Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్Planning-education: ప్రణాళికాబద్ధంగా లేని చదువులు

Planning-education: ప్రణాళికాబద్ధంగా లేని చదువులు

వానా కాలం సదువులు..

ఇరవై ఒకటో శతాబ్ది సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2020లో కేంద్రం జాతీయ విద్యా విధానంను రూపొందించినప్పటికీ, ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలు వేగవంతం కాలేదు. సామాజిక ఆర్థిక స్థాయిలతో సంబంధం లేకుండా 2040 నాటికి దేశంలోని విద్యార్థులందరికీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నది ధ్యేయంకాగా, ఎదురవుతున్న సవాళ్లను అధిగమిం చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నూతన విద్యా విధానం అమలుకు సరైన ఆర్థిక వనరులు అవసరం కాగా, ఇందుకు స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యకు కేటాయించాలి. కానీ అది మూడు శాతానికి మించడం లేదు. 2021-22 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలల్లో సౌకర్యాల లేమి చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ముఖ్యంగా సర్కారీ బడులు కనీస వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 14% బడులకు ప్రహరీ గోడలు లేవు. దీనివల్ల విద్యార్థులు ఆటలు ఆడుకునే సమయంలో బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 22% పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. 34% బడుల్లో తరగతులకు సరిపడా గదులు లేవు. 44% పాఠశాలలకు భద్రతా ధ్రువపత్రాలు లేవు. 86% బడుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టణాలు, నగరాల్లో చాలా బడులు రహదారుల పక్కన, నిత్యం రణగొణ ధ్వనుల మధ్య కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు పాఠాలను సక్రమంగా ఆకళింపు చేసుకోలేక పోతున్నారు. పన్నెండు వేల ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్లు లేవు. ఐదు లక్షల సర్కారీ బడుల్లో నీటి వసతి లేదు. ప్రతి బడికి దృఢమైన భవంతి, తగిన సిబ్బంది, ప్రహరీ, గ్రంథాలయం, తాగునీరు, క్రీడా సామాగ్రి, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలన్నీ ఉండి తీరాలని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తోంది. కానీ, ఇందుకు భిన్నంగా బడులు కొనసాగుతున్నాయి.
యువ జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న మన దేశంలో, వారికి సరైన నైపుణ్యాలను అందించడంలో విద్యా వ్యవస్థ వెనకబడుతోంది. బ్రిటన్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, డెన్మార్క్‌ తదితర దేశాలు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని బడుల్లో మేలిమి విద్యను అందిస్తున్నాయి. దేశీయంగా చాలా సర్కారు బడుల్లో డిజిటల్‌ క్లాసుల సంగతి అటుంచితే, కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నాయి. మన విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడాలంటే ఆధునిక పద్ధతుల్లో విద్యను అందించడం తప్పనిసరి. పాఠశాల స్థాయి నుంచే వృత్తిపరమైన కోర్సుల బోధన జరుగాలి. ఇందువల్ల ఉద్యోగాలపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడేందుకు అవకాశముంటుంది. కానీ అరకొర ఉపాధ్యాయులు, వేలకొద్దీ ఖాళీలు, సబ్జెక్టు నిపుణుల కొరత, ఐదు తరగతులకు ఒకే టీచర్‌. ఈ పరిస్థితుల్లో బోధనేతర పనులూ వారే చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగానీ బోధనేతర పనులు చేయాల్సి వస్తోంది. రిజిస్టర్ల నిర్వహణ, జీతభత్యాల బిల్లులు, జీపీఎఫ్‌, మెడికల్‌, పెన్షన్‌ తదితర పనులన్నీ టీచర్లే చేస్తున్నారు. వీటన్నింటినీ అనధికారికంగా ఎవరో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్కూల్‌ కాంప్లెక్స్కు వెళ్లి చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇవేకాకుండా పైఅధికారులు అడిగిన సమాచారం పంపడం, మధ్యాహ్న భోజనం బిల్లులు, హాజరు వివరాల తయారీలాంటివి ఎన్నో చేయాల్సివస్తోంది. యునెస్కో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పదకొండు లక్షల మందికి పైగా ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లోనే 70% పైగా టీచర్ల ఖాళీలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో కొరత ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు ఎలా ముందడుగు వేస్తుందో ఆలోచించాలి.
దేశ సమగ్రాభివృద్ధిలో అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే అన్ని దేశాలు ప్రజల్లో అక్షర జ్ఞానాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనదేశ అక్షరాస్యత 12% ఉండగా, 2011 జనగణన నాటికి అది 74%కు చేరింది. 2020లో కోవిడ్‌ సరికొత్త సవాళ్లను మోసుకొచ్చింది. విశ్వవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. మహమ్మారి కాస్త శాంతించి మళ్ళీ బడులు తెరుచుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది పిల్లలు తిరిగి ఐడులకు వెళ్లలేకపోయారు. కొవిడ్‌ తర్వాత చదువు మానేసిన వారితో కలిపి మన దేశంలో 35 లక్షల మంది పిల్లలు బడికి దూరమైనట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి కారణంగా 37% పిల్లలు చదువుకు దూరమైనట్లు ఓ సర్వే తెలిపింది. తెలంగాణలో 2020-21లో తొమ్మిది, పది తరగతుల్లో నమోదైన 11.21 లక్షల మంది విద్యార్థుల్లో 14% బడులను వదిలేసినట్లు ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్‌ ప్లస్‌) నివేదిక వెల్లడించింది. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఇతర అంశాలను పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2021-22లో విద్యాశాఖతోపాటు ఇతర శాఖల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 20,004 ఉండగా, వాటిలో 11.19 లక్షల మంది విద్యార్థులు చదివారు. 2023-24లో వారి సంఖ్య 8.15 లక్షలకు పడిపోయింది. ఏకంగా 3.04 లక్షలు తగ్గింది. 2021-22లో ప్రాథమికోన్నత పాఠశాలలు (1-8 తరగతులు) 3,371 ఉండగా, వాటిలో 3.26 లక్షల మంది విద్యార్థులు చదివారు. వారి సంఖ్య గత విద్యా సంవత్సరం (2023-24)లో 2.33 లక్షలకు పడిపోయింది. అంటే 98 వేలు తగ్గింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏటేటా మెరుగుపడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు పెరుగుతున్నాయి. అయినా పిల్లల సంఖ్య ఎందుకు పడిపోతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. వంద మంది విద్యార్థులు దాటిన పాఠశాలలు 5,367 (20.41%) మాత్రమే. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1,864 ఉండగా, 30 మంది విద్యార్థులున్నవి 9,447, వంద వరకు ఉన్న విద్యార్థుల పాఠశాలలు 9,609 ఉన్నాయి. వాస్తవానికి గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఈ తగ్గుదల ప్రభుత్వ, స్థానిక సంస్థల (మండల, జిల్లా పరిషత్తు)లోనని నిపుణులు చెబుతున్నారు, మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతోంది.
2021 – 22 విద్యా సంవత్సరంలో వారి సంఖ్య 2,97,324 ఉండగా, 2022 – 23లో 2,81,938 మంది పని చేశారు. అయితే 2023-24 సంవత్సరంలో వీరి సంఖ్య 3,16,571కు చేరడం గమనార్హం. అయినప్పటికీ 37 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,270 కంప్యూటర్‌ ల్యాబ్‌లు, 3,317 స్మార్ట్‌ తరగతి గదులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు 640 ల్యాబ్‌లు, 697 స్మార్ట్‌ తరగతులను ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఒక్కటీ నెరవేరలేదు. 2025 మార్చి నాటికి రాష్ట్రంలో 8.31 లక్షల మంది నిరక్షరాస్యులను వయోజన విద్య ద్వారా అక్షర్యాసులుగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం కింద రూ.15.67 కోట్లు కేటాయించారు. వాస్తవానికి 2022-23లో 4.15 లక్షల మందిని, 2023-24లో 8.31 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆచరణలో చతికిల పడింది.

- Advertisement -


కోడం పవన్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్టు
9848992825

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News