పోడు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అటవీ ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు సంబంధించిన దస్తావేజులను లక్షన్నర మందికి పైగా గిరిజనులకుపంపిణీ చేయదలచుకుంది. అనేక దశాబ్దాలుగా గిరిజనులు, గిరిజనేతరులు ఒక భూమి నుంచి మరో భూమికి సీజనుకు తగ్గట్టుగా పంటలను మారుస్తూ ఉండడం జరుగుతోంది. సుమారు 12 లక్షల ఎకరాల అటవీ భూమికి సంబంధించి ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల మంది నుంచి క్లెయిములు స్వీకరించడం జరిగింది.ఏ స్థాయిలో అటవీ ప్రాంతం విధ్వంసం అయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇది చాలా సున్నితమైన సమస్య. న్యాయాన్యాయాలను పక్కనపెడితే, లక్షలాది కుటుంబాలు అటవీ ప్రాంత వ్యవసాయంమీద ఆధారపడి బతుకుతున్నారు.
పోడు భూములపై గిరిజనులకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన మొదటి హయాంలోనే వాగ్దానం చేశారు. అనేక కారణాల వల్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం జరగలేదు. 2006 నాటి షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయిక అటవీ ప్రాంత నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం ప్రకారం, 2005 డిసెంబర్ 13 నాటికి ముందు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే చట్టబద్ధమైన హక్కులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారమే గిరిజనులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ కటాఫ్ తేదీకంటే ముందు పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారికి భూమిపై హక్కులుకల్పించదలచుకున్న పక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. మిగిలిన అనధీకృత సాగు భూమిని చట్టబద్ధం చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వంవాగ్దానం చేయడం గానీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం గానీ సాధ్యం కాదు. వాతావరణ మార్పులతో ఇప్పటికే అవస్థలు పడుతున్న కేంద్రం పోడు భూములు, అటవీ భూముల విషయంలో చట్టాలను మార్చి, తేనెటీగల తుట్టెను కదల్చే అవకాశం లేదు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఈ సమయంలో ముఖ్యమంత్రి ఇటువంటినిర్ణయం తీసుకోవడంలో గల అంతరార్థాన్ని, పరమార్థాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. గిరిజనులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడం వంటి ప్రాధాన్యాలు కూడా పాలకపక్షం ముందున్నాయి. ఇక ఈ భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం చాలా కాలంగా హరితహారం పథకం కింద రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. దేశంలోని అటవీ ప్రాంతాల స్థితిగతులకు సంబంధించిన నివేదిక ప్రకారం తెలంగాణలో అటవీ భూముల విస్తారం క్రమంగా పెరుగుతోంది. 2015లో 19,854 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ భూమి విస్తీర్ణం 2021 నాటికి 21,234 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అయితే, విషాదమేమిటంటే, కవాల్ పులుల అభయారణ్య ప్రాంత విస్తీర్ణం అయిదు శాతం తగ్గింది.
ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం, అటవీ ప్రాంతాలు ఏటా 7,600 కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాలను విధ్వంసం చేయడం గానీ, అటవీ భూముల విస్తీర్ణాన్ని తగ్గించడం గానీ పర్యావరణం రీత్యా సమంజసమైన వ్యవహారం కాదని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, అడవులో బతుకుతున్న జంతువులు, పక్షులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనాధారాన్ని చూపించడం మంచిది. అంతేకాక, ఇతర ప్రాంతాల నుంచి జనం వలస వచ్చి అటవీ ప్రాంతాలను ఆక్రమించుకోవడాన్ని ఏదో విధంగా నివారించాలి.