికలనే నినాదం చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపడం మంచిదని ప్రధాని ప్రకటించారో లేదో ప్రతిపక్షాల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీని మరో పార్టీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పడిన కూటమి రాష్ట్ర ఎన్నికల్లో ఎటువంటి పాత్రను పోషించాలో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. ప్రతిపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటో వాటికి దిక్కు తోచలేదు.
ఎవరి గోల వారిది
మోదీ ఎత్తు మరోసారి ఫలించింది. ప్రతిపక్ష కూటమి నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తంకావడం ప్రారంభమైంది. ఈ కూటమిలో కొనసాగడంపై ప్రతిపక్షాలు పునరాలోచించడం మొదలైంది. తమ సంగతి తామే చూసుకోవడం మంచిదనే అభిప్రాయానికి కాంగ్రెస్‌ పార్టీ వచ్చేసింది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, నితీశ్‌ కుమార్‌ వంటి అగ్రనేతలు కూటమికి వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. రాహుల్‌ గాంధీ మళ్లీ పాద యాత్రకు నడుంబిగించారు. ఈ నిర్ణయం గురించి ప్రతిపక్షాలకు నామమాత్రంగా కూడా తెలియజేయకపోవడం మరింతగా అగ్నిని రాజేసింది.
ఆ తర్వాత మోదీ మరో పన్నాగానికి తెర తీశారు. ప్రతిపక్ష కూటమికి రూపకర్త అయిన బీహార్‌ ముఖ్యమంత్రి, జె.డి(యు) అధినేత అయిన నితీశ్‌ కుమార్‌ ఈ కూటమి నుంచి బయటపడ్డారు. తాను బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రకటించడమే తరువాయి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్‌.డి.ఎ తోడ్పాటుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్‌ పొత్తుతో అధికారంలో ఉన్నారు. నితీశ్‌ కుమార్‌ ప్రతిపక్ష కూటమి నుంచి తప్పుకోవడంతో ’ఇండియా‘ మూల స్తంభం కూలిపోయింది. ఈ కూటమి కకావికలమవడం అనే ప్రక్రియకు నాందీ ప్రస్తావన జరిగింది. కాంగ్రెస్‌ తో పొత్తు కుదర్చుకునే ప్రసక్తి లేదని మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ ప్రకటించేశారు. కేరళలో వామపక్షాలు సైతం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు ససేమిరా అనడం జరిగిపోయింది. కూటమి ఇంకా నిలదొక్కుకోనే లేదు. ఈలోగా చప్పగా చతికిలపడిపోయింది.
స్వార్థ రాజకీయాలు
మోదీ రాజకీయ వ్యూహాలు అక్కడితో ఆగలేదు. వివిధ రాష్ట్రాల్లోని పార్టీలతో ఆయన పార్టీ పొత్తు కుదుర్చుకోవడం, ఎన్‌.డి.ఎలో చేర్చుకోవడం ఊపందుకుంది. ఇండియా కూటమిలోని పార్టీలు సైతం ఎన్‌.డి.ఏ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా చిన్నా చితకా పార్టీలు ఎన్‌.డి.ఏ వైపు మొగ్గు చూపాయి. శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌.సి.పి చీలింది. అందులోని అజిత్‌ పవార్‌ వర్గం మోదీ వైపు అడుగులు వేసింది. శివసేన చీలిక వర్గం కూడా మోదీకి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఏ విధంగా చూసినా బీజేపీ బలీయమైన పార్టీగా ఉంది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేల సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా చాలావరకు అయోమయంగా తయారైంది. ఇప్పుడు మోదీ లక్ష్యం కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో ఓడించడం మాత్రమే కాదు. ఎన్నికల తర్వాత ఈ పార్టీ లేకుండా చేయడం మీద కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారనడానికి సంకేతాలు వెలువడుతున్నాయి.
మోదీ వ్యూహం ఏ స్థాయిలో ఉందంటే, ఎన్నికలు సమీపించేలోగా కాంగ్రెస్‌ పార్టీలోనే ముసలాన్ని సృష్టించే అవకాశం ఉంది. పార్లమెంటులో మోదీ తన చివరి ప్రసంగం చేసిన తీరును చూసినవారికి మోదీ ఏ విధంగా పరిగణిస్తున్నదీ, ఏ స్థాయిలో చూడబోతున్నదీ అర్థం అవుతుంది. ఎన్నికలు ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా ఆయన కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త వ్యూహాలు, తంత్రాలతో ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రకటించబోయే పథకాలు, కార్యక్రమాలు, తీసుకునే చర్యలు కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలహీనపరిచే అవకాశం ఉంది. ఆయన పి.వి. నరసింహారావు వంటి నాయకులకు సైతం భారతరత్న ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీయడానికేనన్నది అర్థమవుతూనే ఉంది. మోదీ స్థాయిలో వాగ్ధాటి, రాజకీయ చతురత, దూర దృష్టి, నాయకత్వంలేని కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతోందో అంతుబట్టకుండా ఉంది.

  • వి.సుదర్శనరావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News