ప్రధాన మంత్రిగా మోదీజీ మూడోసారి పదవిచేపట్టిన అనంతరం తొలి పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఆసందర్భంలో మోదీజీ మొఖంలో గతంలోని వర్చస్సు మసగబారింది. మాటల్లో వాడీ,వేడి, పదును తగ్గింది. ఆయన మాటలు హేతు రహితంగా పేలవంగా ఉన్నాయి. మూడోసారి ఎన్డీయే కూటమి గెలుచినా పార్టీ శ్రేణుల్లో ఓటమి ఛాయలే కనిపిస్తున్నాయి. మునుపటి ఉత్సాహం,ఊపూ లేదు. బీజేపీలో నిస్తేజం, బేలతనం,నీరసం ఆవహించింది. మోదీ గెలుపు అంచెనాలు,భారీ టార్గెట్ ఊహలు గతులు తప్పాయి.గోదీ మీడియా కల్పిత జోస్యాలు, విజయోత్సహం, కృత్రిమ హైపులు, ఆర్భాటపు ప్రకటనల రంగులు వెలిసిపోయాయి.
పర్యవసానంగా తొలి పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ విజృుంభణతో మోదీ కంఠం మూగబోయింది.రాహుల్ మాట్లాడుతున్నంత సేపూ మోదీ కళ్ళల్లో ఏదో కసి,ఉక్రోషం,సభలో అసహనంతో ఊగిపోవటం కనిపించింది.మోదీ తన భావోద్వేగాలను దాచుకో లేరు. ఆయన మొఖ కవళికలు, ఆయన కళ్ళు, చూసేచూపు,ఫ్రీజింగ్ ఫేస్, ఆయన రౌద్ర స్వభావాన్ని ప్రస్పుటంగా వెల్లడిస్తాయి. ఆయన అరుదుగా నవ్వుతారు.కానీ అందులోనూ సహజత్వం కనిపించదు. ఆయన మౌనంగా ఉన్నా ఆయనలో దాగి ఉన్న అశాంతి,విసుగు,అసహనం ఇట్టే ఇతరులకు తెలిసిపోతుంది.అందుకే “ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్” అని పెద్దలు అంటారేమో.
ప్రస్తుత సభలో ‘ఇండియా’ కూటమిలో ఉన్న ఐక్యత,ఉత్సహాం ద్విగుణీకృతం అయినట్లు కనిపించింది.వారి ఘాటైన సూటి విమర్శలు,లేవనెత్తిన నిత్య ప్రజా జీవన సమస్యలు బీజేపీ నేతలను కలవర పెట్టాయి.కాంగ్రేస్ (భారత్ కూటిమి)లో విపక్షంగా గత పదేళ్ళలో కనిపించని జవం,జీవం ఉరకలెత్తాయి.లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయా! ప్రజలలో విపక్షల పట్ల ఆశలు,అంచెనాలు చిగుళ్ళు తొడిగాయి.
అయితే మోదీ ప్రభుత్వం బాబూ,నితీష్ ఊతకర్రల సహాయంతో నిలబడినా… దాని మతతత్వ, నిరంకుశ పోకడలు సమసిపోయాయనే భ్రమల్లో విపక్షాలు, ప్రజలు,ప్రజా సంఘాలు ఎవరూ నిర్లిప్తంగా ఉండనవసరం లేదు.ప్రజాస్వామ్య మనగడ ప్రజల నిరంతర జాగరూకత, అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుంది.
అలాగే, మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేకపోయినా ఆయనను ఎదురించే సాహసం చంద్రబాబు,నితీష్ చేయలేరు.వారి రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక అభివృద్ధి నిధులు,పారిశ్రామిక రాయితీలు మొదలైన ఆర్ధిక పరిస్థితుల పైనే వారి దృష్టి ఉంది.వారికి ఇతర ఆకాంక్షలు,లక్ష్యాలంటూ ఏవీ లేవు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి ఆసక్తి లేదు. పైగా చంద్రబాబు పై ఉన్న పాత అవినీతి కేసుల మూలంగా మోదికి విధేయుడుగా ఉండక తప్పదు.మోదీని దేశ సమస్యల కోసం ప్రశ్నించే సహసం చేయరు.అలాగే నితిన్ కూడా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం తరచుగా పార్టీలు మారుతూ ఇప్పటికే దేశంలో కావలసినంత అపకీర్తితో బద్నాం అయ్యారు.ఆయనో ‘సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్’ పైగా మోదీ పాదాలు తాకటానికి ఆయన చేసిన ప్రయత్నం,లొంగుబాటుతనం దేశం అంతా మీడియాలో చూసింది.కనుక ఆయనతో కూడా మోదీ ప్రభుత్వానికి ఇప్పట్లో డోఖా లేదు. వీరి ఇద్దరికీ కేవలం తమ రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యం.మరో లక్ష్యం లేదు. వీరిద్దరి బలహీనతలు మోదీకి బాగా తెలుసు. మోదీ వారి రాష్ట్రాల ఆర్ధిక అవసరాలకు ఎంతో కొంత నిధులు విధిలిస్తే చాలు. వారు “కుక్కిన పేనులా..కిక్కురు మనరు”. అందుకే చంద్రబాబు,నితిన్ పార్టీలకు కేంద్ర మంత్రి వర్గంలో కీలకశాఖలు దక్కలేదు. అయినా మౌనంగా ఉన్నారు..బీజేపీకి పాలనలో ఎటువంటి మార్పులు చూడలేం.పాతమంత్రి వర్గమే కనీసం శాఖల మార్పులు లేకుండా మరోసారి కొనసాగుతుంది.వారి లక్షాలలో , ఆచరణలో ఎన్నికల ఫలితాల ప్రభావం, అభద్రతా భయాలు లేవు.ఈ సారి కూడా ఆరెస్సెస్,బీజేపీ పాత మతతత్త్వ చారిత్రిక ఎజెండా లక్షసాధనే ధేయంగా ఎన్డీయే పనిచేస్తుంది. చంద్రబాబు,నితిన్ మతమౌడ్యులు కారు.లౌకిక భావాలు కలవారే. కానీ వారి వ్యక్తిగత బలహీనతలు మోదీ ప్రణాళికలను, ఆచరణనను అడ్డుకోలేవు.
అయితే మొన్నటి వరకు రాహుల్ ను “పప్పు”గా భావించిన బీజేపీకి ఒక్కసారిగా విస్మయం కలిగేలా తన వాగ్ధాటితో పార్లమెంట్ లో అదరగొట్టాడు. ‘జూలు విదిల్చిన సింహాన్ని’ తలపించాడు. ప్రతిపక్ష నేతగా పరిణితి సాధించాడు. గతంలోని తన బలహీనతలను రాహుల్ అధిగమించాడు.ఆయన మాటల శైలిలో, భావ వ్యక్తీకరణ రీతిలో స్పష్టమైన ప్రగతి కనిపించింది. మోదీ స్టైల్ రాజకీయ హిందూత్వ పోకడలను రాహుల్ వెలికితీశాడు. మోదీ,యోగీ,అమిత్ షా ‘రాజకీయ పోకడల హిందుత్వ సిధాంతంలో గుట్టును విప్పి చెప్పాడు. దానిలో “హింస, హింస, హింస”, నఫరత్, నఫరత్,నఫరత్” మర్మాన్ని దేశ ప్రజలకు భహిర్గత పరిచాడు.అసలు హిందూ మతం శాంతికి,విశ్వ కల్యాణానికి, సత్యానికి,పేమకు,పరమత సహనానికి, ‘అహింస’కు ప్రతిరూపం అని అన్నాడు. హిందూ మతానికీ…బీజేపీ ‘హిందుత్వా”నికి సంబంధం లేదనీ, బీజేపీ,ఆరెస్సెస్ హిందూ మతానికి ప్రతీకలు కాదని స్పష్టంగా లోక్ సభలో ఎలుగెత్తి చాటాడు.మోదీ,యోగీ,అమిత్ షా,హిందూ మతానికి ప్రతీకలు కారనీ, వారిని హిందూ మతోద్ధారకులుగా చెప్పరాదని లోకానికి చాటాడు.
రాహుల్ తొలి ప్రసంగంలోనే అనూహ్యంగా బీజేపీ మత రాజకీయాలపై బలమైన పంజా విసిరాడు. ప్రజల్లో ఇప్పటికే బీజేపీ మతమౌడ్యంపై ఏవగింపు కలిగింది.గత పదేళ్ళలో భారత ప్రజల్లో మతం పేరుతో విభజన విష భీజాలు నాటింది. తరతరాల భావ సమైక్యకతకు,పరమత సహన భావనకు విఘాతం సృష్టించింది. ప్రతిచిన్న విషయాన్నీ మతంతో ముడిపెట్టంది.మైనార్టీ మతస్తులను హిందువులు ద్వేషించేలా విస్తృతంగా బహిరంగ సభలో మోదీ ప్రసింగించాడు.విపక్షాలు పిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పెడచెవిన పెట్టింది.అందుకే రాహుల్ ఈ బీజేపీ మత ఎత్తుగడను చెక్ పెట్టేలా సభలో ఘాటుగా విమర్శంచాడు.
గోదీ మీడియా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి బీజేపీకి ఎన్నికల్లో విజయానికి కృషి చేసినా ..ప్రజలు ఈ కుతంత్రాలను అర్ధం చేసుకొని ఎన్డీఏకి బ్రేకులు వేశారు. మోదీకి సంపూర్ణ మెజార్టీని తిరస్కరించారు.భవిష్యత్తులో మోదీ మత వివక్షతా రాజకీయాలకు కాలం చెల్లినట్లేనా!! ఆరెస్సెస్ నేత భగవత్ మొన్నటి ఉపన్యాసంలో సూచనలు, అధికార పత్రిక ‘పాంచజన్యం ‘ లో వ్యాసాల సారం మోదీ ప్రవర్తనలో, పార్టీ విధానాలలో మార్పు వస్తుందా? వేచి చూడాలి.
గోదీ మీడియా ఎన్నికల ఫలితాల జోస్యాలు,బూటకపు సర్వే ఫలితాలు స్టాక్ మార్కెట్ హైప్ ను పెంచటానికి చేసిన జిమ్మిక్కేనని ప్రజలకు తెలిసి పోయింది. ప్రధాన మంత్రి మోదీ ,దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ బ్రోకర్ల అవతారం ఎత్తడం ఆశ్ఛర్యం. అధికార హోదాలో వారు ఇన్ వెస్టర్లకు పదే,పదే తమ సంపద పెరుగుతుందని అదానీ,అంబానీ మీడియా ఛానళ్ళలో తప్పుడు ప్రచారం చేశారు. లక్షలాది పేద,మధ్య తరగతి ప్రజలు వారి మాటలు నమ్మారు. పెట్టుబడులు పెట్టారు.ఒక్క రోజులోనే..ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మదుపర్ల వేల కోట్ల ప్రజా ధనం ఆవిరైపోయింది. సామాన్య మధ్య తరగతి ప్రజలు కోలుకోలేనంత నష్టపోయారు. వారి ఆశలకు,కష్టార్జితానికి గోదీ మీడియా తీరని హాని చేశాయి.వారు ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు.ఇక ముందు వారి మాటలు నమ్మేవారు లేరు. ఇంత పెద్ధ ఎకనమిక్ ఫ్రాడ్, స్కామ్ పై ఈడీ,సీబీఐ,సెబీ మొదలైన సంస్థలకు ఏమీ పట్టదా?ఇలాంటి స్కాములు వారికి ఏమీ కనపడవా?వినపడవా? ఈ రాజ్యాంగ సంస్థలు ఈ విషయంలో స్వచ్ఛందగా విచారణ చేపడతాయా? సందేహమే.
దక్షిణ భారతంలో బీజేపీ కేరళలో ఒక సీటుతో అడుగు పెట్టింది. ఏపీలో బాబు,పవన్ కల్యాణ్ తో జతకట్టి
పార్టీ బలం,సీట్లు పెంచుకుంది. తెలంగాణలో డబల్ స్థానాలు దక్కించుకుంది.ఓట్లశాతం పెరిగింది.కాంగ్రేస్ లోకి బీఆర్ఎస్, ఎంఎల్ఏ లు పార్టీ ఫిరాయిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అందువల్ల బీజేపీని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు.ఒకప్పుడు ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ సీట్లు తగ్గినప్పుడు దక్షిణ భారత్ సీట్ల బలంతో ఆదుకున్నట్టే.. ఇప్పుడు ఏపీలో బీజేపీ చంద్రబాబు,పవన్ అండతో తెలంగాణలో 8 సీట్లతో కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది.
కనుక విపక్ష భారత్ కూటమి ఐక్యమత్యంపై,ప్రజల నిరంతర అప్రమత్తతపై,ప్రజా సంఘాలు,సివిల్ సొసైటీ చైతన్యం,ఉమ్మడి కృషిపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్. 9849328496.