ఎన్నికలకు ముందు వాగ్దానాలు, వరాలు కురిపించడం పార్టీలకు సాధారణ విషయమే. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాగ్దానం మాత్రం ‘ఆకస్మిక ధన లాభం’ లాంటిది. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాన్ని మరో అయిదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి ‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద కోవిడ్ సమయంలో 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని ప్రకటించింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఉచిత ఆహార ధాన్యాల పథకం కంటే మించిన పథకం ఏదీ ఉండదు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రకటన తప్పకుండా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్ రావడానికి ముందు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని సాదా సీదా వర్గాలకు బాగా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. కోవిడ్ ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి యోజన కింద మరిన్ని నిత్యావసర వస్తువులను, మరింత కాలం పేదలకు సరఫరా చేయడం ప్రారంభమైంది. నెలకు అయిదు కిలోల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది.
ఈ పథకాన్ని 2022డిసెంబర్ నెలలో జాతీయ ఆహార భద్రతా చట్టంలో విలీనం చేసి, మరో ఏడాది పాటు ఈ పథకాన్ని పొడిగించారు. ఆ పథకం ఈ ఏడాది డిసెంబర్ నెలతో ముగియబోతోంది. ఆ పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం జరిగింది. ఆయన ఈ ప్రకటన చేయడం ప్రజానీకాన్నే కాకుండా కేంద్రం లోని అధికారులు, మంత్రులను సైతం నిర్ఘాంతపరచింది. దేశ జనాభాలో సుమారు 60 శాతం మందికి వర్తించే ఈ బృహత్తర పథకాన్ని ఎకాయెకిన అయిదేళ్లపాటు పొడిగించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ధోరణిని బట్టి అర్థమవుతున్నదేమి టంటే, ఈ పథకం శాశ్వతంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ధాన్యం సేకరణ ధరల ప్రకారం, ఈ పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా లేదన్నా ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ద్రవ్య వినయోగం మీద దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కేంద్రం చెబుతోంది కానీ, ఈ ఏడాది ప్రథమార్థంలోనే ద్రవ్య లోటు గత ఏడాది కంటే బాగా పెరిగిపోయింది.
ఈ పథకాన్ని పొడిగించడం అన్నది అనేక ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమిస్తోంది. దేశంలో ఇదివరకటి స్థాయిలో ఇప్పుడు పేదరికం లేదని కేంద్ర ప్రభుత్వం చాలాకాలం నుంచి చెబుతోంది. గత అయిదేళ్లలో 13.50 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని పొడిగించడాన్ని బట్టి, పేదరికం ఇంకా కొనసాగుతోందనే భావించాల్సి వస్తోంది. కోట్లాది మంది పేదలు పేదరికం నుంచి బయటపడినప్పుడు ఈ పథకాన్ని పొడిగించాల్సిన అవసరం ఏముంటుంది? అయితే, ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో పేదరికంగా బాగా తగ్గిపోయిందనే గణాంకాలతో సహా వెల్లడించింది. 2004లో 39 శాతానికి పైగా ఉన్న పేద ప్రజానీకం 2019 నాటికే 12.7 శాతానికి తగ్గిపోయినట్టు కూడా అది తెలియజేసింది. అదే నిజమైతే ఇన్ని కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడం వృథాయే కదా? దేశంలో పేదల సంఖ్యను తక్కువ చేసి చూపించడం జరుగుతోంది. కోవి్‌డ సమయంలో పేదల సంఖ్య పెరిగిందనే వాదన కూడా సరైనదిగా కనిపించడం లేదు.
దేశంలో దాదాపు 40 శాతం ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం వెలుపలే ఉన్నారు. అందువల్ల ఈ పథకాన్ని అమలు చేయడంలో తప్పేమీ లేదు కానీ, కేంద్ర ప్రభుత్వం పేదల సంఖ్య విషయంలో గతంలో చెప్పిన మాటల్లో మాత్రం యథార్థం లేదని అర్థమవుతోంది. కాగా, ప్రధానమంత్రి చేసిన ప్రకటన రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి ఇటువంటి విధాన ప్రకటన చేయవచ్చా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అవి విమర్శిస్తున్నాయి. అయితే, ఇది ఎన్నికల వాగ్దానాల్లో భాగమని, మిగిలిన పార్టీలు అనేక ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నట్టే తాము కూడా వాగ్దానం చేశామని పాలక బీజేపీ వాదిస్తోంది. దీని మీద ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
No Election code to Union Government: కేంద్రానికి ఎన్నికల కోడ్ వర్తించదా?
'గరీబ్ కల్యాణ్ అన్న యోజన 5 ఏళ్లు పొడగిస్తామని ప్రధాని ప్రకటన