Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Pak shock: పాక్కు పోక్ స్ట్రోక్! భారత్ వైపు చూస్తున్న గిల్గిట్ బాల్టిస్థాన్

Pak shock: పాక్కు పోక్ స్ట్రోక్! భారత్ వైపు చూస్తున్న గిల్గిట్ బాల్టిస్థాన్

అసలే ఆర్ధిక ఇక్కట్లతో దివాలా దిశలో పయనిస్తున్న పాకిస్థాన్కు గోరుచుట్టుమీద రోకటి పోటులా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పోక్)లో పరిస్థితులు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. పాకిస్థాన్ తన బహుళ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, దానికి మరో పెద్ద సమస్య సిద్ధంగా ఉంది. 1947లో జమ్ము-కశ్మీర్ నుంచి కొంత భాగాన్ని పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్నే ఇప్పుడు పోక్ అని పిలుస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా పాక్ విభజించింది. అవే ఆజాద్ కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాభా (అజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్) 2020లో సుమారు 52 లక్షలు. 1947కు ముందు ఈ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా జమ్మూ-కశ్మీర్లో భాగంగానే ఉండేది. పోస్ట్లో ఉన్న గిల్గిత్ బాల్టిస్థానన్ను 2009 వరకు ఉత్తర ప్రాంతాలుగా వ్యవహరించేవారు. భారత్లో విలీనమైన కశ్మీర్కు పశ్చిమదిశలో ఆజాద్ కశ్మీర్ ఉంది. పశ్చిమ లడఖ్ ప్రావిన్స్కు చెందినదే బాల్టిస్టాన్! ఇక్కడి ప్రజలే ప్రస్తుతం తమను భారత్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు..
విభజన సమయంలో, జమ్మూ కశ్మీర్ భారతదేశం లేదా పాకిస్థాన్లో చేరాలా అనే అంశంపై ఆనాటి పాలకుడు మహారాజా హరిసింగ్ దానిని స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. 1947లో పాకిస్థాన్కు చెందిన పష్టూన్ గిరిజనులు జమ్మూ కశ్మీర్పై దాడిచేశారు. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి మహారాజా హరిసింగ్ అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్బాటన్ ను సైనికసాయం కోరారు. జమ్ము-కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ తరువాత ఆ ప్రాంతం విలీనం గురించి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని హరిసింగ్కు మౌంట్బాటన్ సూచించారు. ఆ మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో చట్టబద్ధతపై పాక్ ప్రశ్నించడంతో అక్కడికి ఆగిపోయింది. అనంతరం హరిసింగ్ 1947 అక్టోబర్ 26న జమ్మూలోని అమర్ ప్యాలెస్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్పై సంతకం చేశారు. దీనిని భారతదేశ చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అక్టోబర్ 27న ఆమోదించారు. ఇదే కశ్మీర్ వివాదానికి బీజం వేసినట్లు చెబుతున్నారు.
పోక్పై చూపెందుకు?
జమ్ము-కశ్మీర్లో పోక్ అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది అనేక దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. పశ్చిమాన పాకిస్థాన్లోని పంజాబ్, వాయువ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఇప్పుడు ఖైబర్ – పస్తుంట్వా), వాయవ్యంలో ఆఫ్ఘనిస్థాన్కు చెందిన వాభాన్ కారిడార్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్ ఉత్తరం, తూర్పున భారతదేశ జమ్మూ-కశ్మీర్ ఉన్నాయి.
భారత్లో విలీనానికి పోక్ ప్రజల ఆందోళన
ప్రస్తుతం పాక్ తానుచేసిన పాపాలను తానే అనుభవిస్తోంది. భారత్పై దాడులు చేయడం ద్వారా అస్థిరత సృష్టించి సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ఏ టెర్రరిస్టులనైతే ప్రోత్సహించిందో అదే టెర్రరిస్టులు ఇప్పుడు పాకు నిద్రలేకుండా చేస్తున్నారు. దాంతోపాటే పోక్ ప్రజలు భారత్లో విలీనం కోరుకుంటున్నారు. ఇటీవల నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు ఆ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని కోరుతున్నారు. కశ్మీరీలంతా పాక్ లో ఉండాలనే కోరుకుంటున్నారనే వాదనకు వాస్తవం ఈ రూపంలో జవాబిస్తోంది. రెండు దేశాలను కలిపే కార్గిల్ రోడ్డును
తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తున్న ప్రదర్శనకారుల డిమాండ్ వీడియోల్లో వైరల్ అవుతున్నాయి. పలు ఒడిదుడుకుల మధ్య సతమతమవుతున్న పాకిస్థాన్కు అనేక అనూహ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దేశవ్యాప్తంగా గోధుమ పిండి కొరత, బలూచిస్థాన్లో తిరుగుబాటు, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వివాదం, పాకిస్థానీయులపై తాలిబన్ల దాడులు, వికలాంగ ఆర్థిక సంక్షోభం, పీఓకేలోని ప్రజల డిమాండ్ ఇలా ఎన్నో ఉన్నాయి. వారు భారత్లో ఉన్నట్టుగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. పీఓకే బహిష్కృత నేత షౌకత్ అలీ కూడా పీఓకేలో ప్రజలెదుర్కొంటున్న కష్టాలను ఎత్తిచూపేందుకు డిసెంబర్ నుంచి వివిధ దేశాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్ 1948 నుంచి సహజ వనరులను దోపిడీ చేసిందని, అయితే ప్రతిఫలంగా పోక్లో ప్రజలు నిరుద్యోగం, ప్రవాసాన్ని పొందారని ఆయన ఇటీవల జెనీవాలో ఏఎస్ఐ వార్తాసంస్థకు చెప్పారు. దేశమంతటా ఉన్న ప్రజల కష్టాల మధ్య పీఓకేలోని నివాసితుల భూమిపై యాజమాన్యం, జనాభా మార్పులు చేయడం, పన్నులు పెంచడం, అలాగే విద్యుత్ కోతలు, ఆహారం వంటి ప్రాథమిక జీవన పరిస్థితులపై పాకిస్థాన్ వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసనలు చేస్తున్నారు. భారత్ అభివృద్ధి వల్లనే ఆకర్షణ
ఏడు దశాబ్దాలు గడిచిన తరువాత పాల్ను భారత్తో పోల్చితే అభివద్ధిలోను, సుస్థిరతలోను ఉన్న తారతమ్యం తెలుస్తోంది. అనవసరమైన కక్షతో భారత్పైకి మూడుసార్లు యుద్ధానికి దిగినా పాక్కు వెనకడుగేగానీ ముందుకు అడుగువేయలేని స్థితి. ఈ విషయాన్ని ప్రస్తుత పాక్ ప్రధానే అంగీకరించారు. అందుకే పోక్ ప్రజలు కూడా అదే సుస్థిరతను కోరుకుంటున్నారు. పాక్ లో సుదీర్ఘకాలం సైనిక పాలన, చాలా తక్కువకాలం ప్రజాస్వామ్య పాలన కొనసాగడం కూడా ఆ దేశానికి సుస్థిరతను కరువుచేసింది. పైగా ఇప్పుడు దివాలా దిశలోకి అడుగుపెడుతోంది. దానికతోడు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు (370 రద్దు. త్రిబుల్ తలాక్ వంటివి) కూడా పోక్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తాము ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతుంటే తమకు దాపునే ఉన్న భారత్ కశ్మీర్ అభివృద్ధిలో నడుస్తుండడం వారిని ఆకర్షిస్తోంది. అందుకే భారత్లో విలీనం కావాలని వారు కోరుకుంటున్నారు.
– టీఎస్సార్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News