తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరలపై ఉదయ నిధి, పవన్ కల్యాణ్‌లు ఉదయించడంతో ఈ రాష్ట్రాల రాజ కీయాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఒక విధంగా చూస్తే ఈ రెండు రాష్ట్రాల్లో చరిత్ర పునరావృతం అవుతోంది. 1980లలో ఇద్దరు వెండితెర ఇలవేల్పులు – ఎం.జి. రామ చంద్రన్, ఎన్.టి. రామారావు – ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా, దేశ రాజకీయాలను కూడా తమదైన శైలిలో ప్రభావితం చేశారు. రాజకీయ తెర మీద కూడా ఒక వెలుగు వెలగాలనుకుంటున్న నటీనటులకు ఈ ఇద్దరు నాయకులే కాక, నటి జయలలిత కూడా ఇప్పటికీ, ఎప్పటికీ మార్గదర్శకంగా స్థిర పడ్డారు. నాలుగు దశాబ్దాలు గడిచేసరికి, మరో ఇద్దరు వెండితెర తారలు – ఎం.కె. ఉదయనిధి, కె. పవన్ కల్యాణ్ – తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలగడం ప్రారంభించారు. ఈ ఇద్దరు యువ హీరోలు ఇప్పుడు తమ తమ రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు. ఇందులో ఉదయ నిధి స్టాలిన్ వయసు 46 కాగా, పవన్ కల్యాణ్ వయసు 53 సంవత్సరాలు. తమ తమ పార్టీల మీదే కాకుండా రాష్ట్ర రాజకీయాల మీద కూడా వీరు చెరగని ముద్ర వేస్తున్న లక్షణాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
ఈ ఇద్దరు యువ నాయకులకు సంబంధించినంత వరకూ 2024 సంవత్సరం వారి రాజకీయ జీవితాలను కీలక మలుపు తిప్పింది. తమిళనాడులో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉదయనిధి కారణంగా ఆయన పార్టీ డి.ఎం.కె ఘన విజయం సాధించి మొత్తం సీట్లను చేజిక్కిం చుకుంది. ఆయన కృషికి కృతజ్ఞతగా ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. అదే విధంగా పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఎన్.డి.ఎలో భాగంగా తాము పోటీ చేసిన రెండు లోక్ సభ స్థానా ల్లోనూ, 21 శాసనసభ స్థానాల్లోనూ ఘన విజయాలు సాధించింది. 2023లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా గట్టి మద్దతుగా నిలబడినందుకు పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించడం జరిగింది. నిజానికి ఇక్కడితో వీరిద్దరి మధ్యా పోలికలు ఆగిపోయే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఉదయనిధి వంటి వ్యక్తి కాదు. ఉదయనిధి రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. తాత ఎం. కరుణానిధి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. తండ్రి ఎం.కె. స్టాలిన్ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుటుంబ సారథ్యం లోని డి.ఎం.కె 1969లోనే ఏర్పడి గట్టి పునాదులతో నిలబడి ఉండడమే కాకుండా, అక్కడి ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. తమిళనాడు సినీ రంగంలో రచయితగా ఒక వెలుగు వెలిగిన కరుణానిధి వేసిన పునాదులు ఉదయనిధి భవిష్యత్తుకు తిరుగులేని భరోసానిస్తాయి.
సరికొత్త యువ రక్తం
పవన్ కల్యాణ్ ఏ రంగంలో ఉన్నా స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. రాజకీయాలు బొత్తిగా తెలియని స్థితిలో ఆయన ప్రజా సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు. సినిమా రంగంలో హీరోగా ఉన్నంత కాలం ఆయన తనదైన శైలిలో జనాలను ఆకట్టుకున్నారు. అక్కడ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సినీ రంగంలో తన సోదరుడు చిరంజీవి సహాయ సహకారాలు కూడా లభించినప్పటికీ, ప్రధానంగా ఆయన తనకంటూ ఒక విలక్షణ శైలిని, సంభాషణా చాతుర్యాన్ని అలవరచుకున్నారు. ఎన్టీఆర్ మాదిరిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేయాలని 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని ప్రారంభించిన చిరంజీవికి పవన్ కల్యాణ్ చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే, అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడంతో చిరంజీవి తిరిగి సినిమా రంగానికి వచ్చేయడంతో పవన్ రాజకీయ అరంగేట్రం అక్కడితో ఆగిపోయింది. చిరంజీవిని చూసిన అనుభవంతో పవన్ కల్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తూ 2014కి ముందుగానే పార్టీని పెట్టినప్పటికీ, ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా, 2019 ఎన్నికల్లో పోటీ చేసి, కొద్దిగా ఆశాభంగం చెంది, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా దూసుకుపోయారు.
అనేక ఎదురు దాడులు, దాడులు, త్యాగాల తర్వాత ఆయన ఘన విజయాలను కూడగట్టుకోగలి గారు, ఉప ముఖ్యమంత్రి పదవిని సంపాదించుకోగలిగారు. రాజకీయాల్లో ఆయన ఒక స్థాయికి రావడమనేది ఊరికే జరగలేదు. ఉదయనిధి ఇండీ కూటమిలో భాగం కాగా, పవన్ కల్యాణ్ బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ కూటమిని దృఢంగా అంటిపెట్టుకుని ఉన్నారు. సనాతన ధర్మం విషయంలో కూడా ఈ ఇద్దరు యువ నాయకులవి భిన్న మనస్తత్వాలు. ఉదయనిధి సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకి కాగా, పవన్ కల్యాణ్ సనాతన ధర్మానికి తిరుగులేని అభిమాని. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, దాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని గతంలో ఉదయనిధి పిలుపునివ్వడం జరిగింది. దానిపై తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన వెనుకడుగు వేయడం జరిగింది. కాగా, తిరుమల లడ్డూ వివాదం తెర మీదకు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. హిందూ మతాన్ని కాపాడుకోవడానికి, హిందూ ఆలయాల ఆస్తులను పరిరక్షించడానికి జాతీయ స్థాయిలో హిందూ సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక, సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, కార్తీ వంటి సహ నటులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
భిన్న మనస్తత్వాలు
ఇక ప్రచారాలు, ప్రసంగాల విషయంలో కూడా ఎవరి శైలి వారిది. పవన్ ది దూకుడుతత్వం. అగ్గి బరాటా లాంటి ఆయన ప్రసంగాలు ఆయన యువ అభిమానులనే కాక అన్ని వర్గాల ప్రజలను ఉద్వేగభరితం చేస్తాయి. ఉడుకెత్తేటట్టు, ఉరకలు వేసేటట్టు చేస్తాయి. ఉదయనిధి బహిరంగ సభల్లో కూడా ప్రతి వ్యక్తికీ నచ్చచెబుతున్నట్టు, బతిమాలుతున్నట్టు ప్రసంగించడం జరుగుతుంటుంది. పవన్ ప్రసంగాల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయనిధి ప్రసంగాల్లో చమత్కారం, సరస సంభాషణలు, హాస్యం మిళితమై ఉంటాయి. విభిన్న కారణాలతోనే అయినప్పటికీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ప్రజలు సన్నిహితంగా, నిశితంగా గమనించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు ఉదయనిధి వారసుడని అధికారికంగా తేలిపోవడంతో, 2026 ఎన్నికల్లో డి.ఎం.కె విజయ బాధ్యతలు ఉదయనిధి మీద పడినట్టయింది. ఈ ఎన్నికల్లో అన్నా డి.ఎం.కె, బీజేపీలతో పాటు నటుడు విజయ్ ప్రారంభించబోతున్న పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయ రంగం క్రమంగా వెండితెర ప్రముఖులతో నిండిపోతున్నట్టు కనిపిస్తోంది.
తిరుమల వివాదంతో పవన్ కల్యాణ్ జీవితం రాజకీయంగా కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. సనాతన ధర్మానికి గట్టి మద్దతుదారుగా గుర్తింపు రావడంతో భవిష్యత్తులో బీజేపీ పవన్ కల్యాణ్ తో మరింత ఎక్కువగా, దృఢంగా చేతులు కలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తర్వాత రెండవ స్థానంలో జనసేన నిలబడడానికి పార్టీ కార్యకర్తలు ఎక్కువ కాలం పాటు అంగీకరించకపోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ను ఒక జంఝామారుతంగా అభివర్ణించడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన పవన్ కల్యాణ్ ఆ మాటకు తగ్గట్టుగా రాజకీయ జంఝామారుతంగా ఎదిగే అవకాశం ఉంది. ఉదయనిధికి తండ్రి మద్దతు, పార్టీ మద్దతు పుష్కలంగా ఉంది. అయితే, పవన్ కల్యాణ్ కు తన సోదరులు చిరంజీవి, నాగబాబుల మద్దతు తప్ప కుటుంబపరంగా మరో విధమైన అండదండలు లభించే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు జనసేన పార్టీగా చిరంజీవి భారీగా నిధులు విరాళంగా ఇచ్చారు. కాగా, నాగబాబు మొదటి నుంచి పవన్ కల్యాణ్ వెంటే నడుస్తున్నారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల హవాకు తిరుగుండకపోవచ్చు. రాబోయే తరం నాయకులు వీరే కావచ్చు.
- జి. రాజశుక