Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Pakistan in complete crisis: సంక్షోభాలతో పాకిస్థాన్‌ సతమతం

Pakistan in complete crisis: సంక్షోభాలతో పాకిస్థాన్‌ సతమతం

కొంప ముంచిన మతం, సైన్యం, విద్యా విధానం

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనడానికి పాకిస్థానే సరైన ఉదాహరణ. పొరుగు దేశాలకు కీడు తలపెట్టబోయిన పాకిస్థాన్‌ అతి తక్కువ కాలంలోనే తానే సమస్యల్లో, పైగా అవే సమస్యల్లో కూరుకుపోయి, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు పాకిస్థాన్‌ తాను మత దేశంగా ఉండడానికి ఇష్టపడింది. ఇస్లాం మతాన్ని ఆచరించే దేశంలో కొనసాగడానికి ప్రాధాన్యం ఇచ్చింది. అందుకు విరుద్ధంగా భారతదేశం ఒక లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడానికి సిద్ధపడింది. ఒక విధమైన ఉదారవాదాన్ని అనుసరించడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా, పాకిస్థాన్‌ ఒక మతోన్మాద, కఠిన, సాంప్రదాయిక వ్యవస్థలో తనకు తానే బందీ అయిపోయింది. భారతదేశం ఒక బహుళ జాతీయ వ్యవస్థను ఎంచుకుని, ఉదారవాద ధోరణులతో ముందుకు సాగిపోయింది. పాకిస్థాన్‌ దేశానిది ఒక మారని వ్యవస్థ కాగా, భారత్‌ ది అతివేగంగా మారిపోగల, ఏ చట్రంలోనైనా ఇమిడిపోగల వ్యవస్థ. ముఖ్యంగా భారత్‌లో ప్రశ్నించడానికి, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పండించడానికి అవకాశం ఉంది. పాకిస్థాన్‌ లో ప్రతిదీ అభేద్యమైన మత వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. రకరకాలుగా ఆలోచించడం, పరిశోధించడం, లోతుగా అధ్యయనం చేయడం, విభిన్నంగా శోధించడం అన్నవి విజ్ఞాన విస్తరణకు పునాదులు కనుక భారతదేశంతో ఇతర దేశాలతో సమానంగా అనేక రంగాలలో ముందుకు పోగలుగుతోంది. ముఖ్యంగా చదువుల్లో కొత్త పుంతలు తొక్కగలుగుతోంది. ఆ పరిస్థితి పాకిస్థాన్‌ దేశంలో కనిపించడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు దాటినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
ఈ రెండు దేశాల్లో ఇందుకు సంబంధించిన పాలనను అధ్యయనం చేయడానికి పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త, ‘ది బ్లాక్‌ హోల్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ సంస్థాపకుడు అయిన డాక్టర్‌ పర్వేజ్‌ హుద్బాయ్‌ దేశవ్యాప్తంగా ప్రసంగాలు చేయడం, ఉభయ దేశాలకు చెందిన ప్రముఖులతో చర్చించడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా, విద్య, మేధోపరమైన అంశాలు, సైన్స్‌, టెక్నాలజీ, రాజకీయాలు, సామాజిక ధోరణులు, సంస్కృతి వంటి అంశాలపై ఆయన ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రసంగాలు చేయడం, చర్చలు జరపడం వంటివి చేస్తుంటారు. ఇది ఇస్లామాబాద్‌ నగరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని పనిచేస్తోంది. వీటిపట్ల ఎక్కువగా యువతీ యువ కులు ఆకర్షితులవుతున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరం
ఒకసారి హుద్బాయ్‌ ఒక విద్యా కేంద్రంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు ఆయనను, భారతదేశం చంద్రయాన్‌ ప్రయోగంతో వైజ్ఞానిక రంగంలో దూసుకుపోతుండగా, పాకిస్థాన్‌ మాత్రం అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు ఆయన సూటిగా, నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు. మతాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని వేరు వేరుగా చూడకపోవడం వల్ల, యువతీ యువకుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నింపకపోవడం వల్ల భారత్‌ కంటే పాకిస్థాన్‌ అనేక రంగాల్లో, ముఖ్యంగా విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో బాగా వెనుకబడి ఉందని ఆయన జవాబిచ్చారు. ఆయన ఇంతకు మించి ఈ విషయం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ, తమ మత సూత్రాలలో ఉన్న అనేక అంశాలకు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎక్కడా పొంతన లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
అంతేకాదు, తాను భారతదేశానికి వెళ్లి అనేక విశ్వ విద్యాలయాలను, విజ్ఞాన కేంద్రాలను సందర్శించానని, అక్కడి అధ్యాపకులకు పాకిస్థాన్‌లో అధ్యాపకులకు చెల్లిస్తున్న జీతభత్యాల కంటే అతి తక్కువ జీతభత్యాలే చెల్లిస్తున్నప్పటికీ, భారతదేశ అధ్యాపకులు ఎంతో అంకితభావంతో పని చేస్తుండడం తాను గమనించానని కూడా డాక్టర్‌ హుద్బాయ్‌ తెలిపారు. భారతీయ అధ్యాపకులకు కూడా పాకిస్థాన్‌లో మాదిరిగానే మత సంబంధమైన నమ్మకాలు ఉన్పప్పటికీ, వారు విధి నిర్వహణకు హాజరవుతున్నప్పుడు తమ మత నమ్మకాలను ఇళ్ల దగ్గరే వదిలి వస్తుంటారని కూడా ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ కంటే నాణ్యమైన విద్యాబోధన భారతదేశంలో జరుగుతోందని అంటూ ఆయన, అక్కడి ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐ.ఐ.టి) ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు తెప్పించుకుని పాకిస్థాన్‌ విద్యార్థులు తమ ప్రొఫెసర్ల నుంచి ఆ ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రశ్నలకు ఇక్కడి ప్రొఫెసర్లలో ఒక్కరు కూడా సమాధానాలు చెప్పలేరని ఆయన సవాలు చేశారు.
పెరుగుతున్న నిరుద్యోగం
భారతదేశ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్లకు సాటిరాగల ప్రొఫెసర్లు పాకిస్థాన్‌లో లేరని, ఇక్కడి ప్రొఫెసర్లు తమ సబ్జెక్టులలో నిష్ణాతులు కారని, వారికి బోధించడం కూడా చేతకాదని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా కేంద్రాల్లో కూడా ఎక్కువగా రాజకీయాల గురించి, మత సూత్రాల గురించి, తమ జీత భత్యాల గురించి మాత్రమే అధ్యాప కులు మాట్లాడుకుంటుండడం తాను అనేక పర్యాయాలు గమనించాలని, ఎక్కడా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్న జాడలేదని ఆయన అన్నారు. మొత్తానికి భారత్‌ లోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు, పాకిస్థాన్‌ లోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు మధ్య హస్తిమకాంతరం తేడా ఉందనే సంగతి ఆయన తేల్చిచెప్పారు. మతంలో మాదిరిగానే ఇక్కడ విద్యారంగంలో కూడా ప్రశ్నలు వేయడానికి అవకాశం లేదని, విద్యార్థులు యాంత్రికంగా విద్యనభ్యసిస్తూ ఉంటారని ఆయన అంటూ, భారతదేశంలో విద్యనభ్యసించిన ఇంజనీరింగ్‌, టెక్నాలజీ విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలోని అనేక సంస్థలకు అధిపతులుగా ఉంటున్నారని ఆయన తెలిపారు.
కాగా, ఆయన చేస్తున్న ప్రసంగాలు, కొనసాగిస్తున్న చర్చలను చూసి కొందరు ముల్లాలు ఆయన విద్యార్థులకు మత వ్యతిరేకతను నూరిపోస్తున్నారని, ఆయనో భారతీయ ఏజెంట్‌ అని ప్రచారం చేయడం, ప్రభుత్వానికి ఆయన మీద ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, ఇటీవల ఆయన తన ‘ది బ్లాక్‌ హోల్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ లో ‘స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్లకు పాకిస్థాన్‌ ఏ దశలో ఉంది?’ అనే అంశంపై చర్చను నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. నిపుణులు, మేధావులు, రచయితలు కూడా పాల్గొన్నారు. వారు పాకిస్థాన్‌ ప్రస్థానం గురించి కూలంకషంగా చర్చించారు. పాకిస్థాన్‌ ప్రగతికి అడ్డుపడుతున్న మూడు అంశాలను వారు గుర్తించి, వాటిపై విపులంగా చర్చించడం జరిగింది. ఇందులో మొదటి అంశం పాకిస్థాన్‌ తమ సైన్యం కబంధ హస్తాలలో చిక్కుకోవడం. కేవలం ఈ ఒక్క కారణంగానే పాకిస్థాన్‌ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా వెనుకబడిపోయిందని, దేశ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయిందని వారు అభిప్రాయపడ్డారు.
రెండవ అంశం ఏమిటంటే, విద్య, లైంగిక సమానత్వం, మైనారిటీలు, పాలన వంటి కీలక అంశాల్లో మత జోక్యం పెరిగిపోతుండడం. మూడవ అంశం, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు లోపభూయిష్టమైన, నాణ్యత కరువైన బోధన సాగించడం. విద్యాబోధనకు సంబంధించినంత వరకూ మత విద్యకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆధునిక విద్యకు ఇవ్వడం లేదని వారు భావించారు. పైగా మహిళలకు సరైన అవకాశాలు లేకపోవడం, వారికి ఉద్దేశపూర్వకంగా విద్యను, ఉద్యోగాలను దూరం చేయడం కూడా పాకిస్థాన్‌ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలుగా వారు అభివర్ణిస్తున్నారు. ఇక మైనారిటీలను కలుపుకుని వెళ్లకపోవడం, వారిని దారుణంగా అణచివేయడం వల్ల పాకిస్థాన్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
ముంచేసిన మతోన్మాదం
ప్రముఖ రచయిత షకీల్‌ చౌధురి ఈ చర్చాగోష్టిలో పాల్గొంటూ, మూఢ దేశభక్తి, యథేచ్ఛాప్రవర్తన, సైన్యం పట్ల వ్యామోహం, భారతదేశాన్ని విమర్శించడంతోనే కాలక్షేపం చేయడం వంటివి పాకిస్థాన్‌ ఎదుగుదలకు ప్రధాన ప్రతిబంధకాలవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఆత్మవిమర్శ లేకపోగా, భారత్‌ను విమర్శించడమే దేశభక్తిగా చెలామణీ అవుతుండడం జరుగుతోందని కూడా ఆయన అన్నారు. పాకిస్థాన్‌కు సంబంధించిన వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి తాము అహర్నిశలూ శ్రమిస్తున్నామని, పాకిస్థాన్‌ తన దేశీయ, విదేశీ విధానాల విషయంలో వినాశకర పద్ధతిలో వ్యవహరిస్తోందని, అందుకు ప్రతిగా భారతదేశం ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలనే శాసించే స్థితికి చేరుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ మతాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌ పై ఏదో సాధించాలని ఆశిస్తుండగా, నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్‌ ముస్లిం దేశాలను సైతం తమ వైపునకు తిప్పుకుని, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తోందని, ముస్లిం దేశాలు సైతం పాకిస్థాన్‌ను ద్వేషించడం, దూరం పెట్టడం జరుగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు డాక్టర్‌ సాజిద్‌ తరార్‌ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరకీ తామే ఏకైక ప్రతినిధులమని చెప్పుకోవడం, మత రాజకీయాలు చేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి కాలం చెల్లిన విధానాలని, వాటి నుంచి ఎంత త్వరగా బయటపడితే పాకిస్థాన్‌కు అంత మంచిదని కూడా ఆయన స్పష్టం చేశారు. మతం ద్వారా అందరినీ కలుపుకునిపోగలమనే ఆలోచన వినాశకర పంథా అవుతుందే తప్ప ఆశించిన ప్రయోజనం చేకూరదని కూడా సాజిద్‌ తరార్‌ పేర్కొ న్నారు. అరబ్‌ దేశాలు సైతం మోదీని అత్యుత్తమ, అత్యున్నత అవార్డులతో సత్కరించడాన్ని పాకిస్థాన్‌ గమనించాలని కూడా ఆయన సూచించారు. పాకిస్థాన్‌లో చివరికి గోదుమ పిండికి కూడా కొరత ఏర్పడడం ఆశ్చర్యం కలిగిస్తోందని, పెట్రోల్‌ ధర లీటరుకు 320 రూపాయలు చెబుతున్నారని ఆయన అంటూ, సోషల్‌ మీడియాలో ప్రతి విషయంలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం జరుగుతోందని తరార్‌ గుర్తు చేశారు. తమ విధానాలు, మత జోక్యం, సైనిక పాలన వంటివి పాకిస్థాన్‌ ప్రగతికి ఏమాత్రం దోహదం చేయనప్పుడు వాటిని వెంటనే మార్చుకోవడం, ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరమని మేధావులు ఈ చర్చలో సూచించారు.

  • ఎ. విద్యాసాగర్‌, ఖమ్మం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News