Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్water problem: అతి నిశ్శబ్దంగా తాగు నీటి సంక్షోభం

water problem: అతి నిశ్శబ్దంగా తాగు నీటి సంక్షోభం

ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలను చర్చించడమనేది సంప్రదాయానికి పార్లమెంట్‌ ఏనాడో స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాలలో కూడా శాసనసభలకు రాజకీయ సమస్యలు తప్ప సామాజిక సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని అర్థమవుతూనే ఉంది. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంత అధ్వాన స్థాయిలో ఉందో అంచనా వేయడం కూడా కష్టమే. రాజకీయాలనేవి ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా చేస్తున్నాయనిపిస్తోంది. పార్లమెంట్‌ ఉభయ సభలో, శాసనసభో సమావేశాలు ప్రారంభిస్తున్నాయంటే జనం తల తిప్పేయడమో, తమకేమీ పట్టనట్టు ఊర్కోవడమో జరుగుతోంది. చట్టసభల సభ్యులకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలు గానీ, చివరికి పార్గీ ప్రయోజనాలు కానీ ఏమాత్రం పట్టడం లేదనిపిస్తోంది. వేసవి కాల సమావేశాల్లో బడ్జెట్‌ వ్యవహారాలే ఎవరికీ పట్టడం లేదు. ఇక వేసవి కాలంలో ప్రజలు రకరకాలుగా పడుతున్న ఇబ్బందులు వారికేం పడతాయి? వర్షాకాల సమావేశాల్లో సైతం వాకౌట్లు, ధర్నాలు, అరుపులు, కేకలతో, స్తంభనలు, ప్రతిష్ఠంభనలతో కాలం గడిచిపోతోంది. ఇక వర్షాలు, తుపానులు, వరదల సంగతి ఎవరికి పట్టింది? శీతాకాల సమావేశాలనేవి పేరుకే కానీ, ప్రజల ఆరోగ్యాలు, అవసరాలతో వారికేమీ అవసరం లేదు.
ఇక అసలు విషయానికి వస్తే, భారతదేశవ్యాప్తంగా, ఆసేతు హిమాచలం, నీటి కొరతతో నానా అవస్థలూ పడే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నీటి కొరత లేక నీటి కరవు నిశ్శబ్దంగా, చాప కింద నీరులా వ్యాపించిపోతోంది. వర్షాభావ పరిస్థితులు ఒకపక్క, అడవుల నరికివేత మరొకపక్క, వాతావరణంలో మార్పులు మరొకపక్క దేశాన్ని నీటి సంక్షోభం వైపు వేగంగా తీసుకు వెడుతున్నాయి. నిజానికి అనేక సర్వే సంస్థలు ఈ నీటి కొరతకు సంబంధించి పూర్తి వివరాలతో అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా నివేదికలు అందజేస్తున్నా, ఆ నివేదికలను ప్రభుత్వాలు చూసిన పాపాన పోలేదు. ఈ నివేదికల ప్రకారం ఎల్‌నైనో ప్రభావం కారణంగా వర్షాకాలం అనేదే లేకుండా పోతోంది. ఒకప్పుడు మూడు నాలుగు నెలలున్న వర్షాకాలంఇప్పుడు నెల రోజుల కాలానికి తగ్గిపోయిందని నిపుణులు పదే పదే చెబుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవల విడుదలైన ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక (2023) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది పట్టణ ప్రజలు ఇప్పటికే తీవ్రమైన నీటి సంక్షోభంతో పడరాని పాట్లు పడుతున్నారు.“ఇందులో అత్యధికంగా అవస్థలు పడుతున్న దేశం భారతదేశమే.”
ప్రమాద ఘంటికలు
ఇప్పటికే అలారం గంటలు మోగడం ప్రారంభం అయింది. గత ఫిబ్రవరి నెలలో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేస్తూ, “వేసవి కాలం వచ్చిందంటే నీటి ధర బంగారం ధరతో సమానంగా పెరిగిపోతోంది” అని వ్యాఖ్యానించింది. ప్రపంచ జనాభాలో 18 శాతం జనాభా భారతదేశంలోనే ఉన్నప్పటికీ, దీని నీటి వనరుల విషయంలో మాత్రం భారత్‌కు అందుబాటులో ఉన్నది 4 శాతం నీరు మాత్రమే.ఇతర అన్ని దేశాలలో కంటే భారత్‌లోనే నీటి ఎద్దడి సంక్షోభ స్థితికి చేరుకుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. విచిత్రమేమింటే, పార్లమెంట్‌లో ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానంగా, ప్రస్తుతం 1436 ఘనపు మీటర్లు ఉన్న తలసరి నీటి వినియోగం 2031 నాటికి 1367 ఘనపు మీటర్లకు పడిపోవడం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం నీటికి సంబంధించినంత వరకూ దేశంలో నీటి పరిస్థితి ఎలా ఉందంటే, దేశంలోని మహానగరాలు, నగరాలు ఇప్పటి నుంచే దీర్ఘకాల నీటి వనరుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది. ముంబై నగరం టాన్సా, వైతరణ అనే రెండు ప్రాజెక్టుల మీద నీటికోసం ఆధారపడుతోంది. ఢిల్లీ నగరం ఉత్తర ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానాల మీద తన నీటి అవసరాలకు ఆధారపడుతోంది. తమిళనాడు పూర్తిగా తెలుగు గంగ ప్రాజెక్టు మీద ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ నీటి ప్రాజెక్టుల పరిస్థితి అధ్యానంగా మారుతోంది.
ఇదంతా ఇక్కడితో ఆగిపోలేదు. దేశంలోని నగరాలు, పట్టణాలన్నీ ప్యాకేజ్‌ నీరు, ట్యాంక్‌ నీళ్ల మీద ఆధారపడడం జరుగుతోంది. ముంబై నగరంలో సుమారు రెండు వేల ట్యాంకర్ల ద్వారా నగరవాసులకు నీటి సరఫరా జరుగుతుండగా, ఆ ట్యాంకర్ల ఆపరేటర్లు గత వారం అకస్మాత్తుగా సమ్మె ప్రారంభించారు. ఆ ఆపరేటర్లతో సమ్మెను విరమింపజేయడానికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తలకిందలయిపోయారు. ముంబైలో నీటి ట్యాంకుల ఆపరేటర్లు సమ్మె చేయడం కొత్తేమీ కాదు. నిజానికి దేశంలోని అనేక నగరాల్లో తరచూ ఈ ఆపరేటర్లు ఎక్కడో అక్కడ సమ్మె చేస్తూనే ఉండడం పరిపాటి. ఈ ట్యాంర్‌ వాటర్‌ సరఫరాదార్లు ఎక్కువగా భూగర్భ జల వనరుల మీద ఆధారపడుతుంటారు. నీటి వనరులకు సంబంధించి ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఒకటి ఒక నివేదిక విడుదల చేసింది. “గ్రామాల్లో 80 శాతం నీటిఅవసరాలను తీరుస్తున్నది భూగర్భ జలాలే.పట్టణాల్లో కూడా 50 శాతం ప్రజల నీటి అవసరాలు తీరుస్తున్నది, దాదాపు 75 శాతం సాగు అవసరాలను తీరుస్తున్నది భూగర్భ జల వనరులే” అని ఈ నివేదిక తెలిపింది.గత నాలుగైదు దశాబ్దాల కాలంలో 84 శాతం సాగునీటి అవసరాలకు భూగర్భ జల వనరుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. భావి తరాల వారికి ఆహారం, నీరు అందాలంటే భూగర్భ జలాలు సజావుగా ఉండాల్సిన అవసరం ఉంది.
శాస్త్రీయ దృక్పథం అవసరం
వాస్తవానికి, భారతదేశం తన భూగర్భ జల సంపదను కాపాడుకోవాలంటే, పంటల తీరుతెన్నులను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సుమారు 89 శాతం భూగర్భ జలాలను సాగు అవసరాలకు, మిగిలిన నీటిని గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించడం జరుగుతోందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది.అయితే, “ఉచిత విద్యుత్‌ సరఫరాతో పనిచేసే పంపులు దేశంలో రెండు కోట్లకు పైగా ఉండడం వల్ల ఎంతో నీరు వృధా కావడం, పూడికల కారణంగా కొంత నీరునష్టపోవడం, లీకేజీల వల్ల నీరు వృథాకావడం వంటివి జరుగుతూ నీటి కొరతను పెంచి పోషిస్తున్నాయి.” కొన్ని ప్రభుత్వ సంస్థలు చాలాకాలంగా నీటి నిల్వ పథకాలను, నీటి అభివృద్ధి పథకాలను అమలు చేస్తూనే ఉన్నాయి కానీ, వాటి వల్ల పెద్దగా ఫలితం ఉండడం లేదు. వాటిమీద సరైన పర్యవేక్షణ కూడా ఉండడం లేదు. చుక్క సేద్యం, బిందు సేద్యం, సూక్ష్మసేద్యం వంటి పథకాలను ఆర్భాటంగా ప్రవేశపెట్టారు కానీ, ఈ పథకాల కింద సాగవుతున్న భూమి 69.55 లక్షల హెక్టార్లకే పరిమితం అయిపోయింది.2023-24 సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 1.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు కానీ, భూ సంరక్షణ, నీటి సంరక్షణకు మాత్రం 36.60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది.
కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగం పూర్తిగా నీటి మీద ఆధారపడకుండా చేయవచ్చు. కానీ, వ్యవసాయ పరిశోధనలకు కేటాయించింది వ్యవసాయ జీడీపీలో 0.49 శాతం మాత్రమే. ఇక్కడ ఇంకో సమస్య కూడా తలెత్తుతోంది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని రూపొందించినా, ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా ఆరు విభాగాలను, అనేక కమిటిలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాయి తప్ప వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడానికి, శాస్త్రీయ పధ్ధతులను అమలు చేయడానికి సహకరించవు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయం, సామరస్యం సజావుగా ఏర్పడితే తప్ప వ్యవసాయ సంబంధిత పథకాలు ఒకపట్టాన అమలు జరిగే అవకాశం లేదు. ఇందుకు ఒక ఉదాహరణ, 2015లో కేంద్ర ప్రభుత్వం ‘ప్రతి ఎకరానికీ నీరు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టి, సుమారు 1,400 కోట్ల రూపాయలు కేటాయించింది కానీ, ఇప్పటికీ ఆ నిధులలో ఎక్కువ భాగం ఖర్చు కాలేదు. ఆ నిధులు వాడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ పథకాలను రూపొందించనే లేదు.
ఇక్కడ సమస్య వ్యవసాయ రంగానికి నీరు అందుతోందా లేదా అన్నది కాదు. భవిష్యత్తులో ఏర్పడబోయే నీటి కొరత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో నీటి వనరులు నాలుగు లక్షల కోట్ల ఘనపు మీటర్ల వరకూ ఉంటాయి. అయితే, వాటిని సద్వినియోగం చేసుకోగల అవకాశాలు మాత్రం చాలా తక్కువ. సుమారు 1869 ఘనపు మీటర్ల నీటిని వినియోగించుకోవడం కూడా కష్టమైపోతోంది.ఈ సమస్య మీద ఇప్పటి నుంచే దృష్టి పెడితే తప్ప రాబోయే నీటి సంక్షోభం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. – ఎస్‌. రామచంద్ర రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News