మార్చి 28న ‘‘తెలుగుప్రభ’’లో డాక్టర్ విజయ్ కుమార్ , రామతోటి మురళిలు ‘‘బహుజన రాజ్యాధికారం దిశగా జనసేన!’’ పేరిట రాసిన వ్యాసంలో పవన్ కల్యాణ్ రాజకీయ లక్ష్యాన్ని విశ్లేషిస్తూ, ‘‘పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం, ఆయన రాజకీయ లక్ష్యాల మధ్య ఉన్న సామాజిక, రాజకీయ వైరుధ్యాన్ని బడుగు బలహీన వర్గాలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి’’ అని రాశారు. ఆయన వ్యూహాలు పెరియార్, రాం మనోహర్ లోహియా, కాన్షిరాం, ఇటాలియన్ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసీల ఆలోచనా ధోరణులను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఇది వారు మాత్రమే కాక, పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాలలో తన రాజకీయ ప్రస్థానానికి ప్రేరణగా చెగువేరా, తరిమెళ్ళ నాగిరెడ్డిలతో పాటు బహుజన తత్వాన్ని ఉదహరించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే ‘‘గమ్యం మార్గాలను సమర్థిస్తుంది’’ అనే మాకియవెల్లి సిద్ధాంతాన్ని రాజకీయంగా అనుసరించడం దేశంలో అన్ని ప్రధాన పార్టీల లక్షణంగా ఉన్నప్పటికీ, జనసేన కూడా దీనికి మినహాయింపు కాదని వ్యాసకర్తలు పేర్కొన్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ మార్గం, బహుజనుల రాజ్యాధికారమే గమ్యంగా ఉన్నదని వారు అభిప్రాయపడినట్టు వ్యాసం స్పష్టం చేస్తుంది. అయితే డా. బీఆర్ అంబేడ్కర్ ప్రకారం, ‘‘మార్గాలు’’ స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం, న్యాయం అనే మూల సూత్రాలపై ఆధారపడాలి. అయితే ఇక్కడి వ్యాసకర్తలు ఈ అంశాన్ని మరిచిపోయినట్లున్నా
నిజానికి నాయకుడి భావజాలాన్ని అర్థం చేసుకోవాలంటే, కేవలం మాటలు, పార్టీ ప్రణాళికలు మాత్రమే కాకుండా ఆయన కార్యాచరణ కూడా పరిశీలనకు లోనవ్వాలి. ఈ కోణంలో చూస్తే పవన్ కల్యాణ్ మాటల్లోనో, చేతల్లోనో ఆయన పదే పదే చెప్పే సిద్ధాంతాలకు ఎక్కడా పొంతన ఉండదు. మేధావి తత్వవేత్తల పేర్లు జాబితాగా ప్రస్తావించడం (నేమ్ డ్రాపింగ్) కాకుండా, ఆ భావజాలాన్ని కార్యరూపంలో ఆచరించాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కల్యాణ్ వ్యవహారంలో ఎప్పుడూ కూడా అటువంటి ఆచరణ ఉండదు. ఆచరించకపోగా దానికి వ్యతిరేఖంగా ఆయన మాటలు, కార్యాచరణ కనిపిస్తుంది. కేవలం తత్వవేత్తల పేర్లు ప్రస్తావించడం దగ్గరే జనసేన ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో అసలు బహుజన రాజ్యాధికారం అనే భావన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. బహుజన రాజ్యాధికార ఉద్యమం అనేది కుల వివక్ష, అంటరానితనం, ఆర్థిక దోపిడీ వంటి అసమానతలకు వ్యతిరేకంగా పుట్టినది. కులం ఆధారంగా ఏర్పడిన ఈ అసమానతలను అధిగమించాలంటే అణగారిన కులాలు ఐక్యంగా సంఘటితమై, రాజకీయ నిర్లక్ష్యాన్ని, సాంస్కృతిక అణచివేతను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దళిత, బహుజన ఉద్యమం రూపుదిద్దుకుంది. ఫూలే, అంబేడ్కర్, పెరియార్, కాన్షిరాం వంటి తత్వవేత్తల ఆలోచనా విధానాలతోనే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన సమాజ్ పార్టీ వంటి రాజకీయ పక్షాలు ఏర్పడ్డాయి. ఈ పార్టీలు ఆధిపత్య వర్గాల ప్రలోభాలకు లోనుకాకుండా, కౌంటర్ హెజీమొనీ నిర్మించాయి. వీటి రాజకీయాల్లో నాయకత్వం కూడా ఆయా అణగారిన కులాల నుంచే రావాలన్నది మౌలిక సూత్రంగా ఉంది.
అంటే ఇక్కడ మనం జనసేనకు బహుజన రాజ్యాధికారంతో ఉన్న సంబంధాన్ని విశ్లేషించాల్సి వస్తే గత ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీతో జనసేన ఏర్పరిచిన సంబంధాన్ని పవన్ ఇంకా కొనసాగిస్తున్నాడనే భావన తప్ప వ్యాసకర్తలు పేర్కొన్న మిగతా అంశాలతో ఏ రకమైన సంబంధం ఉండదు. బహుజన రాజకీయాల ప్రస్థానం గురించి చూస్తే, 80వ దశకం వరకు కుల సమీకరణాలపై పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, కాన్షిరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలను సమీకరిస్తూ ఉత్తరప్రదేశ్‌లాంటి అత్యంత పెద్ద రాష్ట్రంలో అధికారాన్ని సాధించగలిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రాధాన్యం పెరిగింది. ఈ కోణంలో జనసేనను బహుజన రాజకీయాలలో భాగంగా చూడలేం.
అలాగే రచయితలు జనసేన లోహియా, పెరియార్ వంటి నాయకుల స్ఫూర్తితో రాజకీయాలు చేస్తుంది అని కూడా రాశారు. ముందుగా వారు బహుజన రాజకీయాలకు, లోహియ సోషలిస్ట్ రాజకీయాలకు ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. లోహియ స్పూర్తితో వచ్చిన సోషలిస్ట్ రాజకీయాలు బహుజన రాజకీయాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఉత్తర భారతంలోని సోషలిస్ట్ రాజకీయాలు, పెరియార్ ప్రభావంతో తమిళనాడులో స్థిరపడిన ద్రవిడ రాజకీయాలు ప్రధానంగా దళితేతర, బ్రాహ్మణేతర కుల గుర్తింపు రాజకీయాలుగా అభివృద్ధి చెందాయి. కుల గుర్తింపు రాజకీయాలు అనేవి దళిత, బహుజన రాజకీయాల్లా కాకుండా, ఆయా కులాల స్వంత ప్రాధాన్యత కోసం జరిగిన ఉద్యమ రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. ఈ సోషలిస్ట్ ఉద్యమాల ప్రభావంతో ఏర్పడిన సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు కూడా యాదవ్ ముస్లిం స్ట్రాటజీల ద్వారా ఉత్తర భారత రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించాయి. ఓబీసీలు.. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు కలిసి ఈ పార్టీలకు బలమైన ఓటు బ్యాంకును అందించారు. కులం, మతం రెండు కలిపి ఉన్న ఈ వ్యూహాలు వీటికి విజయాన్ని అందించాయి. దీంతో, కుల గుర్తింపు రాజకీయాలను, బహుజన రాజకీయాలను ఒకే రకంగా చూడడం సాధ్యం కాదు.
జనసేన విషయంలో అటు బహుజన రాజ కీయ వాదం కాని, సోషలిస్ట్ కుల గుర్తింపు ఉద్యమంలాంటి పరిస్థితి కాని ఎక్కడ కనపడదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా కుల ఆధారంతో కూడిన ఆర్థిక ఆసక్తితో రూపుదిద్దుకున్నవే. అదే విధంగా జనసేన ఏర్పాటులో కూడా ఆర్థి కంగా, సామాజి కంగా ఆధిపత్యం కలిగిన కాపు సామాజిక వర్గం ప్రధానంగా నిలబ డింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కాపులు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ, వారు రాష్ట్రవ్యా ప్తంగా సంఘటిత కులంగా కనిపించరు. కానీ, కమ్మ, రెడ్డి వర్గాలతో సమా నంగా ఉన్న తమ సామాజికఆర్థిక స్థితిని రాజ్యా ధికారంతో సమాంతరంగా నెరవేర్చు కో వాలనే ఆశయం కాపు సామజిక వర్గంలో బలంగా ఉండేది. అదే ప్రజారాజ్యం, జన సేన లాంటి కాపు పార్టీలకు పునాది వేసింది. కానీ జనసేన ఎప్పుడు కూడా వివిధ వర్గాల కులాల సమీకరణ దిశగా దృష్టి సారించలేదు. ఇందుకు కారణం, ఆయా ప్రాంతాల్లో కాపుల సామాజిక, ఆర్థిక ఆధిపత్యం ఒక కారణం కాగా పార్టీకి ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం లేకుండా, ఎన్నికల నుంచి ఎన్నికల వరకు కూట ములు మారిన వైఖరి, అలాగే అతివాద హిందుత్వ అజెండాకు మద్దతు తెలపడం మరో కారణంగా చెప్పవచ్చు. దీని వల్ల జనసేన పార్టీ దళితులలో గాని, ముస్లిం లలో గాని మద్దతును సంపాదించలేకపో యింది. గత ఎన్నికలలో కాపుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లోనే తమ అభ్యర్థులను నిల బెట్టడం ద్వారా కూడా ఈ విషయం స్పష్టమవుతోంది.
అలాగే రచయితలు మరో సందర్భంలో ఇటాలియన్ తత్వవేత్త గ్రాంసీ సూత్రీకరణకు దగ్గరగా జనసేన రాజకీయాలున్నాయని కూడా ఉదాహరించారు. వాస్తవానికి గ్రాంసీ భావజాలం ప్రకారం, ఉపశ్రేణుల (సబాల్టర్న్) నాయకత్వం వహించే వర్గం, తన వర్గ ప్రయోజనాలను మాత్రమే కాక, ఐక్య సంఘటనలో ఉన్న అన్ని వర్గాల ఆకాంక్షలను కూడా తన ఆకాంక్షలుగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తన వర్గ ప్రయోజనాలను కొంత మేరకు త్యాగం చేయాలి. కానీ జనసేన పార్టీ వ్యవహారాన్ని గమనిస్తే, ఇది పూర్తిగా కాపు ఆధిపత్య రాజకీయాలుగా మారిపోవడం వల్ల పార్టీని రాష్ట్ర స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం లేకుండా పోయింది. గ్రాంసీ చెప్పినట్టు, పాలక వర్గాల ఆధిపత్యానికి సంక్షోభం వచ్చినప్పుడు, వారు ఉపశ్రేణులలోని కొంతమంది వ్యక్తులను వ్యూహాత్మకంగా తమ వైపు తిప్పుకొని, కొన్ని డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ఆధిపత్యాన్ని నిలుపుకుంటారు. అదే తీరుగా జనసేన కూడా అప్పటికప్పుడు ఏర్పడే రాజకీయ అవసరాలకు తగ్గట్టు కొన్ని ఉపశ్రేణులను ముఖ్యంగా దళితులను ఆకర్షించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ వ్యాసకర్తలు చెప్పినట్లు కింది కులాలకు పార్టీలో అవకాశం ఇచ్చారనేది ఒక టోకెన్ రిప్రజెంటేషన్ గానే చూడాలి. అంతే కాని దీని వల్ల రాష్ట్ర రాజకీయాలలో దీర్ఘకాలికంగా బహుజన ప్రత్యామ్నాయం సాధ్యం కాదు.
ఈ నేపథ్యంలో జనసేన తన రాజకీయ ప్రయాణాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. జనసేన వ్యూహం దానిని బహుజన పార్టీగా నిలిపే అవకాశం లేదు, ఎందుకంటే అది హిందుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది, ఇది బహుజన సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. బహుజన సిద్ధాంతం పురోగామిగా ఉండి కుల వ్యత్యాసాలను ప్రశ్నిస్తే, హిందుత్వ వాటిని ఇంకా బలపరుస్తుంది, ఇవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. రాష్ట్రంలోని పెట్టుబడిదారీ రాజకీయ పార్టీలలాగా కాకుండా, ప్రజల ఆకాంక్షలకు తగ్గ రాజకీయ పునాది ఏర్పరుచుకొని, ప్రగతిశీల తత్వాలను ముందుకు తీసుకువెళ్లి మిగతా ప్రాంతీయ పార్టీలకు ధీటుగా అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తే కనీసం ఇది ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీగా ప్రయాణించగలదు. లేకపోతే ఇది ఎప్పటికీ ఉప ప్రాంతీయ కాపులకే పరిమితమై, కాపు పార్టీగానే మిగిలిపోతుంది.
– కత్తి అనిల్ కుమార్, చిన్న రంగయ్య దండు రీసెర్చ్ స్కాలర్స్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.