Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Opposition Unity: ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న రాహుల్‌ అనర్హత రగడ

Opposition Unity: ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న రాహుల్‌ అనర్హత రగడ


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వేసిన అనర్హత వేటు దేశంలో దుమారం రేపు తోంది. అనర్హత రగడలో రాహుల్‌కు దాదాపుగా ప్రతిపక్షా లన్నీ అండగా నిలబడ్డాయి. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. వీటిలో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మినహా మిగతావన్నీ మౌలికంగా భార తీయ జనతా పార్టీకి వ్యతిరేకమే. తెలంగాణలోని భారత్‌ రాష్ట్ర సమితి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ, మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన వర్గం ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వంతో యుద్ధాలు చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల్లో ఎవరి దారి వారిదే. ప్రాంతీయ పార్టీల దళపతుల్లో ఐక్యత పెద్దగా కనిపించదు. ఎవరి రాజకీయ అజెండా వారిదే. తమతమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పొలిటికల్‌ అజెండాతో ముందుకు పోతుంటాయి ప్రాంతీయ పార్టీలు. ఇక్కడో విషయం గమనించాలి. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఈ ప్రాంతీయ పార్టీలు ఢీ కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో అటు బీజేపీ తోనూ ఇటు కాంగ్రెస్‌తోనూ భారత్‌ రాష్ట్ర సమితి రాజకీయ సమరం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ అనర్హత వేటు అంశం ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తీసుకువస్తున్న సంకే తాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనర్హత రగడ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో మార్చి 27న నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయా ల్లో కాంగ్రెస్‌ను ఆమడ దూర ఉంచే మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొ నడం ఆసక్తికర విషయం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ తో అనునిత్యం ఫైట్‌ చేస్తోన్న భారత్‌ రాష్ట్ర సమితి కూడా పాల్గొనడం మరో విశేషం.
బీజేపీపై పోరుకు ప్రతిపక్షాలు సై
రాహుల్‌ వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై సమరానికి ప్రతిపక్షాలు సై అంటున్నాయి.నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌ను గద్దెదించడానికి ఢిల్లీ వెళదామని (ఔర్‌ ఏక్‌ దఫా ఢిల్లీ చలో) మిగతా ప్రతి పక్షాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడం విశేషం. జాతీయ రాజకీయాల వరకు అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్‌తోనూ సహజంగా మమతా బెనర్జీ సమాన దూరం పాటిస్తుంటారు. అయితే రాహుల్‌ అంశం తెరమీదకు వచ్చిన తరువాత కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలన్న తన మునుపటి నిర్ణయాన్ని మమతా బెనర్జీ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ విషయానికొస్తే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మోడీ హటావో ..దేశ్‌ బచా వో నినాదంతో గోడపత్రిలను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిష్కరి స్తోంది.
అసలు అనర్హత గొడవ ఏమిటి ?
2019 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌ గాంధి చేసిన ఒక కామెంట్‌ ఈ మొత్తం వివాదానికి కార ణమైంది. అవినీతి, అక్రమాలతో సంబంధం ఉన్నవారం దరికీ మోడీ ఇంటిపేరే ఉందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్య వివాదంగా మారింది. దీంతో మోడీ సామాజికవర్గాన్ని కించపరిచారంటూ గుజరాత్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ సూరత్‌ కోర్టులో దావా వేశారు. పూర్ణేష్‌ మోడీ దావాపై సూరత్‌ సెషన్స్‌ కోర్టు ఈ ఏడాది మార్చి 23న తీర్పు ఇచ్చింది. రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా నిర్థారించింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లో లోక్‌సభ సెక్రటేరియట్‌ స్పందించింది. రాహుల్‌ పై అనర్హత వేటు వేసింది. లోక్‌సభ సెక్రటేరియట్‌ తీసు కున్న ఈ అనూహ్య నిర్ణయం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. మనదేశంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. మిగతా పార్టీ లతో పోలిస్తే కమలనాథులే ఈ విషయంలో ముందుం టారు. అయితే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్‌ ఫైజల్‌ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో రాహుల్‌పై సానుభూతి పెరి గింది. రాహుల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ టార్గెట్‌ చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. సైద్ధాంతికంగా కాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం ప్రస్తుతం రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News