భారత దేశం క్రీడలు ఆటలకు పుట్టినిల్లు లాంటిది. ముఖ్యంగా కబడ్డీ, హాకీ, క్రికెట్ అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. క్రికెట్ అనగానే గవాస్కర్, సచిన్ టెండుల్కర్, పరుగు పందెం అనగానే మిల్కా సింగ్, పి.టి ఉషా గుర్తుకు వచ్చినట్లే హాకీ అనగానే గుర్తుకు వచ్చే ఏకైక ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో రాజపుత్ కుటుంబంలో శారదా సింగ్, సమేశ్వర్ సింగ్ లకు జన్మించాడు. చంద్ తండ్రి బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరి సైన్యం కొరకు హాకీ ఆడేవాడు. ధ్యాన్ చంద్ కు మూల్ సింగ్, రూప్ సింగ్ అనే సోదరులు కూడా హకీ ఆడేవారు. ధ్యాన్ చంద్ తండ్రి ఆర్మీ ఉద్యోగి కనుక బదిలీల రీత్యా వివిధ నగరాలకు వెళ్ళవలసి వచ్చేది. ధ్యాన్ చంద్ అలిఘర్ యూనివర్సిటీలో చదివి, చివరకు గ్వాలియర్ విక్టోరియా కాలేజ్ నుండి పట్టభద్రుడైనాడు. చంద్ తన 17 వ ఏటా 27 ఆగస్టు 29 న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. యువచంద్‌కు కుస్తీ అంటే ఇష్టం ఉండినప్పటికి హాకీలో ప్రావీణ్యత పొందటం విశేషం. 1922,1926 మధ్యన ప్రత్యేకంగా ఆర్మీ టోర్నమెంట్, రెజిమెంట్ పోటీలో ఆడి చివరకు న్యూజిలాండ్‌లో పర్యటించే భారత ఆర్మీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టు 18 మ్యాచులు గెలిచి, 2 డ్రా కాబడి, ఒకటి మాత్రమే ఓడిపోయి ప్రేక్షకుల ప్రశంషలు పొందినాడు. న్యూజిల్యాండ్ జట్టుతో జరిగిన మ్యాచులో మొదటిది గెలిచి రెండవది తృటిలో ఓడిపోవడం జరిగింది. ఇతను భారత దేశంకు తిరిగి వచ్చిన తరువాత 1927 లో లాన్స్ నాయక్ గా పదోన్నతి పొందాడు.
ధ్యాన్ సింగ్ 1928, 1932 మరియు 1936 వేసవి ఒలింపిక్స్‌లో విజయాలతో భారతదేశం తమ మొదటి హ్యాట్రిక్ ఒలింపిక్ బంగారు పతకాలను సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ రెజిమెంటల్ టీమ్‌తో తన హాకీ కెరీర్‌ను ప్రారంభించి, యువ ధ్యాన్ సింగ్ ప్రత్యేక ప్రతిభ కనబరిచాడు.. రోజులో ఎక్కువ భాగం రెజిమెంటల్ విధుల్లో ధ్యాన్ సింగ్ చంద్రకాంతిలో రాత్రి తన హాకీని ప్రాక్టీస్ చేసేవాడు, అందుకే అతనికి ధ్యాన్ చంద్ అనే పేరు వచ్చింది (చంద్ అంటే హిందీలో చంద్రుడు). 1928 ఒలింపిక్స్ కోసం భారత హాకీ జట్టుకు ఎన్నిక కాబడి చంద్ తన ఆనందకరమైన స్టిక్ వర్క్ మరియు గేమ్‌పై అవగాహనతో హాకీ ప్రపంచాన్ని శాసించడం వల్ల అతనికి ’హాకీ విజార్డ్’ ‘ది మెజీషియన్’ అనే పేరు వచ్చింది. హాకీ మాంత్రికుని ప్రస్థానం 1926 నుండి 1948 వరకు భారతదేశానికి 185 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 400 గోల్స్ చేసిన తర్వాత ఆల్ టైమ్ గొప్ప హాకీ ఆటగాళ్లలో ఒకరిగా చరిత్ర సృష్టించారు. 1956లో భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్‌లో మేజర్‌గా పదవీ విరమణ చేసిన సమయంలో, భారత ప్రభుత్వం అదే సంవత్సరం పద్మభూషణ్ – మూడవ-అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది. పదవీ విరమణ తరువాత అతను రాజస్థాన్ లోని మౌంట్ అబూలో కోచింగ్ క్యాంప్ లో కోచింగ్ ఇచ్చేవాడు. తరువాత పాటియాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో హాకీ కోచ్ గా చాలా సంవత్సరాలు పని చేశాడు. ఈయన చివరి రోజుల్లో ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలో కాలం గడిపాడు. 1979 డిసెంబర్ 3 న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కాలేయ క్యాన్సర్‌తో తుది శ్వాస వదిలాడు. అతని అంత్యక్రియలు తన స్వంత నగరం ఝాన్సీలో జరిపినప్పుడు అతని రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్ సైనిక గౌరవ వందనం చేశాయి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం భారత క్రీడలకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి అతని పేరు పెట్టారు. అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినవారికి క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేస్తుంది. ధ్యాన్ చంద్ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
- ఆళవందార్ వేణు మాధవ్
8686051752.
(నేడు జాతీయ క్రీడా దినోత్సవం )