గత కొద్ది సంవత్సరాలుగా న్యాయమూర్తుల పని తీరును యూనిట్ పద్దతి లెక్కించడం, సత్వర న్యాయంకోసం లోక్ అదాలత్‌ల నిర్వహణ అంటూ జరుగుతున్న తతంగం తీరుతెన్ను చూస్తుంటే భారత న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా దిగువశ్రేణి న్యాయవ్యవస్థ ఎటువైపు ప్రయాణిస్తున్నదో అని భయం వేస్తున్నది. ప్రతి శనివారం నాడు, సెలవు దినాల నాడు, వివిధ సందర్భాలలో లోక్ అదాలతులు, లీగల్ లిటరసీ క్యాంపుల పేరుతో జరుగుతున్న ఉరుకులు పరుగులు క్షేత్రస్థాయి (గ్రౌండ్ లెవల్)లో న్యాయవ్యవస్థని బలహీనపరుస్తున్నాయి. లోక్ అదాలత్ లలో కేసుల వితరణ కోసమని, లీగల్ లిటరసీ క్యాంపుల ఏర్పాటు, జన సమీకరణ కోసమని వివిధ ప్రభుత్వ విభాగాలమీద ఆదారపడటం వలన న్యాయాస్తానాలు తమ ప్రత్యే కతను కోల్పోతున్నాయి. న్యాయమూర్తులే నయానో, భయానో పోలీసులను, అటవీశాఖ వారిని, ఎక్సైజ్ శాఖ వారిని, బ్యాంకు అధికారులను, రెవెన్యూ శాఖ , సింగరేణీ లాంటి సంస్థల అధికారులను పిలుపించుకుని, కేసుల పరిష్కారం కోసం దేభరించుకోవడం వలన దీర్ఘకాలంలో దుష్ప్రభావానికి దారితీసే ప్రమాదమున్నది.
పెరిగిన జనాభాకు అనుగుణంగా కోర్టుల సంఖ్య, న్యాయమూర్తుల సంఖ్య పెరగలేదు. ప్రత్యేక చట్టాలలో నిర్దేశించిన స్పెషల్ కోర్టుల ఏర్పాటులో విపరీతమైన జాప్యం, ఉన్న కోర్టులకే అదనపు బాధ్యతలు ఇవ్వడం, ప్రభుత్వ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యుటర్ల కొరత సంవ త్సరాలుగా అలాగే ఉన్నది. న్యాయస్థానాల సిబ్బంది కొరత సరేసరి, ఇంటర్నెట్ లాంటి ఆదునిక సాంకేతికతను అంది పుచ్చుకోవడం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. ఇప్పటికే భారత న్యాయమూర్తులు సగటున పరిష్కరిస్తున్న కేసుల సంఖ్యం ప్రపంచంలోని అనేక దేశాలకన్నా అధికంగా ఉన్నది. కాని వీటన్నిటినీ పట్టించుకోకుండా, ప్రభుత్వాలను సరైన చర్యలు తీసుకునే దిశలో ఆదేశించకుండా కేవలం న్యాయస్థానాలు మాత్రమే బాధ్యతను తలకెత్తుకోవడం వలన అలుపే కాని ప్రయోజనం శూన్యం. తాము చేసిన చట్టాల పట్ల అవగాహన కల్పించడం, వాటి ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకుని పోవడం చట్టసభల, ప్రభుత్వాల విధి, వారి విధిని నిర్వర్తించేలా వారిని అదుపుచేయడం కోర్టుల బాద్యత, అలాకాకుండా తామే అన్నీ చేయాలనుకోవడం దురదృష్టం. పోలీసు సిబ్బంది ( అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ) చేసే జాప్యం అది చార్జ్ షీట్ వేయడం లో కావచ్చు, సాక్షు లను సరైన సమయంలో కోర్టు ముందర ప్రవేశపెట్టడంలో కావచ్చు, విచారణ సమయంలో జాప్యం చేయడం కావ చ్చు, కోర్టు పీ.సిలను నియమించకపోవడం కావచ్చు, వీటినిగురించి మనం ఇంతవరకూ ప్రశ్నించడం లేదు. (పాపం వారికి కూడా తక్కువ సిబ్బంది, ఎక్కువ బాధ్యతలు పనిభారం పెరిగింది). కేసుల పెరుగుదలకు, గుట్టల్లా అపరిష్కృత కేసుల సంఖ్య పెరగడానికి న్యాయస్థానాలదే బాధ్యత అన్నట్లు పరిస్థితులను మనమే సృష్టిస్తున్నాం. ఆత్మ సంరక్షణలో పడిపోతున్నాం. అదేవిధంగా వివిధ చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత కేవలం న్యాయ స్థానాలదే అన్నట్లు వివిధ సందర్భాలలో, వివిధ వర్గాలకు చట్టాల పట్ల అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, ప్రభు త్వ విధులను కూడా మనమే నెత్తిన పెట్టుకుంటున్నాం. చట్టాలమీద అవగాహన కల్పించే సమాంతర వ్యవస్తను ఏర్పాటుచేసే దిశలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బదులు ఆ బాధ్యతలు న్యాయవ్యవస్థ భుజాల మీదకు ఎత్తు కోవడం దేనికి?
ఉరుకులు పరుగుల మీద జరుగుతున్న న్యాయా విత రణ అనేక అనర్థాలకు దారితీసే ప్రమాదమున్నది. కింది స్థాయి న్యాయమూర్తులు తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తు న్నారు. సహజ విచక్షణ (డిస్క్రిషణ్) అధికారాన్ని ఉపయో గించుకునే సమయమే చిక్కడం లేదు. ప్రతి సాయంత్రం లెక్కలు చూపడం, ప్రతినెలా యూనిట్‌లను బేరీజు వేసు కుంటూ కేసులను నడపడం అంతులేని ప్రహసనమ య్యింది. ఒత్తిడి ఎంతమేరకు పెరిగింది అంటే, దిగువశ్రేని న్యాయస్థానాలలో సీ.ఆర్.ఎం.పీ లు, ఐ.ఏ లమీద అసలు శ్రద్దే చూపడం లేదు. వీలైనంతవరకు వాటిని వదిలించు కోవడానికి, తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డిశ్చార్జ్ పిటిషన్ అన్నది కింది న్యాయస్థానాలలో దాదాపు కనుమరుగై పోయింది. మితిమీరిన వాయిదాలు, తిరస్కా రాల రూపంలో మధ్యంతర ఉత్తర్వులకోసం దాఖలు చేసిన పిటిషన్‌లను, ప్రైవేట్ కంప్లైంట్‌లను నిరుత్సాహ పరుస్తు న్నారు. చార్జ్ షీట్‌లను పరిశీలించడం ఆలస్యం చేస్తు న్నారు. కేసుల సంఖ్యను తగ్గించే దిశలో సి.ఆర్.పీ.సి 258 లాంటి అధికరణలను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీట న్నిటికీ కారణం యూనిట్‌లు సాదించాలి. పని ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఆరాటం. దీనివలన కింది న్యాయస్థానా లలో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు మద్య మనస్ప ర్థలు ఏర్పడి అంతరం పెరిగిపోతున్నది. ఏమైనా తప్పులు ఉంటే న్యాయవాదులే అప్పీల్, రివిజన్‌లు వేసుకుంటా రులే అన్న నిర్లిప్త దోరణి దిగువ న్యాయమూర్తులలో పెరిగిపోయింది. వ్యాపారంలో మాదిరి న్యాయస్తానాలలో కేసుల వితరణలో పోటీతత్వం పెరిగిపోయింది. తీర్పులు మొక్కుబడి తతంగంలా మారిపోయాయి.
లీగల్ సర్వీసెస్ అథారిటీ మీద న్యాయమూర్తుల అజమాయిషీ ఉండటం సబబే, కాని ఆ బాధ్యతలన్నీ వారి నెత్తిన మోపడం అనుచితం. న్యాయమూర్తి కనుసన్నల్లో పనిజరిగితే గౌరవం పెరుగుతుంది, అంతేకాని న్యాయ మూర్తి బజారులో పడి అవగాహన సదస్సులు నిర్వహిం చడం, కౌన్సిలింగులు నిర్వహించడం ఎంతమాత్రం మం చిది కాదు. చైర్మెన్ పదవి వారికి అదనపు బాధ్యత, బరువు అయింది. లీగల్ సర్వీసెస్ సిబ్బందితో పాటు, క్యాంపులను నిర్వహించే న్యాయాదికారులు, న్యాయవాదులను ప్రత్యే కంగా నియమించి, శాశ్వత ప్రాతిపదికన నడపాలి. రెగ్యు లర్ న్యాయమూర్తులు కేవలం రాజీపడిన కేసులను నమోదు చేయడం మాత్రమే చేసేలా ఏర్పాటు ఉండాలి. న్యాయమూర్తులే ముందస్తు కౌన్సిలింగులు ఇవ్వాల్సిరావ డం వలన రాజీపడని కేసులలో న్యాయమూర్తులు ముం దస్తు అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉన్నది, కక్షిదారులు కూడా న్యాయమూర్తులను అనుమానించే అవకాశం ఉన్నది.
ఏదోవిధంగా యూనిట్‌లను తెచ్చుకోవాలనే తపనలో న్యాయమూర్తులున్నారు. ప్రతి కేసును రాజీపడే కేసుల చట్రంలోకి తెచ్చే ఆరాటంలో పోలీసులున్నారు. రెగ్యులర్ కోర్టులు కాలక్రమంలో మధ్యవర్తిత్వం నేరిపే ఆర్బిట్రేషన్ కోర్టుల రూపాన్ని సంతరించుకుంటున్నాయని చెప్పడానికి సంకోచించడం లేదు. కొండల్లా పెరుగుతున్న కేసులనే రోగానికి మందు వేయకుండా, రోగ తీవ్రతను తగ్గించి చూపే ఈ ప్రయత్నాల వలన తక్షణ ప్రయోజనం ఉంటుం దేమో కాని, అది రోగానికి విరుగుడు మాత్రం కాదు, భవిష్యత్తులో అనేక అనర్థాలకు దారితీసే ప్రమాదమున్నది. భారతదేశంలో న్యాయముర్తులు సగటున చేస్తున్న కేసుల వితరణ ఇప్పటికే ఎక్కువగా ఉన్నది. లా కమీషన్ తన 120వ రిపోర్టులో ఎప్పుడో 1987లో చేసిన సూచన న్యాయముర్తుల సంఖ్య ప్రతి పదిలక్షల మందికి 50 వరకు పెంచాలి, దశాబ్దాల తరువాత కూడా ఆ సూచన సూచన గానే మిగిలిపోవడం దురదృష్టకరం.
సి.ఆర్.పీ.సిలోని సెక్షన్ 41 పుణ్యమాని అరెస్టు కాకుండా స్టేషన్‌లో స్వేచ్ఛను పొందుతున్న నిందితులకు లోక్ అదాలత్‌ల రాజీ సందర్భంగా నిందితులు హాజరు కాకున్నా పరవాలేదు అన్న నిబందన వరంలా మారింది. అసలు వారు కోర్టు మెట్లే ఎక్కడం లేదు. విచిత్రంగా ఫిర్యాది మాత్రం అటు పోలీసు స్టేషన్‌కు, ఇటూ కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో అంతి మంగా సామాన్యుని దృష్టిలో న్యాయవ్యవస్థ చులకన అవు తున్నది, న్యాయ వితరణ విధానం (justis delivary system ) అబాసుపాలు అవుతున్నది. ఎక్కువ కేసులను పరిష్కరించి చూపాలనే క్రమంలో కేసుల పరిష్కారానికి ఎన్నో కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. వీలైనంతవరకు కేసులను రాజీపడే (కాంపౌడెబుల్) కేసుల జాబితాలోకి తెచ్చి రాజీచేసే ఆలోచనతో ఆయుధం రికవరీ కాలేదన్న నేపంతో 326 ఐ.పీ.సి కేసులను 325 లేదా 323 కిందకు, 324 కేసులను 323 కిందకు ఆల్టర్ (సవరణ) చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలాది కేసులు ఈ పద్దతిలో రాజీ పడ్డాయన్నది నిర్వివాదాంశం. 498లో ఉన్న 3 నెలల ఎదురుచూపు కాల పరిధిని పట్టించుకోవడం లేదు, వర కట్నం కేసు రాజీ అయ్యారన్న నేపంతో అంతకన్నా పెద్ద దైన సెక్షన్ 3, 4 వరకట్న నిషేద కేసులను ఉపసంహరి స్తున్నారు. సింగరేణి, ఆర్టీసి, రెవెన్యూ తదితర ప్రభుత్వ ఆస్తులను దొంగిలించిన కేసులను కూడా ఉచితంగా, లేదంటే నామ మాత్ర కాంపౌడింగ్ ఫీసుతో రాజీపడే విధంగా వారిమీద ఒత్తిడి తెస్తున్నారు. ఐ.పీ.సి 380 కింద నమోదైన, చార్జ్ షీట్ పడిన కేసులను 379 ఐ.పీ.సి కిందకు మార్పిడి చేసి రాజీ చేస్తున్నారు. 34(ఎ), 7(ఎ) లేదా 8(ఇ) ఎక్సైజ్ చట్టం 1968 కింద నమోదైన కేసులను 8(బి) ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం 1995 కిందకు మార్చి కాలం చెల్లిన జీవోలను అడ్డంపెట్టుకుని రాజీచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కేసులలో మొదట ముద్దాయిల మీద ఐ.పీ.సి 379, పీ.డీ.పీ.పీ చట్టం 3, సీనరేజ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి, ముద్దాయిలను జైలుకు పంపి, లక్షల విలువ చేసే వాహనాలను సీజ్ చేసి చివరకు ముద్ద యిలతో సీనరేజ్ చట్టం కింద 5 వేల రూపాయలు ఫైన్ కట్టించుకుని, పబ్లిక్ ప్రాసిక్యుటార్ ద్వారా సదరు 379 ఐ.పీ.సి, సెక్షన్ 3 పీ.డీ.పీ.పీ కేసులను ఉపసంహరించు కుని కేసులను కొట్టేస్తున్నారు. ఎక్సైజ్ లాంటి కొన్ని కేసు లలో అసలు ఆయా ముద్దయిలకు తెలియకుండానే, వారె వరూ కోర్టుకు రాకుండానే చాలా కేసులలో అధికారులే రాజీపడిపోతున్నారు. లోక్ అదాలత్‌లలో ఎక్సైజ్ కేసులది ప్రముఖ పాత్ర అనే చెప్పాలి. దిగువ న్యాయస్థానాలలో జరుగుతున్న లోక్ అదాలత్‌లలో ఈమధ్య కాలంలో పరి ష్కరించబడుతున్న కేసులలో ఎక్సైజ్ కేసులదే ప్రథమ స్థానం. ఎక్సైజ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజానికి చెడు చేసే, వ్యక్తి పతనానికి దారితీసే నాటుసారా దురా చారాన్ని అదుపు చేయడం, ఈ క్రమంలో నాటు సారా, చట్ట విరుద్దమైన సారాతో వ్యావారం చేసే నేరస్తులను గుర్తించి శిక్షించడం. యూనిట్‌ల పేరుతో, లోక్ అదాలత్‌ల నీడలో అన్ని కేసులను ఎత్తివేయడం వలన సమాజానికి జరిగే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. చట్టం నిర్వీర్యం కావడం మినహా జరుగుతున్నదేమీ లేదు. చాలా సందర్భాలలో నిందితులు కోర్టు మెట్లైనా ఎక్కకుండానే కేసులు రాజీ అయిపోతున్నాయి. 41 సీ.ఆర్.పీ.సి నోటీసు మొదట అందుకున్న నిందితుడు లోక్ అదాలత్ ముందు హాజరు కాకుండానే సంబంధిత అధికారులు కేసులను కోర్టు ముందర ఉపసంహరించుకుంటున్నారు. ఇన్ని వస తులు కల్పించిన తరువాత చట్టంపట్ల విదేయత, చేసిన తప్పు పట్ల పరివర్తన నిందితుల్లో ఎలా వస్తుందో ఏలిన వారికి, మేధావులకే తెలియాలి? మూకుమ్మడిగా ఎక్సైజ్ కేసులను రాజీ చేసుకోవాలని సంబంధిత శాఖ అధికా రులు నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు చట్ట బద్దం? చట్ట సభలు ఈ విధమైన అధికారాన్ని బదిలీ చేయలేదు. అటు వంటప్పుడు రాజీ కుదుర్చుకోతగని కేసులను నామ మాత్రపు అపరాధ రుసుము (ఫైన్) పేరుతో రాజీ చేయడం చట్టవిరుద్ధం కాదా? చట్టసభల హక్కులను కాలరాయడం, అధికారులు తమచేతిలోకి తీసుకోవడం కాదా? ఎప్పుడో ఇచ్చిన జీవోను ఆధారం చేసుకుని ఎక్సైజ్ చట్టంలోని కేసులన్నింటినీ ప్రొహిబిషన్ చట్టం కిందకు కన్వర్ట్ చేసి రాజీ చేయడం ఎవరికి న్యాయం చేయడం కోసం? అటు వంటప్పుడు కేసులను ఎక్సైజ్ చట్టం కింద నమోదు చేయ డం దేనికి? ఎక్సైజ్ కేసులలో చార్జ్ షీట్‌లను పరిశీలిస్తే కనీసం నిందితులకు నోటీసులు కూడా తామీలు కాకుం డానే కేసులు రాజీ అయిపోతున్న తీరు ఎన్నో అనుమానా లకు తావిస్తున్నది. సింగరేణీ అధికారులకు సంస్థ ఆస్తులను దోచుకున్న దొంగలమీద అంతులేని ఆప్యాయత ఎందుకో అసలే అర్థం కావడం లేదు. పోయిన సొమ్ము మొత్తం రిక వరీ కాకపోయినా, పెద్దమొత్తం లో దొంగతనం అయినా సరే చిన్న మొత్తానికే (నామమాత్రపు పైన్) కేసులను ఎత్తి వేస్తున్నారు. ఇది సమాజంలో ఏవిధమైన పరివర్తన తెస్తుం దో సింగరేణీ అధికారులు, ప్రోత్సహిస్తున్న న్యాయముర్తు లకు, చోద్యం చూస్తున్న సామాజిక ఉద్యమకారులకే తెలియాలి. ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక జరుగు తున్నదేమిటో అందరికీ తెలుసు అయినా ఎవరూ పట్టించు కోరు. ఈ విధమైన చర్యలవలన సమాజానికి, న్యాయవ్యవస్థకు జరిగే మేలేమిటో ఎంత తర్కించినా అంతుచిక్కడం లేదు.
ఇంతకాలం డిఫెన్స్‌కు, ప్రాసిక్యూషన్‌కు మధ్య సమాన దురాన్ని పాటిస్తూ న్యాయవ్యవస్థ తనదైన స్వయం ప్రతిపత్తిని, ప్రత్యేకతను, నిస్పక్షపాత్రను నిర్వర్తిస్తూ వస్తు న్నది. లోక్ అదాలత్‌లు, లీగల్ లిటరసీ క్యాంపు పేరుతో కాలక్రమంలో న్యాయవ్యవస్త ప్రాసిక్యూషన్‌కు దగ్గరగా జరుగుతుందన్న భావన అంతర్గతంగా ప్రబలుతున్నది. మానసికంగా ఏదోతెలియని బంధం ఆ రెండు పార్శ్వాలు/ వర్గాలు/విభాగాల మధ్య మెల్లమెల్లగా పెనవేసుకుంటు న్నది. రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ప్రత్యేకతను, న్యాయవ్యవస్థ తనకు తానుగా వదులుకునే దిశలో చర్యలు భవిష్యత్తుకు ప్రమాదకరం. ఇన్ని అనర్థాలకు వేదిక స్వ యంగా న్యాయవ్యవస్తే కావడం దురదృష్టం. ఈ యజ్ఞం వలన సాదించే ఫలం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ యజ్ఞంలో మనమే సమిధలం అవుతామేమో అన్న భయం మనసును తోలచివేస్తున్నది. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే చిన్నప్పుడెప్పుడో చదివిన రాజుగారి దేవతావస్త్రాల కథ గుర్తు కొస్తున్నది. ఇప్పటికైనా ఈ వ్యవహారంలో సాకారా త్మక, విమర్శనాత్మక చర్చను ఆహ్వానిస్తారని, ఆలకిస్తారని ఆశిస్తున్నాను. సదా న్యాయవ్యవస్థ ఉన్నతిని కాంక్షించే సామాన్యుడు.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది
9440449392