గత వారం దేశంలో కనీ వినీ ఎరుగని సంఘటన జరిగింది. కొంత మంది కుస్తీ వీరులు ఢిల్లీ నడిబొడ్డున అకస్మాత్తుగా బైఠాయింపు జరిపారు. ఈ బైఠాయింపులో పురుషులే కాక, మహిళా కుస్తీ వీరులు కూడా పాల్గొనడం విశేషం. జంతర్ మంతర్ ప్రాంతంలో జరిగిన ఈ బైఠాయింపు కార్యక్రమంలో వినేశ్ పోగత్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా వంటి కుస్తీ ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా భారత కుస్తీ సమాఖ్య (డబ్ల్యు.ఎఫ్.ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. తనను బ్రిజ్ భూషణ్ చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని, ఒక దశలో తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని వినేశ్ పోగత్ ఆరోపించారు. తమ సమాఖ్యలో అధ్వాన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా కూడా ఆరోపించారు.
కాగా, సహజంగానే ఈ ఆరోపణలను సమాఖ్య అధికారులు తీవ్రంగా ఖండించారు. తమ సమాఖ్యలో అటువంటివేవీ జరగడం లేదని, ఇదంతా హర్యానాకు చెందిన వారు చేస్తున్న దుష్ప్రచారమని వారు వ్యాఖ్యానించారు. త్వరలో ఈ సమాఖ్యకు ఎన్నికలు జరగబోతున్నందువల్ల అధ్యక్షుడిని అప్రతిష్ఠపాలు చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి లేని పోని ఆరోపణలు చేస్తున్నారని కూడా వారు ధ్వజమెత్తారు. ఈ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ టికెట్‌పై ఉత్తర ప్రదేశ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయన కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై లేనిపోని నిందలు వేస్తు న్నారని, తానెన్నడూ ఈ మహిళల జోలికి పోలేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే, ఈ కుస్తీవీరులు మాత్రం మరొక రోజు కూడా బైఠాయింపును కొనసాగించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలుసుకుని ఒక వినతి పత్రం కూడా అందజేశారు.
ఈ ఆరోపణలు, ఖండనలు, తిరస్కరణలు ఎలా ఉన్నప్పటికీ, ఈ సంఘటనతో దేశంలోని క్రీడా సంస్థల తీరుతెన్నులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఈ విధంగా జరగడం ఏ కొన్ని సంస్థలకో పరిమితం కాకుండా క్రీడా సంస్థలకు కూడా విస్తరిస్తోంది. పల్లెటూళ్ల నుంచి ఇక్కడికి క్రీడలలో శిక్షణకు వచ్చే యువతులకు కోచ్ నుంచో, క్రీడా సంస్థల అధికారుల నుంచో వేధింపులు ఎదురవుతూనే ఉన్నట్టు గతంలో కూడా అనేక వార్తలు వెలుగు చూశాయి. నిజానికి, ఈ శిక్షణ సంస్థల్లో కోచ్‌కు లేదా అధికారికి, శిక్షణ పొందేవారికి మధ్య నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం కనుక సడలిపోతే మహిళల్లో భయాందోళనలు చోటుచేసుకోవడం సహజం.
కోచ్, క్రీడాకారులకు మధ్య ఆదర్శవంతమైన అనుబంధం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అనేక శిక్షణ సంస్థల్లో వేధింపుల పర్వమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇందుకు సంబంధించిన కథనాలు ఎక్కువగానే వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి విషయాల్లో మహిళా క్రీడాకారులు మౌనంగా ఉండిపోవడమే జరుగుతుంటుంది. అయితే, ఈసారి మహిళా కుస్తీ వీరులు నోరు విప్పడం, పోరాటానికి దిగడం మెచ్చుకోదగిన విషయం. ప్రస్తుత వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, దీనిపై జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఒక అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్‌ను అధిపతిగా నియమించారు. నిష్పాక్షికంగా నిజాలను తేల్చాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. బ్రిజ్ భూషణ్ పాలకపక్ష సభ్యుడైనప్పటికీ ప్రభుత్వం ఉపేక్షించలేదు. ఆయనను సమాఖ్య రోజువారీ బాధ్యతల నుంచి కూడా తప్పించడం జరిగింది. దేశంలో అనేక క్రీడా సంస్థలకు, సమాఖ్యలకు రాజకీయ నాయకులే అధిపతులుగా ఉండడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. దాదాపు పార్టీలన్నీ ఇటువంటి పద్ధతినే అనుసరిస్తున్నాయి.
దేశంలో క్రీడలకు, క్రీడాకారులకు ఉన్న ఆదరణ, గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని, వీటిని రాజకీయంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కూడా ఈ సంస్థలకు ఆధిపత్యం వహించడానికి పోటీపడుతుంటారు. అయితే ఈ సంస్థలు, సమాఖ్యల్లో వీరు చెలాయిస్తున్న అధికారం, వీరికి ప్రభుత్వాలతో ఉన్న సంబంధాలు వీరిని అసలు లక్ష్యం నుంచి దూరం చేస్తున్నాయి. క్రీడాకారులు వీరి కారణంగా నలిగిపోవడం జరుగుతోంది. ఈ కుస్తీవీరులు తగిన ఆధారాలతో ఈ ఆరోపణలు చేసి ఉన్నట్టయితే ఆ ఆధారాలను బయటపెట్టి, అధికారులకు శిక్ష పడేలా చేయాల్సి ఉంటుంది. ఇదే చేయగలిగితే, భవిష్యత్తులో క్రీడా సంస్థలకు రాజకీయ నాయకులను అధ్యక్షులుగా నియమించడం కొంతవరకైనా తగ్గుతుంది. క్రీడాకారులు కూడా ప్రశాంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
– జి. రాజశుక