ఎప్పటి మాదిరిగానే ప్రతిపక్షాలు తమకు అంది వచ్చిన సదవకాశాన్ని చేజార్చుకున్నాయి. మణిపూర్, హర్యానా వంటి కీలక దేశ సమస్యలను చర్చించడానికి అవిశ్వాస తీర్మానం పేరుతో తమ చేతి దాకా వచ్చిన సువర్ణావకాశాన్ని అవి చేజేతులా కుప్పకూల్చివేశాయి. నిజానికి, అవిశ్వాస తీర్మానం ప్రయోజనం అదే. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా కూల్చివేసే అవకాశం లేదని ప్రతిపక్షాలకు స్పష్టంగా తెలుసు. అయితే, దీనిని అడ్డం పెట్టుకుని, మణిపూర్, హర్యానా వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి, ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి అవి ప్రయత్నించి ఉండాల్సింది. అందుకు ప్రతిగా, ఈ సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశమే లేకుండా ప్రతిపక్షాలు వ్యవహరించినట్టు కనిపిస్తోంది.
లోక్ సభలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ఉద్దేశం, ప్రయోజనం పూర్తిగా బురదలో పోసిన పన్నీరుగా మారాయి. దేశాన్ని తీవ్రంగా ఆందోళన పరుస్తున్న మణిపూర్ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సింది. ఇటువంటి అల్లర్లకు పాల్పడితే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయనే హెచ్చరిక సంకేతాలను పంపించాల్సింది. అయితే, అవేవీ జరగకపోవడం తీవ్ర నిరుత్సాహం కలిగించింది. ఈ సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే తప్ప తమది కాదన్నట్టుగా ప్రతిపక్షాలు వ్యవహరించాయన్న అభిప్రాయం కలుగుతోంది. దీనిపై విస్తృతమైన, క్షుణ్ణమైన చర్చ జరగాల్సి ఉంది. ఈ అవిశ్వాస తీర్మానంపై సమాధానం చెప్పడానికి ప్రధాని ఉద్యుక్తులైన క్షణం నుంచీ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడానికే తీవ్ర ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించే పరిణామం. పార్లమెంట్ విలువైన సమయాన్ని ఈ తీర్మానం వృథా చేయడం తప్ప మరో ప్రయోజనం కలగలేదని పించింది.
అంతకు కొద్ది రోజుల క్రితం మణిపూర్ సమస్యపై చర్చ జరిగినప్పుడు కూడా ప్రతిపక్షాలు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పేవరకూ ఓపిక పట్టలేకపోయాయి. అడుగడుగునా అవాంతరాలు సృష్టించాయి. ఈ సమస్యపై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు చివరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానాన్ని రాబట్టలేకపోగా, సమాధానం వినేందుకు ఆసక్తిని కూడా ప్రదర్శించలేకపోయాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పాలక, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. 2024 ఎన్నికల కోసం దీన్ని ఒక ప్రచార అవకాశంగా మలచుకోవడానికి కూడా ప్రతిపక్షాలు ప్రయత్నించకపోవడం శోచనీయం.
మణిపూర్ అల్లర్లకు సంబంధించి దేశ విదేశాలు తీవ్రంగా స్పందిస్తున్న సమయంలో ఈ అవిశ్వాస తీర్మానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదీ ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. పార్లమెంట్ ఉభయ సభలలో కొద్దిగా ఓర్పుగా, ఓపికగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాలు ఈ లక్ష్యాన్ని నెరవేర్చి ఉండేవి. గందరగోళం సృష్టించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం సాధించాయన్నది అంతుబట్టకుండా ఉంది. వాటికి ఒక వ్యూహమంటూ లేకుండాపోయింది.
తమ సమస్యపై పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని ఆశించిన మణిపూర్ ప్రజలకు నిరాశే మిగిలింది. ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాన్ని కూడా చేయకుండా, పాలక పక్షం నుంచి పటిష్టమైన చర్యలేవీ వినేందుకు అవకాశం లేకుండా పార్టీలు వ్యవహరించడం సహజంగానే దేశ ప్రజలను నిరుత్సాహపరిచాయి. ప్రతిపక్షాలు దీనిపై చర్చకు శ్రద్ధ చూపించకపోవడం, తగిన సూచనలు చేయకపోవడం పాలక పక్షానికి అనుకూలతనిచ్చింది.
Opposition historical mistake: చేజారిన సదవకాశం
తమ సమస్యను చర్చించని పార్లమెంట్ తీరుతో నిరాశలో మణిపూర్ ప్రజలు