నేటి ఆధునిక సమాజంలోని సమస్యల్లో ఒకటి పర్యావరణ సమస్య, దీని నుంచి అధిగమించడానికి ప్రభుత్వ అటవీశాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ తమ పరిధిలో సమాజ చైతన్యం కోసం పర్యావరణ పరిరక్షణ దిశగా వివిధ పనులు చేపట్టాయి, అందులో భాగంగానే ఈ మహా చైతన్య యజ్ఞంలో సాహితీవేత్తలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ముఖ్యంగా భావి పౌరుల్లో ఆచరణాత్మక చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో విద్యార్థులకు ప్రామాణిక అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఇంటర్ స్థాయి విద్యార్థులకు పర్యావరణ విద్యను పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. ఇందులో భాగంగానే బాల చెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ వ్యవస్థాపకులు, సంపాదకులు, మణికొండ వేద కుమార్ సంపాదకత్వంలో 2023 సం.లో పర్యావరణ సాహిత్యం ప్రాతిపదికగా తెలుగు బాల సాహిత్యంలో ప్రామాణికమైన కథా రచన జరిగింది, పెద్దలు పిల్లలు విడివిడిగా వ్రాసిన ఈ పర్యావరణ కథలు ఎంతో ఉపయుక్తంగా వుండటమేకాక పర్యావరణ ఉద్యమానికి ఎంతగానో సహకరించగలవు అనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే గాక తెలుగు మాట్లాడే ప్రాంతాలనుంచి కథలను పోటీ పేరున ఆహ్వానించి వచ్చిన అసంఖ్యాక కథల్లో పెద్దలు వ్రాసినవి 47 , పిల్లలు వ్రాసినవి 24 పర్యావరణ కథలు ఎంపిక చేసి విడివిడిగా రెండు పుస్తకాలు ప్రచురించారు, మొత్తం 71 కథల్లో కథా వస్తువు ఒకటే “పర్యావరణ రక్షణ”, కానీ కథలు చెప్పడంలో ఆయా రచయితల నేర్పు, ప్రతిభల కారణంగా కథలకు ఆసక్తి జతకూడి కడదాకా చదివిస్తాయి.
సాధారణంగా కథ చదివే పాఠకుడిని ఆకర్షించేవి వస్తువు, శైలి, ముగింపు, తెలిసిన విషయాన్ని వస్తువుగా తీసుకుని కథను ఆసక్తి కరంగా చదివించేటట్టుగ వ్రాయడం రచయితకు సాహసంతో కూడుకున్న పనే!!
అలాంటి కష్టమైన కథా రచనను ఇటు విద్యార్థి రచయితలు, అటు పెద్దవారైన రచయితలు ఎవరి స్థాయిలో వారు చేసి విజయం సాధించారు.
సంపాదకుని కథల ఎంపిక తీరు కూడా అంతే ప్రామాణికంగావుంది. ముందుగా భావి రచయితల కథా కృషి పరిశీలిద్దాం. ఈ 24మంది విద్యార్థి రచయితలు 9వ తరగతి నుంచి డిగ్రీ చదివే వారు, ఈ వయసులోనే పర్యావరణ పరిరక్షణ పట్ల వారు చూపిన బాధ్యత అభినందనీయం.
ఒక మారుమూల గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్ కొరత ను తీర్చడం కోసం రాజు అనే వ్యక్తి వ్యాపార దృష్టితో అక్కడ సెల్ టవర్ నిర్మించడం, తర్వాత దాని ద్వారా వచ్చే అనర్థాల వల్ల గ్రామస్తులు తిరుగుబాటు చేయడం, చివరికి హానిలేని అభివృద్ధి కావాలని అక్కడి వారు కోరుకోవడం ఇతి వృత్తంగా వ్రాసిన కథ “అందరికోసం” ,ఈ కథ ద్వారా ఆ భావిరచయిత ముందుచూపుఏమిటో అర్థం అవుతుంది,
స్వార్థంతో చెట్ల కలప వ్యాపారం చేసి చివరకు ఆ చెట్టు ద్వారానే ప్రమాదానికి గురై పశ్చాత్తాపంతో చెట్ల పరిరక్షణకు నడుం బిగించిన రామయ్య నేపథ్యంతో సాగిన “చెట్టు చెప్పిన పాఠం” కథ కూడా చక్కటి సందేశాన్ని ఇస్తుంది. ఇలా పిల్లలు రాసిన పర్యావరణ కథల్లో వాస్తవ దృక్పథం కనిపించి ఆలోచింపజేస్తాయి. కాల్పనిక భాణిలో ఉన్న ఏకైక కథ “చెట్టు మాట్లాడితే” ఇది కూడా వర్తమాన వైజ్ఞానిక దృక్పథంతో సాగటం విశేషం.
సితార, చెరువు, మార్పు, ఉద్యమం, తదితర కథలు, చక్కని పర్యావరణ సందేశాలతో ఆబాల గోపాలానికి పర్యావరణ చైతన్యం కలిగిస్తున్నాయి. ఈ కథల్లో మరో విశేషం కొందరు విద్యార్థులు అధ్యయన పరంగా ఆంగ్లమాధ్యమంలో చదువుతూనే అమ్మభాషలో చక్కని సృజనాత్మక కథలు అందునా ఎంపిక చేసిన వస్తువుని అందంగా ఆసక్తిగా చెప్పడం, ఇక రెండవ విభాగం “పెద్దలు రాసిన పర్యావరణ పిల్లల కథలు” ఇవి కూడా ఎంపిక చేయబడిన 47 ఉత్తమ కథలు, రచయితలంతా ప్రస్తుతం విరివిగా పిల్లల కథలు రాస్తున్న బాల సాహితీవేత్తలే!!
పిల్లల కథలు అంటే కాల్పునిక కథలు, అద్భుత రస ప్రధానంగా.. జంతువులు పక్షులే ప్రధాన పాత్రలుగా సాగేవి అనే మూస ప్రాచీన ధోరణికి సంపాదకులు ఈ కథల ఎంపికలో చరమగీతం పాడటం అభినందించదగ్గ విషయం. రచయితలంతా లబ్ద ప్రతిష్టలైన వారు కావడం వల్ల, పర్యావరణ సంరక్షణ కథా వస్తువును పరిపరి విధాల తమదైన అందమైన శైలుల్లో కథలు వ్రాసి తెలుగు బాల సాహిత్యం హుందాతనం కాపాడారు. ప్రాచీన విషయాలను సైతం వర్తమాన విధానంకు అన్వయించి చెప్పడంలో ప్రతి రచయిత శత శాతం విజయం సాధించారు.
“ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది” అన్న ఆర్యోక్తిని ఆసరాగా తీసుకొని. “ప్రకృతిని మీరు కాపాడితే దైవం మిమ్మల్ని కాపాడుతుంది” అనే ఆధునిక ఇతివృత్తంతో సాగిన కథ “అసలైన దైవకార్యం” శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లిన పిల్లలు అక్కడి భక్తుల్లో పర్యావరణ చైతన్య కలిగించడం ఇందులోని ఇతివృతం, కథ ఆసాంతం అభినయ సంభాషణ శిల్పంతో సాగింది, పూర్తి ఆధునిక సమాజానికి అద్దంపట్టే ఈ కథ బావి ఆధునిక బాల సాహిత్యానికి దారులు వేసేదిగా ఉంది.
నేటితరం పిల్లల ఆలోచనలకు అద్దం పట్టేలా ప్రారంభమై చివరకు ఆలోచింపచేసే ముగింపుతో కథకు నూతనత్వం అందించిన ఎంచక్కని కథ “ఆకుపచ్చ వనం”, పాఠశాలలో నిర్వహించబోయే హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడక, మొక్కలు నాటటమే దండగ అని భావించిన రాము, అనే విద్యార్థి ఆలోచనల్లో మార్పుకు శ్రీకారం చుట్టిన ఆ పాఠశాల పూర్వ విద్యార్థి పాత్ర ద్వారా అందమైన ముగింపు చెప్పడం ఈ కథకే హైలెట్.
“స్టీల్ బ్యాంక్” అనే ఆసక్తిదాయకమైన శీర్షికతో పాటు సుదీర్ఘ ఆలోచనతో ముందుకు సాగిన ఈ కథ ప్లాస్టిక్ పై సంపూర్ణ విముఖత చాటుతుంది. చిన్నారులకు పర్యావరణ ఆవశ్యకత తెలిపే కథ “మన పరిధిలో”, కీర్తి అనే అమ్మాయి పండగ సెలవులకు అమ్మమ్మ గారి ఊరికి వెళ్లి అక్కడి వాతావరణానికి ఆకర్షితురాలై పర్యావరణ స్పృహ పెంచుకోవడం ఇతివృతంగా ఈ కథ సాగుతుంది.
పిల్లల సహజ అల్లరితత్వంతో చేసే అల్లరి పనుల వల్ల మూగజీవాలకు ఎటువంటి కష్టాలు నష్టాలు వస్తాయో చెప్పిన కథ “చిన్ను బన్ను” మన సౌఖ్యం కోసం అలవాటు పడిగిస్తున్న ప్లాస్టిక్ వల్ల జంతువులకు ఎంతటి అపాయం కలుగుతుందో కళ్ళకు కట్టిన కథ “ఆవుకు వచ్చిన బాధ”, ఇదే కోవకు చెందిన ప్లాస్టిక్ శత్రువు మనకు మిత్రువు, మితంతోనే ఎలాంటి వాతావరణమైన సమతుల్యంతో ఉంటుంది అనే చక్కటి పర్యావరణ సూత్రాలను చెబుతాయి ఇందులోని కథలు, సంకెళ్లు, లేటెస్ట్ గిఫ్ట్, ఆడపిల్లల చెట్టు, ఇలా విభిన్న శీర్షికలతో ఆసక్తిగా ఆకర్షిస్తూ అలరించే అందమైన కథలు ఎన్నో ఇందులో మనం చదవవచ్చు. నేటి ఆధునిక బాల సాహిత్యానికి అవసరమైన ఈ కథలు సమాజానికి పర్యావరణ చైతన్యం అందించడంతో పాటు బాల సాహిత్యానికి సరికొత్త కధలను అందించడంలో అటు రచయితలు ఇటు సంపాదకులు నిజమైన లక్ష్యం సాధించారు అనడంలో అక్షర సత్యం ఉంది.
డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్:7729883223.