Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్National civil service day: నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

National civil service day: నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

ఛార్లెస్ కార్న్ వాలిస్, “ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా”

భారత దేశంలో చదువుకున్న వారందరికీ “సివిల్ సర్వెంట్” అంటే తెలుసో లేదో చెప్పడం కష్టం కానీ “ఐఏఎస్ – ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్” అధికారి అంటే ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికార హోదాలో ఉండే వ్యక్తి అని మాత్రం ఘంటాపథంగా తెలుసు. బ్రిటిష్-ఇండియా పాలనలో ఇది “ఐసిఎస్ – ఇండియన్ సివిల్ సర్వీస్”గా ఉండేది. కాగా అప్పట్లో ఎక్కువ మంది ఐసిఎస్ అధికారులు ఆంగ్లేయులు కావడం, శిక్షణ విదేశంలో ఉండడంతో వారిలో సహజ భారతీయ లక్షణాలైన సేవాతత్పరత లోపించడంతో పాటు వారి విధేయత భారత పౌరుల పట్ల కాకుండా బ్రిటిష్ వారి పట్ల కేంద్రీకృతమయ్యేది. స్వాతంత్ర్యానంతరం భారతీయీకరణలో భాగంగా “ఐసిఎస్”ను “ఐఏఎస్”గా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. భారత ఉక్కు మనిషి – సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఏప్రిల్ 21, 1947న స్వతంత్ర భారతావనిలో మొట్ట మొదటి బ్యాచ్ పౌర సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారిని ప్రభుత్వ విధానాలను త్రికరణశుద్ధిగా అమలు చేసే అధికారులుగానే కాక ప్రభుత్వ విధానాల రూపకల్పన మరియు కార్యక్రమాలను మథించే పాలనా చక్రపు మూలస్తంభానికి “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు. అంతటి మహత్తరమైన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న “సివిల్ సర్వీసెస్ డే” నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్‌కు జాతీయ లక్ష్యాలను ఆపాదింపచేయడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ “అఖిల భారత సేవల పితామహుడి”గా పేరుగాంచారు.

- Advertisement -

ఐసిఎస్ స్థాపన:

1857 నాటి సిపాయిల తిరుగుబాటు అనంతరం భారతదేశ నియంత్రణను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ సామ్రాజ్ఞికి బదిలీ చేసిన తర్వాత, బ్రిటీష్ ఇండియా పరిపాలనను క్రమబద్ధీకరించడానికి మరియు వృత్తిపరంగా రూపొందించడానికి ఐసిఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) సృష్టించబడింది. 1864లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌ (ఐసిఎస్)కు ఎంపిక కాబడి బొంబాయిలో నియమితుడైన తొలి భారతీయుడు సత్యేంద్ర నాథ్ ఠాగూర్ (విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న) 1897 వరకు విధినిర్వహణలో ఉన్నారు. బ్రిటిష్ ఇండియాలో వివిధ పరిపాలనా విధులు మరియు పాలనా నిర్వహణ బాధ్యత వహించిన ‘ఐసిఎస్’ స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన భారత దేశంలో, ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)గా పునర్వ్యవస్థీకరించబడింది. స్వాతంత్రోద్యమ కాలంలో కొంతమంది అధికారులు నాటి భారతీయ రాజకీయ నాయకులకు మరియు స్వయం పాలన అంశానికి మద్దతు ఇవ్వగా మరికొందరు మాత్రం బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండిపోయారు. స్వాతంత్య్రానంతరం దేశ పరిపాలన మరియు విధానరూపకల్పనలో ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. భారత్ లో సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా వారెన్ హేస్టింగ్స్ గుర్తింపబడినప్పటికీ సివిల్ సర్వీసెస్ అంతర్గత పనితీరు, సంస్కరణలు మరియు ఆధునీకరణను చేపట్టిన వ్యక్తిగా ఛార్లెస్ కార్న్ వాలిస్ “ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా”గా పేరు గడించారు.

ఐఏఎస్:

భారత దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) 1946లో ఉనికి లోకి వచ్చింది. ఐఏఎస్ అనేది భారతీయ యువతకెందరికో కలల ఉద్యోగం. ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించడం అంటే ప్రభావవంతమైన ప్రభుత్వ కార్యక్రమాలకు నాయకత్వం వహించడంతో పాటు దేశ ప్రగతికి దోహదపడే విధానరూపకల్పనలో భాగస్వామ్యం పంచుకునే ప్రతిష్టాత్మక అధికార హోదా కలిగి ఉండడం. ఐఏఎస్ అధికారులను ఎంపిక చేయడానికి మన దేశంలో మొదటి సారి 1949లో పోటీ పరీక్ష నిర్వహించగా సత్యేంద్రనాథ్ ఠాగూర్ (విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మనవడు) ప్రథమ స్థానం కైవసం చేసుకుని స్వతంత్ర భారత దేశపు మొట్టమొదటి పురుష ఐఏఎస్ అధికారి అయ్యారు. అంతకు పూర్వం 1934లో లండన్ లో ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఆ తరువాత దశాబ్దం పాటు బ్రిటిష్-ఇండియాలో వివిధ హోదాలలో పని చేసారు. ఈ విధంగా ఆయన గడించిన అనుభవం స్వాతంత్ర్యానంతరం భారత్ లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునీకరణకు ఎంతగానో ఉపయోగపడింది. దేశ తొలి ఐఏఎస్ అధికారిగా ఆయన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో తన దీక్షాదక్షతలతో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా, దేశాభివృద్ధే లక్ష్యంగా ఆయన పంచవర్ష ప్రణాలికల రూపకల్పనలో కీలక భూమిక నిర్వహించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ గా ఆయన రైల్వేల ఆధునీకరణతో పాటు దేశంలోని అత్యధిక ప్రాంతాలకు రైలు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించేందుకు విశేష కృషి చేసారు. 1986లో 80 సంవత్సరాల వయసులో కేంద్ర 8వ వేతన సవరణ కమిషన్ ఛైర్మన్ గా ఆయన తన అపారమైన అనుభవాన్ని రంగరించి ఆ పదవికి న్యాయం చేసారు.

కేరళ, అలెప్పీలో జన్మించిన అన్నారాజమ్ మల్హోత్రా 1950లో భారతదేశపు మొదటి మహిళా ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. మద్రాసు తొలి ముఖ్యమంత్రి సీ రాజగోపాలచారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమె మొత్తం ఏడుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసారు. 1982లో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 9వ ఆసియా క్రీడల వ్యవహారాలను పర్యవేక్షించడం, ముంబైలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించడంతో పాటు ఆ ట్రస్ట్‌కు ఆమె ఛైర్పర్సన్‌గా కూడా వ్యవహరించారు.

సివిల్ సర్వెంట్స్ విధులు:

ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, సమర్థవంతమైన పాలన కొనసాగేలా చూడడం, పౌరుల ఆరోగ్య సంరక్షణ, విద్య, పారిశుధ్యం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, శాంతి భద్రతలు, భూమిశిస్తు, భూ నిర్వహణ మరియు సివిల్ రిజిస్ట్రేషన్‌తో సహా పరిపాలనా విధులను నిర్వహించడం, ప్రాజెక్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల రూపకల్పన, పట్టణ మరియు గ్రామీణాభివృద్ధి పథకాల ప్రణాళిక అమలు, చట్టాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించడం, వ్యక్తులు మరియు సంస్థలు చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడడం, సంక్షోభాలు, విపత్తులు మరియు అత్యవసర పరిస్థితులలో సహాయ పునరావాస చర్యలను సమన్వయం చేయడం, పౌర సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారం, ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన కల్పించడం, ప్రభుత్వ నిధులు మరియు వనరుల హేతుబద్ధ మరియు సమర్ధవంత నిర్వహణ, ప్రాజెక్ట్‌ల పురోగతిని పర్యవేక్షించి వాటి వలన ఒనగూరే ప్రజా ప్రయోజనాన్ని అంచనా వేయడం, వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు మరియు వాటాదారులను సమన్వయపరచడం, జిల్లా మేజిస్ట్రేట్‌లు లేదా కలెక్టర్‌లుగా అభివృద్ధి కార్యక్రమాలు, చట్టాల అమలును పర్యవేక్షించడం లాంటి విధులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా నిర్వహిస్తారు.

ఇండియన్ సివిల్ సర్వీసెస్:

మొత్తం 24 సివిల్ సర్వీసెస్‌ కోసం సంవత్సరానికి ఒకసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు లక్షలాది మంది ఔత్సాహికులు హాజరైనప్పటికీ, కేవలం కొన్ని వేల మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. అంచెల వారీగా నిర్వహించే ప్రిలిమినరీ, ఫైనల్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను వారు సాధించిన ర్యాంకు ప్రాతిపదికన వివిధ సర్వీసులకు కేటాయిస్తారు. వీటిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపిఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) మరియు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్), అత్యంత ప్రజాదరణ పొందినవి. కాగా మిగతావి ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ కార్పోరేట్ లా సర్వీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, ఢిల్లీ, అండమాన్ & నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ & డయ్యూ మరియు దాద్రా & నగర్ హవేలీ సివిల్ సర్వీస్, ఢిల్లీ, అండమాన్ & నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ & డయ్యూ మరియు దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్, పాండిచేరి సివిల్ సర్వీస్ మరియు పాండిచేరి పోలీస్ సర్వీస్.

ఇవి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1 పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి డిప్యూటీ కలెక్టర్ లుగా నియమింపబడిన వారు మరియు ఇతర శాఖలలో పని చేస్తున్న అధికారులు రోస్టర్ విధానంలో నిర్ధారిత నియమాలకనుగుణంగా ఐఏఎస్ మరియు ఐపిఎస్ లుగా పదోన్నతి పొందుతారు.

విధి నిర్వహణలో ఉన్న ఐఏఎస్ మరియు ఐపిఎస్ ల సంఖ్య:

దేశవ్యాప్తంగా 4926 మంది ఐఏఎస్ అధికారుల అవసరం ఉన్నప్పటికీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన 2022 సంవత్సరపు పరీక్షా ఫలితాల ఆధారంగా నవంబర్ 14, 2023 నాటికి 3511 ఐఏఎస్ అధికారులు నేరుగా ఎంపిక కాగా మిగతా 1415 అధికారులు వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీసుల నుండి పదోన్నతి మీద ఎంపికవుతారు. జనవరి 1, 2023 నాటికి మొత్తం 5047 మందికి గాను 4344 మంది ఐపిఎస్ అధికారులు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. కాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం 150 మంది ఐపిఎస్ అధికారులను మాత్రమే ఎంపిక చేస్తుంది.

2023 ఫలితాల వివరాలు:

ఇటీవల ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 పరీక్షా ఫలితాల ప్రకారం మొత్తం 1016 మంది (664 పురుషులు మరియు 352 స్త్రీలు) వివిధ సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి 43 మంది ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణ లోని మహబూబ్నగర్ కు చెందిన దోనూరు అనన్యారెడ్డి అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంకు సాధించడం మనందరికీ గర్వకారణం.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్

✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News