సెల్‌ఫోన్లు అనేవి మన జీవితాలనే నియంత్రిస్తాయని ఎవరమైనా పాతికేళ్ల క్రితం కనీసం ఊహించామా? అదే ఇప్పుడు ఒక్కసారి ఫోన్ తీసుకుని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చాలు ఐదు నిమిషాల్లోగా పేమెంట్ గేట్‌వేలోకి వెళ్లిపోతాం, అక్కడ మన యూపీఐ ఐడీనో, క్రెడిట్ కార్డు వివరాలో నమోదుచేసి అర నిమిషంలో కొనేస్తాం. ఏదైనా కావాలంటే ఐదు నిమిషాల్లో కాలు కదపకుండా ఇంట్లోకి వచ్చిపడుతుందని మురిసిపోతాం.
అందుకే నో బయ్ 2025
మొన్నామధ్య ఒక ప్రకటన బాగా ట్రెండ్ అయ్యింది. అందులో ఒక యువతి బ్రూమ్ అని ఆర్డర్ పెట్టబోయి గ్రూమ్ అని పెడుతుంది. అంతే, సదరు ఏజెన్సీ వాళ్లు ఒక పెళ్లి కొడుకును ఎత్తుకుని వచ్చేస్తుంటారు. కాసేపటికి ఆ అమ్మాయి పొరపాటు గమనించి.. మళ్లీ ఆర్డర్ మార్చి బ్రూమ్ అని పెడుతుంది. పెళ్లికొడుకును యథాస్థానంలో పెట్టేసి చీపురు తీసుకొచ్చి ఇస్తారు. మనం ఆర్డర్ పెట్టిన నిమిషాల్లోనే అంతా అయిపోతుందనడానికి ఆ ప్రకటనను రూపొందించారు. కానీ..ఇలా ఇల్లు కదలకుండా, కాలు కదపకుండా ఏం కావాలంటే అవి వచ్చేసే పరిస్థితులు ఉండడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతోందో ప్రస్తుతం యువత బాగా తెలుసుకున్నారు. అందుకే.. 2025 ఆర్థిక సంవత్సరాన్ని నో బయ్ 2025 అని చెబుతున్నారు. అంటే, అవసరం లేకుండా ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టకూడదని అంటున్నారు.
వృథా ఖర్చుకు ఇలా చెక్
వృథా ఖర్చులన్నింటినీ తగ్గించుకుని వీలైనంత ఆదా చేయాలని, అలా చేసిన డబ్బులను ఎక్కడైనా మంచి సాధనాల్లో పెట్టుబడి పెట్టి సంపద పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతోంది. అందులోనూ కేంద్ర బడ్జెట్ కూడా వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ కొత్త పన్నులు ఎలా వచ్చిపడతాయో తెలియట్లేదని, ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువు మీదా జీఎస్టీ రూపంలో మనమే పన్నులు కడుతున్నామని గుర్తుచేస్తున్నారు. ఒకవైపు సంపాదించిన జీతాల మీద ఆదాయపు పన్ను రూపంలో ప్రతి వందకు 30 రూపాయల వరకు కడుతూనే మళ్లీ బీమా పాలసీ ప్రీమియం దగ్గర నుంచి కొనుక్కునే చెప్పుల వరకు ప్రతి దానిమీదా దాదాపు 18% వరకు జీఎస్టీ కడుతున్నామని, అంటే దాదాపు 48-50 శాతం వరకు మన ఆదాయం పన్నుల రూపంలోనే పోతోందని అందువల్ల అత్యవసరం అనుకున్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి తప్ప అనవసరంగా వృథా ఖర్చులు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు.
కొత్త సంవత్సరం-కొత్త వ్యూహాలు
సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని మహా అయితే నాలుగైదు రోజులు అమలుచేసి, మళ్లీ పక్కన పెట్టేస్తారు. కానీ ఈసారి అలా కాకుండా విభిన్నంగా ఆర్థిక సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకుని కొత్త నిర్ణయం తీసుకోవాలని, ఈ సంవత్సరం అంతా దాన్ని కచ్చితంగా అమలు చేయాలని పలువురు చెబుతున్నారు. ఈసారి ఈ ఛాలెంజ్ అనేది కేవలం డబ్బులు దాచుకోవడానికి, జాగ్రత్తగా ఖర్చుపెట్టడానికే ఉపయోగపడుతుందని ప్రబోధిస్తున్నారు.
జీవనశైలి మారిపోతోంది
ఇంతకు ముందు నెలలో మొదటి తారీఖు వచ్చిందంటే ఇంట్లో ఒక సరుకుల పట్టీ తయారయ్యేది. ఆ పట్టీ తీసుకుని కిరాణా కొట్టుకు వెళ్లి అక్కడ ఇస్తే మనకు కావల్సినంత మొత్తాలు మాత్రమే పొట్లాలు కట్టి ఇచ్చేవారు. దానికి ఎంత అయితే అంత చెల్లించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి పలు రకాలుగా మారిపోయింది. డి-మార్ట్ లేదా మరేదైనా మార్ట్‌కు వెళ్తాం. అక్కడ బ్రెడ్‌లు, బిస్కట్ల నుంచి మొదలుపెట్టి, చివరగా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడకు సమీపంలో ఉండే చాక్లెట్ల వరకు అవసరం ఉన్నా, లేకపోయినా ట్రాలీ నిండిపోయేలా తీసుకుంటాం. చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి క్రెడిట్ కార్డు వాడతాం కాబట్టి ఎంత ఇస్తున్నామో కూడా సరిగా చూసుకోం. అంతేకాదు పప్పులు, ఇతరత్రా సరుకులు తీసుకోవాలన్నా అక్కడ కవర్లలో మనం నింపుకొన్న తర్వాత బరువు తూచుకోవడానికి ఏమీ ఉండదు. మనం కాస్త ఎక్కువ వేసినా అది ఎన్ని గ్రాములు ఉందో లెక్క చూసి, వెంటనే ఒక స్టిక్కర్ వేసేస్తారు. కావాలంటే అందులోంచి కొంత తీసి, మళ్లీ స్టిక్కర్ వేయించుకోవచ్చు. కానీ అలా చేసేవాళ్లు మచ్చుకు కూడా కనిపించరు. ఇక యాప్‌లలో బుకింగ్ వచ్చిన తర్వాత లెక్కేలేకుండా పోతోంది. ఆర్డర్ పెట్టిన పావుగంట లోపలే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారని కావల్సిన వాటితో పాటు, పడి ఉంటాయిలే అని స్నాక్స్, మ్యాగీలు ఇలా ఏవి పడితే అవి ఆర్డర్ పెట్టేస్తున్నారు. దాంతో నెలకు అంతకుముందు రెండు మూడు వేలయ్యే సరుకుల బిల్లు ఇప్పుడు పది పదిహేను వేలు దాటిపోతోంది.
ఏమిటీ సరికొత్త ఛాలెంజ్?
నో-బయ్ ఛాలెంజ్ అంటే ఏమీ లేదు, ఒక సంవత్సరం పాటు అనవసర వస్తువులు ఏవీ కొనకుండా ఉండడం. అసలు ఖర్చుపెట్టకూడదని మాత్రం కాదు. కేవలం నెలకు అవసరమైన సరుకులు, వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించినవి అంటే మందులు లాంటివి మాత్రమే కొనాలి తప్ప దుస్తులు, గాడ్జెట్లు, విలాసవంతమైన వస్తువులు ఇవన్నీ ఆపేయాలి. అంటే చాలా అప్రమత్తంగా మన డబ్బులను వినియోగించాలన్నదే ఈ ఛాలెంజ్ సారాంశం. అప్పుడు మన అసలు అవసరాలు ఏంటో, నెలవారీ ఖర్చు ఎంత అవుతుందో లెక్క తెలుస్తుందని, దానివల్ల ఏడాది మొత్తమ్మీద ఆదా అయ్యే డబ్బుతో ఎంచక్కా ఏదో ఒకదానిమీద పెట్టుబడి పెట్టి అధిక లాభాలు సంపాదించుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ సంవత్సరమే ఎందుకు?
2025 ఆర్థిక సంవత్సరం మొత్తం అత్యంత అప్రమత్తంగా ఉండాలనేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ద్రవ్యోల్బణం కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. అందువల్ల ఖర్చులు తగ్గించుకోగలిగితే ఆర్థికంగా కాస్త బలంగా ఉండి, మనకు మిగిలిన నిధులను దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మళ్లించుకుంటే సమీప భవిష్యత్తులో వచ్చే విపత్తులను ఎదుర్కోగలమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫ్యాషన్ పేరుతో వృథాగా పారేస్తున్న వస్తువులు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తవి కొంటూ, పాతవాటిని పారేయడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటన్నింటినీ తగ్గిస్తే పర్యావరణం కూడా బాగుంటుందని సూచిస్తున్నారు.
నిలకడ కీలకం
ఈ విషయం గురించి నగరానికి చెందిన ప్రముఖ చార్టర్డ్ ఎకౌంటెంట్ వేల్పుల భాస్కర రామ్మూర్తిని అడిగినప్పుడు ఆయన చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. “ప్రస్తుతం స్కూలు ఫీజుల దగ్గర నుంచి అన్నీ పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ప్రభావంతో ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియట్లేదు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పెద్దల సామెతను మనం అమలు చేయాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే అదనంగా సంపాదించినట్లే అవుతుంది. లక్ష రూపాయల జీతం వచ్చేవాళ్లు కూడా నెల తిరిగే సరికి బ్యాంకులో ఐదు వేలు కూడా లేని పరిస్థితికి వస్తున్నారు. సినిమాలు, షికార్లకు వెళ్లడం, అటునుంచి అటే రెస్టారెంట్లలో తినడం, క్యాబ్‌లలో తిరగడం ఇలాంటి వాటికి ఖర్చుపెట్టేకంటే ఇంట్లో ఓటీటీలో చూసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి. విలాసాలను వదిలిపెట్టి అవసరాలు మాత్రమే చూసుకుంటే మనం చాలా ధనవంతులుగా మారతాం. అలాంటప్పుడు ఏ రెసిషన్ మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఉద్యోగం పోయినా కనీసం ఏడాది, రెండేళ్ల పాటు మన ఖర్చులన్నింటికీ సరిపోయేంత డబ్బులు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఉండాలి. అందుకు ఈ సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టండి” అని ఆయన వివరించారు.
మినిమలిజం వైపు మారండి
ఇక నో బయ్ ఛాలెంజ్ గురించి మానస్ ఫౌండేషన్‌లో క్లినికల్ సైకాలజిస్టు మానసీ చతుర్వేదిని సంప్రదిస్తే ఆమె ఇలా వివరించారు “నో బయ్ ఛాలెంజ్‌ని ఒక తీర్మానంలా కాకుండా ఒక ఉద్దేశంలా తీసుకుని అమలు చేయండి. అంటే ఈ సంవత్సరం మొత్తం ప్రతి రూపాయి ఖర్చుపెట్టేటప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. అందుకోసం ఒక చెక్‌లిస్టు పెట్టుకుని ఏ నెలలో ఏం అవసరాలు ఉన్నాయో కూడా చూసుకోవాలి. మనమంతా మినిమలిజం వైపు మళ్లాలి. అంటే, వీలైనంత తక్కువ అవసరాలతోనే జీవించడం. రాశి కంటే వాసిని చూడడం. సోషల్ మీడియా చూశారంటే అక్కడ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉంటారు. వాళ్లు తమ ప్రయోజనాల కోసం ఏవేవో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. అవి మనకు అవసరమో, కాదో చూడకుండానే. అరె బాగుంది కదా తీసుకుందాం అనుకుంటాం. అలా వద్దు. మీకు నిత్య జీవితంలో అత్యవసరం అనుకున్నవి మాత్రమే ఎంచుకోవాలి. అది కూడా ఎక్కడ బాగా తక్కువకు దొరుకుతోందో వెతికి చూసి, అక్కడే కొనాలి. మీరు ఒక ఏడాది నుంచి అస్సలు వాడని వస్తువు ఏదైనా ఉంటే, దాన్ని వదిలేయాలి. అలాగే మీరు ఏదైనా కొనాలనుకుంటే ఇంట్లో ఉన్న ఒకటి తీసేసి అప్పుడు కొనాలి. అప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. రాబోయే కొన్నేళ్ల పాటు ఎలా ఉంటుందో చెప్పలేం. అందువల్ల మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని ఆమె చెప్పారు.
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)