అన్యాయమంటే ఏమిటో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా జైలు చరిత్రను చదివినవారికి తేలికగా అర్థమవుతుంది. ఒక నిస్సహాయ పౌరుడి పట్ల ప్రభుత్వం వ్యహరించిన తీరుకు ఇది అద్దం పడుతోంది. దాదాపు పదేళ్ల విలువైన జీవిత కాలం వృథా అయిన తర్వాత ఇప్పుడు న్యాయం జరిగి ఏం ప్రయోజనం? ప్రభుత్వ అన్యాయ, అక్రమ వైఖరి కారణంగా సాయిబాబా పదేళ్ల కాలం జైలులో కఠినాతి కఠినమైన జీవితాన్ని గడప వలసి రావడమే కాకుండా, ఆరోగ్యం చెడిపోయి, దాదాపు జీవచ్ఛవంలా మిగిలి పోయింది. దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం క్షమాపణ చెబు తుందా? కనీసం పశ్చాత్తాప పడుతుందా? ఇటువంటి దారుణం ఇకపై ఎవరికీ జరగకుండా చర్యలు తీసుకుంటుందా? అటువంటివన్నీ జరిగే అవకాశాలు లేనేలేవు. వాస్తవమేమిటంటే సాయిబాబా తన శేష జీవితాన్ని చక్రాల కుర్చీకి పరిమితం చేయడం. వృథా అయిపోయిన జీవితం తిరిగి వచ్చే అవకాశమే లేదు.
మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ సాయిబాబాను 2014లోనూ, మరో అయిదుగురిని 2013లోనూ పోలీసులు అరెస్టు చేసి, అత్యంత ప్రమాదకరమైన చట్టాల కింద వారిపై కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. వారు పదేళ్లుగా తాము చేయని నేరానికి అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు బాంబే కోర్టు వారిని నిర్దోషు లుగా విడుదల చేసింది. ఇందులో ఒక వ్యక్తి శిక్షా కాలంలోనే ప్రాణాలు విడిచారు. దిగువ కోర్టు వారందరికీ శిక్షలు విధించింది. అయిదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ వీరికి శిక్షలు విధించడం జరిగింది. నిజానికి, 2022లోనే బాంబే హైకోర్టు వారిని సాంకేతిక కారణాలపై విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు వారి విడుదలపై స్టే ఇచ్చింది. వీరి కేసులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి విడుదల చేయాలని ఆదేశించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిర్ద్వంద్వంగా, నిర్మొహమాటంగా తిరస్కరించింది. వారి వద్ద మావోయిస్టు వస్తు సామగ్రి, సాహిత్యం, ఆయుధాలు ఉన్నాయన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సాక్ష్యాధారాలు సరైనవి కావని, అవి సరిపోవని కూడా స్పష్టం చేసింది. అంతేకాక, ఈ నిందితులు ఎక్కడా ఎప్పుడూ మావోయిస్టు కార్యకలాపాల్లో గానీ, మావోయిస్టు సమావేశాల్లో గానీ పాల్గొనలేదని, విద్రోహ చర్యల్లో కూడా పాల్గొనలేదని, అంతేకాక, వారిలో ఎవరికీ మావోయిస్టు సంస్థల్లో సభ్యత్వం కూడా లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
విద్రోహ చర్యల్లో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో సాయిబాబా పాల్గొన్నారనడానికి ఆధారాలేవీ లేవని కూడా హైకోర్టు పేర్కొంది. ఈ నిందితుల మీద సంఘ వ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఏ విధంగానూ సమంజసం కాదని, ప్రభుత్వం ఇందుకు సమర్పించిన సాక్ష్యాధారాలు, సామగ్రి నిరర్థకమైనవని, అసలు వీటిలో సాక్ష్యమనేది ఎక్కడా కనిపించడం లేదని హైకోర్టు వారిని విడుదల చేస్తూ తన తీర్పులో వ్యాఖ్యానించింది. సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోకుండానే దిగువ న్యాయస్థానం శిక్షలు విధించడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేదల కోసం, సామాజికాభివృద్ధి కోసం పనిచేస్తున్నవారిని, దివ్యాంగులని కూడా చూడకుండా న్యాయస్థానం శిక్షలు విధించడం ఆందోళనకర విషయం. ప్రభుత్వాలు, పోలీసులు వెనుకా ముందూ చూడకుండా సాధారణ ప్రజానీకాన్ని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడం, జైళ్ల పాలు చేయడం గర్హనీయమైన విషయమని పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాలే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా పనిచేయడం, అమాయకులను, నిర్దోషులను నిర్బంధిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది.
Pro. Saibaba: సాయిబాబా ప్రాణంతో ప్రభుత్వం చెలగాటం
సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోకుండా శిక్షలా?