మణిపూర్ సమస్య మీద పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం సరైన చర్యగా అనిపించకపోవచ్చు కానీ, ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా చేయడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదని అవి చెబుతున్నాయి. ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు ఓడిపోవడం ఖాయమనడంలో సందేహం లేదు. ముందుగా మణిపూర్ సంక్షోభంపై కనీసం చర్చయినా జరగాలని అవి పట్టుబడుతున్నాయి. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం తాము దీనిపై చర్చించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని అవి ఆరోపిస్తున్నాయి. జాతీయ ప్రాధాన్యం కలిగిన ఈ సమస్యపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడానికే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటున్న ప్రతిపక్షాలు తాము స్వయంగా కూడా కొన్ని తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
నిజానికి, ఈ మధ్య కాలంలో పార్లమెంట్ వ్యవహారాలను స్తంభింపజేయడం ఒక నిత్యకృత్యమై పోయింది. 1952లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఏర్పడిన తర్వాత నుంచి ఇంతవరకూ ఇంత తక్కువగా లోక్ సభ సమావేశం కావడం జరగలేదు. సుమారు రెండు నెలలుగా మణిపూర్ సమస్య రగులుతోంది. ఇక్కడి జాతి సంబంధమైన హింసా విధ్వంసకాండలలో వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గృహ దహనాలు పేట్రేగిపోయాయి. మత సంబంధమైన ప్రదేశాలపై దాడులు కూడా జరుగుతున్నాయి. అక్కడ జనం కొందరు మహిళలను వివస్త్రలను చేయడం, ఆ తర్వాత అత్యాచారాలకు పాల్పడడం కూడా జరిగింది. సహజంగానే ఇది దేశ ప్రజల అంతరాత్మలను కదల్చి వేసింది. ఈ నేపథ్యంలో మణిపూర్ సమస్యపై ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన
ప్రకటన అయితే చేశారు కానీ, అది పార్లమెంట్ లో కాదు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన బయట ప్రకటన చేశారు.
మణిపూర్ సమస్య రోజురోజుకూ ముదిరిపోతోంది. అక్కడ రెండు ప్రధాన జాతి సంబంధిత వర్గాలైన మెయితీలు, కుకీల మధ్య అగాధం పెరుగుతోంది. ఇదివరకు ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని మాత్రమే కోరుతూ వస్తున్న అల్పసంఖ్యాక కుకీలు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోరడం ప్రారంభించారు. మణిపూర్ లోని కుకీలకు మిజోరంలోని మిజో గిరిజనులతోనూ, మయన్మార్ కు చెందిన చిన్స్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంగా మిజోరం ప్రజలు కూడా మణిపూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా కోరుతూ జరిగిన ఒక ప్రదర్శనలో మిజోరం ముఖ్యమంత్రి జోరంతాంగా కూడా పాల్గొనడం జరిగింది.
మణిపూర్ సంక్షోభం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొనడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ యూరోపియన్ పార్లమెంట్ ఒక తీర్మానం కూడా చేసింది. పార్లమెంట్ లో ఈ సమస్య మీద నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఏర్పడితే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పార్లమెంట్ అనేది చర్చలకు, అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షాలు, పాలక పక్షం హుందాగా, జవాబుదారీతనంగా వ్యవహరించి ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుక్కోవాల్సి ఉంటుంది. మణిపూర్ సమస్యపై చర్చించడానికి పాలక పక్షం అంగీకరించిన తర్వాత కూడా ప్రతిపక్షాలు గందరగోళం
సృష్టించడం భావ్యం కాదు. అదే విధంగా ఈ సమస్యను అత్యవసర సమస్యగా పరిగణించి వెంటనే చర్చకు చేపట్టకపోవడం పాలక పక్షం చేయాల్సిన పని కాదు.