Thursday, June 27, 2024
Homeఓపన్ పేజ్OBC census not a Bramhastra?: ఉపయోగించని బ్రహ్మాస్త్రం

OBC census not a Bramhastra?: ఉపయోగించని బ్రహ్మాస్త్రం

అరుపులు, కేకలు తప్ప విపక్షం చేస్తున్నదేం లేదు

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంతో పాలక బీజేపీ అత్యధిక సంఖ్యాక హిందువులకు బాగా దగ్గర కాగలిగింది. మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ విధంగా అది తన విజయావకాశాలను బాగా మెరుగుపరచుకోగలిగింది. జగన్నాథ రథ చక్రాల మాదిరిగా దూసుకుపోతున్న ఈ సాంస్కృతిక రాజకీయాలను ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు కష్టమైన విషయమేననడంలో సందేహం లేదు. నిజానికి, ప్రతిపక్షాల చేతుల్లో ఇంతకు మించిన బ్రహ్మాస్త్రమున్నా దాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్నది ప్రతిపక్షాలకు అంతుబట్టకుండా ఉంది. దేశంలో సామాజిక న్యాయం అనేది అట్టడుగు స్థితిలో ఉందంటూ గత ఏడాది బీహార్ కుల గణన సర్వే తేల్చి చెప్పినప్పటికీ, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడానికి
ప్రతిపక్షాలు చేస్తున్నదేమీ కనిపించడం లేదు. దాన్ని ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నం కూడా ఎక్కడా జరగడం లేదు.

- Advertisement -

కుల గణన మీద జాతీయ స్థాయిలోనూ, ప్రతిపక్షాల్లోనూ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కాంగ్రెస్, వామపక్షాల వంటి జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు ఎటువంటి కార్యాచరణనూ చేపట్ట లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన విలువల మీద సైద్ధాంతిక పోరాటాలు సాగించి ఉంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక ప్రత్నామ్యాయాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. అటువంటిదేమీ జరగడం లేదు. పైగా, మతపరమైన, సాంస్కృతిక సంబంధమైన కార్యక్రమాలతో పాలక పక్షం రాజకీయ రంగంలో ఆధిపత్య స్థానానికి చేరుకుంటుండడం, ప్రతిపక్షాలు రోజు రోజుకూ వెనుకపట్టు పడుతుండడం నిజంగా దురదృష్టకర విషయం. మధ్యమధ్య చిన్నచిన్నగా అరవడం, కేకలు పెట్టడం తప్ప ప్రతిపక్షాలు చేస్తున్నది కూడా ఏమీ లేదు. కుల గణన సర్వే నివేదిక దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పగలిగి ఉండేది. అందులో ఓబీసీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణను రూపొందించి ఉంటే, ప్రతిపక్షాల రాజకీయ ఆశయాలు చాలావరకు నెరవేరి ఉండేవి.

ఓబీసీల చుట్టూ అల్లుకున్న రాజకీయ డిమాండ్లకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే, దేశంలో కోట్లాది మంది ప్రజల మనస్సుల్లో కొత్త ఆశలు, ఆశయాలు చిగురించి ఉండేవి. హిందుత్వ సాంస్కృతిక ఆధిపత్యంలోని లోపాలు, లొసుగులకు ఇది సరైన పరిష్కారం కాగలిగి ఉండేది. విచిత్రమేమిటంటే, బాగా వెనుకబడిన తరగతులను (ఈబీసీలను), బడుగు వర్గాలను ఆకట్టుకోవడానికి పాలక పక్షం చేస్తున్నన్న ప్రయత్నాలు కూడా ప్రతిపక్షాలు చేయలేకపోతున్నాయి. ఈబీసీలకు పదవులు ఇవ్వడం, పథకాలు ప్రకటించడం ద్వారా పాలక పక్షం వారిని ఆకట్టుకుంటున్నప్పుడు, అటువంటి వర్గాల కోసం ప్రతిపక్షాలు మరింత పథకాలను ప్రకటించడం వంటివి జరగాల్సి ఉంది. పాలక పక్షం ఈబీసీలను ఆకట్టుకుంటుండడంతో ఓబీసీలు కూడా వారంతట వారే పాలక పక్షం వైపు మొగ్గు చూపే అవకాశం కలుగుతోంది. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలకు లేదా ఇండీ కూటమికి సామాజిక న్యాయం అనే అస్త్రం బాగా ఉపయోగపడేది. ఈబీసీలు, ఓబీసీల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ప్రతిపక్షాలకు ఎంతైనా ఉంది. దానికి ఇది సరైన సమయం అనడంలో సందేహం లేదు.

ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీహార్ లోని రాష్ట్రీయ లోక్ దళ్ వంటి పార్టీలు ఓబీసీలకు, ఈబీసీలకు సామాజిక న్యాయం తీసుకు రావడానికి ఏర్పడిన పార్టీలే. గత దశాబ్ద కాలంగా ఇవి దళితులు, బహుజన వర్గాల హక్కుల కోసం బీజేపీతో పోరాటం సాగిం చడం కూడా జరుగుతోంది. కుల గణన నివేదిక ద్వారా ఈ పార్టీల వాదనలకు బలం చేకూరింది. ఈ వర్గాలు క్రమంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడుతున్నాయంటూ బీజేపీ చేస్తున్న వాదనలను తిప్పికొట్టగలిగిన సత్తా ఈ కుల గణన సర్వేతో ప్రతిపక్షాలకు ఏర్పడింది. ఈ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కూడా చిన్నా చితకా పాత్రను పోషిస్తున్నందువల్ల జాతీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి, వాటిని సంఘటితం చేసి, సామాజిక న్యాయం కోసం ఉద్యమించి ఉండాల్సింది. ప్రతి రాష్ట్రంలోనూ కుల గణన జరగాలని, వెనుకబడిన వర్గాలు, దళితులకు ఏ స్థాయిలో సామాజిక న్యాయం జరుగుతున్నదీ, ఈ వర్గాలు ఏ స్థాయిలో ఆర్థికంగా పురోగతి చెందుతున్నదీ తేలాలని డిమాండును చేపట్టడానికి కూడా ప్రతిపక్షాలు అవకాశమివ్వడం లేదు.

తమ కోసం ప్రతిపక్షాలు పోరాటాలు జరపనందువల్లే వెనుకబడిన వర్గాలు, దళితులు ఈ పార్టీలను వదిలిపెట్టి పాలక బీజేపీ వైపు మొగ్గుచూపడం జరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ కుల గణనను, సామాజిక న్యాయాన్ని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుని ఉంటే ఆ వర్గాలన్నీ తిరిగి ఈ పార్టీలలో చేరి ఉండేవి. ఒక మంచి అవకాశాన్ని ప్రతిపక్షాలు మరోసారి చేజార్చుకున్నట్టయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News