Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్One nation One Electin: 2024లో దేశవ్యాప్తంగా మినీ జమిలి ఎన్నికలు?

One nation One Electin: 2024లో దేశవ్యాప్తంగా మినీ జమిలి ఎన్నికలు?

అంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు మొత్తం పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు న్నాయి. కొన్నినెలల కిందట త్రిపుర, నాగాలా్‌ండ మేఘాలయ ఎన్నికలు పూర్తయ్యాయి. మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దీంతో ఇక ఎన్నికలు జరగాల్సింది కేవలం ఐదు రాష్ట్రాల్లోనే. అవి మిజోరం, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు. అయితే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే 2024 అక్టోబరులోగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మహారాష్ట్ర అసెంబ్లీని త్వరలో రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభతో పాటు మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం లోపాయికారిగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఒక్కటే కాదు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్‌సభతో పాటు జరిగే అవకాశాలున్నయన్నది రాజకీయ పరిశీలకుల సమాచారం. అంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు మొత్తం పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా మినీ జమిలి ఎన్నికలన్నమాట. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టి ఆమోదింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ బిల్లు గనుక పార్లమెంటులో ఓకే అయితే మినీ జమిలి ఎన్నికలు నిర్వహించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జమిలి ఎన్నికలనేది ఒక వివాదాస్పద అంశం. దీంతో వృధా ఖర్చుకు చెక్‌ పెట్టడానికే మినీ జమిలి ఎన్నికలకు వెళుతున్నట్లు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌తో చెప్పించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మినీ జమిలి ఎన్నికల వెనుక భారీ వ్యూహం ?
వృధా ఖర్చుకు చెక్‌ పెట్టడానికే అని పైకి చెప్పబోతున్నప్పటికీ మినీ జమిలి ఎన్నికల వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కట్టడి చేయడం బీజేపీ వ్యూహంలో భాగమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరగాలి. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి వరకు జరగాలి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశవ్యాప్తంగా పర్యటించే అవకాశాలు ఉండటంతో కేంద్రప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అంటే మూడు నెలలకు పైగా భారత్‌ రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ హోదాలో కేసీఆర్‌ దేశమంతా పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్‌ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను చీల్చి చెండాడే నాయకుడిగా కేసీఆర్‌కు సామాన్య ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారుడిగా, సమర్థుడైన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కంటూ ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై కేసీఆర్‌ ఆలోచనలను జాతీయ స్థాయి రైతుసంఘ నాయకుడైన తికాయత్‌ కూడా గతంలో ప్రశంసించిన విషయం ఇక్కడ ప్రస్తావించుకుని తీరాలి. బియ్యం కొనుగోలుకు సంబంధించి కొన్నేళ్ల కిందట కేంద్రంతో లడాయి వచ్చినప్పుడు ఢిల్లీలో గులాబీ పార్టీ చేసిన ధర్నా కార్యక్రమం సూపర్‌డూపర్‌గా హిట్టయింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నాయకులు బీఆర్‌ఎస్‌ ధర్నా కార్యక్రమానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆ తరువాత థర్డ్‌ ఫ్రంట్‌ కూటమి కోసం కాలికి బలపం కట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. థర్డ్‌ ఫ్రంట్‌ సంగతి ఎలాగున్నా తెలంగాణలో సుపరిపాలనను అందించిన ఘనత స్వంతం చేసుకున్నారు కేసీఆర్‌. రైతు బంధు వంటి వినూత్న పథకంతో అన్నదాతలకు కొండంత మేలు చేస్తోంది తెలంగాణ సర్కార్‌. అలాగే బీజేపీ సృష్టి అయిన నీతి ఆయోగ్‌లోని డొల్లతనాన్ని యావత్‌ భారతదేశానికి తెలియచేశారు కేసీఆర్‌. అంతేకాదు ఇటీవలి కాలంలో ఐటీకి హైదరాబాద్‌ హబ్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వంటి ప్రజలకు మేలు చేసే పథకాలు ఏమీ లేవు. దీంతో మూడు నెలలపాటు కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆ ప్రభావం కమలం పార్టీ విజయావకాశాలపై తప్పకుండా పడుతుంది. ఈ కారణంతోనే కేసీఆర్‌ను చూసి భయపడుతోంది కమలం పార్టీ. ఈనేపథ్యంలో డిసెంబర్‌లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యవధిని మార్చివరకు పొడిగించి లోక్‌సభతో పాటే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అంటే కేసీఆర్‌ను తెలంగాణ ఎన్నికల ప్రచారానికే పరిమితం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
జమిలి ఎన్నికలతో డేంజర్‌జోన్‌లో ప్రతిపక్షాలు!
మనదేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలా కాలం పాటు జమిలి ఎన్నికలు జరిగాయి. 1951 నుంచి 1967 వరకు అటు లోక్‌ సభకు ఇటు శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే 1968లో తొలిసారి ఈ ఆనవాయితీకి బ్రేక్‌ పడింది. 1968లో ప్రజలెన్నుకున్న హర్యానా ప్రభుత్వం రద్దయింది. అలాగే 1969లో బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాయి. దీంతో ప్రభుత్వాలు రద్దయిన రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపడం అనివార్యమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో 1967తో జమిలి ఎన్నికల ఆనవాయితీ అటకెక్కింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగే కొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏడాది పొడవునా దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం మొదలైంది.బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తరువాత మళ్లీ జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒన్‌ నేషన్‌ – ఒన్‌ ఎలక్షన్‌ అంటూ కొత్త పల్లవి అందుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి 2019 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 40 రాజకీయ పార్టీలను ఆల్‌ పార్టీ మీటింగ్‌కు ఆహ్వానించారు. ఈ సమావేశానికి 21 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జమిలి ఎన్నికల కాన్సెప్ట్‌ను ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహజంగా లోక్‌ సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది. ఇదిలాఉంటే,
లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న వాదన. ఫలితంగా కేవలం జాతీయ పార్టీలకే మేలు జరుగుతుందన్నది ప్రాంతీయ పార్టీల దళపతులు లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఛరిష్మా నేపథ్యంలో జమిలి ఎన్నికలు అంటూ జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి జమిలి ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పనికిరావు. అధ్యక్ష తరహా పాలన కొనసాగే దేశాల్లోనే జమిలి ఎన్నికలు నడుస్తాయి. మొత్తానికి సమస్యల పరిష్కారం విషయంలో అత్తెసరు మార్కులు కూడా తెచ్చుకోని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాను అడ్డం పెట్టుకుని గెలుపు తీరాలకు చేరాలనుకుంటోంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఛరిష్మా పనికిరాకుండా పోయిన సంగతి కమలనాథులు మరుస్తున్నారు. ప్రజల ఆగ్రహంలో మహమహా నేతల ఛరిష్మా ఎందుకూ పనికిరాకుండా పోయిన సందర్భాల్లో చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయన్న సంగతి కమలనాథులు మరువరాదు.

  • ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News