Tuesday, December 3, 2024
Homeఓపన్ పేజ్కాంగ్రెస్ లో కొత్త లొల్లి

కాంగ్రెస్ లో కొత్త లొల్లి

పాత గన్నులను శుభ్రం చేసి వాటికి పని చెప్పడం, పాత వైభవాన్ని మళ్లీ సాధించటం అనే సమీకరణాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. లేకపోతే దేశంలో అంత పాపులర్ అయిన శశి థరూర్ వంటివారిని స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు నుంచి తొలగించటం అంటే ఇంకేమనాలి అని కాంగ్రెస్ లీడర్లే స్వయంగా అభిప్రాయపడుతున్నారు. ఇది చాలు కాంగ్రెస్ ప్రస్తుత పనితీరు ఎంత దూకుడుగా ఉందో చెప్పేందుకు.

- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడటం, గాంధీ కుటుంబంపై వివాదాస్పదంగా ప్రకటనలు చేయటం ఇవన్నీ ఇప్పుడు శశి థరూర్ కు కొత్త టెన్షన్లు తెచ్చిపెడుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు 40 మందితో కూడిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో శశి పేరు లేకపోవటం అందరూ ముందే ఊహించారు కూడా. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, సీఎం అశోక్ గెహ్లాట్, సీఎం భూపేష్ బఘేల్, సచిన్ పైలట్, జిగ్నేష్ మేవాని, కన్హయ్యా కుమార్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, భూపేందర్ సింగ్ హుడా, అశోక్ చవాన్, రమేష్ చెన్నితల, తారిక్ అన్వర్, బీకే హరిప్రసాద్, మోహన్ ప్రకాశ్, శక్తి సింగ్ గోహిల్, రఘు శర్మ, జగదీష్ థాకూర్, శుక్రాం రథ్వా, శివాజీరావ్ మోఘే వంటి వారు పేర్లు ఇందులో ఉన్నాయి. కానీ ఇందులో శశి పేరు లేకపోవటం విడ్డూరం ఏమీ కాదు, రాజకీయ పండితులు ముందే హెచ్చరించినట్టు తొలుత శశి ప్రాధాన్యత ఇలా తగ్గించి ఆతరువాత పార్టీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తారన్నది నిజమయ్యేలా ఉంది. ఈ విషయంపై ఆయనకు కూడా అవగాహన ఉన్నట్టే స్పష్టమవుతోంది.

గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం (ఎన్ఎస్ యుఐ) శశిని ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీనికి అంగీకరించిన ఆయన గుజరాతీ యువ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు వస్తానని కూడా వెల్లడించారు. కానీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తన పేరు లేనికారణంగా తన గుజరాత్ కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ దబాయిస్తుండటంతో థరూర్ మనసు తీవ్రంగా గాయపడిందని భోగట్టా. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా కలియతిరుగుతూ బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు. కేరళలో 2010, 2015, 2020ల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం ఉధృతంగా చేశారు. ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే ఎంత అవమానం అని పార్టీ సీనియర్లలోని ఓ వర్గం గుసగుసలాడుతోంది. ఇక సోషల్ మీడియాలో దీనిపై పెద్ద మాటల యుద్ధమే రాజుకుంది. విద్యార్థులు, యువత, చదువుకున్న వారిలో శశిథరూర్ కు మంచి పేరుప్రఖ్యాతులున్న విషయాన్ని అధిష్ఠానం బేఖాతరు చేయటం పార్టీకే నష్టం చేకూర్చే అంశమనే వాదన మొదలైంది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు సీనియర్ నేత, జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ. మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం.

ఇప్పటికే గుజరాత్ కాంగ్రెస్ లో గోపీల (గోడమీద పిల్లులు)సంఖ్య విపరీతంగా పెరిగింది. పార్టీ మారే నేతల సంఖ్య అనూహ్యంగా పెరగటంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంఛార్జ్ హిమాన్షు వ్యాస్, ఎమ్మెల్యే భగవాన్ భాయి డీ బారద్, సీనియర్ నేత 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ ట్రైబల్ లీడర్ మోహన్ సింగ్ రథ్వా, ఆయన కుమారులు , భవేష్ కతారా వీళ్లందరూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఇదంతా పార్టీకి పెద్ద దెబ్బే.

మరోవైపు ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పోరాటం ఇంకా ఊపందుకోలేదు. డిసెంబర్ 3న జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల కోసం ఇప్పుడు కత్తులు నూరుతున్న కాంగ్రెస్ కొత్త తలనొప్పులను ఏరి కోరి తెచ్చుకుంటోంది. 2007 వరకు ఢిల్లీ ఎంసీడీ కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేది. కానీ ఆతరువాత ఇది బీజేపీ హస్తగతమైంది. ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఎంసీడీ అధికారులతో ఆమె చాలా సమన్వయంతో వ్యవహరించి, ఢిల్లీ మహానగరానికి అన్ని హంగులూ అద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పార్టీలో అలాంటి బాధ్యత తీసుకుని, దాన్ని నిలబెట్టుకునేవారే కరువయ్యారు. షీలా కుమారుడు సందీప్ దీక్షిత్, అజయ్ మేకన్ వంటి చాలా గ్రూపులున్నాయి ఢిల్లీ కాంగ్రెస్ లో. ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ లీడర్లలో ఐక్యత లేకపోవటంతోనే ఢిల్లీ సీఎం కుర్చీ కాంగ్రెస్ చేయి జారింది. ఇక గాంధీ కుటుంబమంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఇలా అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ గ్రూపిజం పీచమణిచేలా చర్యలు తీసుకునేవారే కరువయ్యారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో సోనియా ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన గుజరాత్ పర్యటన ఉంటుందా ఉండదా అనే విషయంపై ఇంకా స్పష్టత రానేలేదు. ఇక పార్టీలో జరిగే ప్రతి విషయంపై సోనియా గాంధీకి పూర్తి సమాచారం ఉంది. పైగా ఆమెను కాదని ఖర్గే ఏమీ చేయటం లేదనేది బహిరంగ రహస్యమే. ఇంత జరుగుతున్నా సోనియా మాత్రం పార్టీ వ్యవహారాలన్నీ ఖర్గేనే చూస్తున్నట్టు తానేమీ పట్టించుకోవటం లేదనేలా ప్రవర్తిస్తుండటం సీనియర్లకు చాలా ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో శశి థరూర్, సచిన్ పైలట్, సందీప్ దీక్షిత్, అజయ్ మేకన్ లాంటి చాలా మంది నేతలు మనస్థాపానికి గురయ్యారు.

విడ్డూరం ఏమిటంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవిగా ఇటు బీజేపీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తూంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. ముఖ్యంగా భారత్ జోడో యాత్రను అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలగుండా కాకుండా వేరే చోట్ల నిర్వహించటంపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీటికి జవాబిస్తున్నట్టుగా పార్టీ జనరల్ సెక్రెటరీ ఇన్ ఛార్జ్ కమ్యూనికేషన్స జయరాం రమేష్ చేసిన తాజా ప్రకటన విచిత్రంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ పాదయాత్ర ప్రభావం ఏమీ ఉండదని కేవలం 2024 లోక్సభ ఎన్నికల్లోనే భారత్ జోడో యాత్ర ప్రభావం చూపుతుందని దీంతో పార్టీకి పొలిటికల్ మైలేజ్ బ్రహ్మాండంగా తెచ్చి పెడుతుందనటం పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తోంది.

రాహుల్ యాత్రకు ఓటు బ్యాంకుకు సంబంధం లేదని రమేష్ తేల్చిపారేశారు. సమైక్యతను ఈ యాత్ర నొక్కి చెబుతుంది, పార్టీలో ఐక్యతను తెచ్చేలా ఇప్పటి వరకూ యాత్ర సాగిందని రమేష్ చెప్పిన లెక్కలు చిత్ర విచిత్రంగా ఉన్నాయని పార్టీ శ్రేణులు వక్కాణిస్తున్నాయి.

రాహుల్ యాత్రలో స్టార్ పార్టిసిపెంట్స్ గా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలు హాజరవుతుండటం విశేషం. అసలు భారత్ జోడో యాత్రను జెండా ఊపి ప్రారంభించిందే స్టాలిన్ కాగా ఆతరువాత యాత్ర ఏ రాష్ట్రంలో ఎంటర్ అయితే ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీ నేతలు వచ్చి యాత్రలో సందడి చేస్తుండటం అక్కడక్కడా కనిపిస్తోంది. తాజాగా ఆదిత్యా ఠాక్రే వచ్చి యాత్రలో పాల్గొనటం ఒక ఎత్తైతే ఎన్సీపీ సీనియర్లు కూడా ఈ యాత్రకు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని అప్పుడే ఎన్సీపీ నేత మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. ఇలా పార్టీకి ఇంటా, బయటా ఒకటే వరుస షాకులు తగులుతున్నాయి. పాద యాత్ర అంటే మ్యాజిక్ స్టిక్ కాదని జయరాం రమేష్ తేల్చటం పార్టీ క్యాడర్ కు పెద్ద షాక్ గా మారింది. ఏది అంటే అది జరిగేలా చేసే మ్యాజిక్ స్టిక్ లాంటిదే రాహుల్ పాదయాత్ర అనే భ్రమల్లో ఉండద్దని ఆయన మీడియా ముఖంగా క్లాస్ పీకారు. అంతేకాదు ఎన్నికల అజెండా అంతా రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆధారపడి ఉంటుంది కానీ రాహుల్ గాంధీపై కాదని రమేష్ చెప్పటం హైలైట్.

ఇటు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ నేత అజయ్ మేకన్ తన విధులకు గుడ్ బై చెప్పటంతో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈమేరకు ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మేకన్ లేఖ సైతం రాశారు. తాను క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ నివేదిక పంపినా హైకమాండ్ స్పందించకపోవటంపై ఆయన అలక వహించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపినా ప్రయోజనం లేదని మేకన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం వారిని బాగా బాధించిందికూడా. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం మేకన్ కు సహాయ నిరాకరణ చేస్తూ సచిన్ పైలట్ వర్గానికి మేకన్ బాసటగా ఉన్నారంటూ, ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలకు పదేపదే దిగటంతో మేకన్ ఈ బాధ్యత నుంచి తప్పుకోక తప్పలేదు.
ఇంత జరుగుతున్నా రాజస్థాన్ వ్యవహారంపై, మేకన్ రాజీనామాపై యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన కాంగ్రెస్ హైకమాండ్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఇది పైలట్ వర్గానికి మరింత ఆగ్రహం కలిగిస్తోంది. దీని ప్రభావం డైరెక్ట్ గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై పడటం ఖాయంగా మారింది.

వెరసి చూస్తుంటే కాంగ్రెస్ కోటకు భారీగా కొత్త బీటలు వచ్చినట్టు స్పష్టమవుతోంది. మరి టెన్ జన్ పథ్ దీనిపై స్పందించేసరికి పుణ్యకాలం గడిచిపోతుందా ఏంటనేది చిక్కు ప్రశ్నగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News