Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్PSUs: ప్రభుత్వ సంస్థలపై పెరిగిన నమ్మకం

PSUs: ప్రభుత్వ సంస్థలపై పెరిగిన నమ్మకం

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం మూలపడిందనుకోవచ్చు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మళ్లీ నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు పెట్టదలచుకున్నవారు నిరభ్యంతరంగా ముందుకు వెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనే ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ రానురానూ అధ్వానంగా మారుతోందని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు సాగించడాన్ని, లేనిపోని భయాందోళనలు కలిగించడాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై అవి చేసిన విమర్శలను కూడా తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఢోకా లేదని, అది దేశ, విదేశాలు వేయి నోళ్లతో ప్రశంసించే స్థాయికి చేరుకుందని అంటూ ఆయన, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పుష్టిగా ఉన్నాయని, వీటిల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఇంతవరకూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఈ సంస్థలన్నీ నెహ్రూ తరహా సోషలిజానికి కట్టుబడిన సంస్థలనే అభిప్రాయం బీజేపీ ప్రభుత్వంలో ఉండేది.
నిజానికి, 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెబుతూ వచ్చింది.అయితే, ఇంతవరకూ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌లను మాత్రమే ప్రైవేట్‌ రంగానికి (టాటాలకు) విక్రయించడం జరిగింది. అంతేకాక, ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక ప్రభుత్వ రంగసంస్థనుంచి ఉపసంహరించిన పెట్టుబడులనుమరో ప్రభుత్వ రంగ సంస్థలో పెడుతూ వచ్చింది. కాగా, ప్రభుత్వం ఇంతవరకూ రెండే రెండు సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించడాన్ని బట్టి, ఈ ప్రైవేటీకరణ వ్యవహారం వెనుకపట్టు పట్టినట్టేకనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం అనేది ప్రభుత్వ పాధాన్యతా జాబితాలో లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐ.డి.బి.ఐ బ్యాంక్‌, బి.ఇ.ఎం.ఎల్‌, కాంకోర్‌ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు కూడా ఇప్పట్లో ఆచరణలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ అనుకున్నంత అధ్వాన స్థితిలో లేవని బహుశా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని ఉండాలి. ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగాగత ఏడాది దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్‌మార్కెటింగ్‌ కంపెనీలు దేశాన్ని అనేక విధాలుగా ఆదుకోవడంతో పాటు, తీవ్ర సంక్షోభం నుంచి బయట పడేయడంతో కొందరు కేంద్ర మంత్రులు ఈ కంపెనీలను ప్రశంసించడంజరుగుతోంది. గత ఏడాది దేశంలో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలను పెంచే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ తనకు అప్పగించిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ఇక ఎస్‌ బ్యాంక్‌ సమస్యలో చిక్కుకున్నప్పుడు ఈబ్యాంకును ఒడ్డునపడేయాల్సిందిగాస్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ఇండియానుఆదేశించడంజరిగింది.
దీనిని బట్టి చూస్తుంటే, కొన్నిరంగాలలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండడం కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదనిపిస్తోంది. వీటివల్ల ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయని కూడా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం పనిచేయని, ఉపయోగపడని, నష్టదాయకమైన సంస్థల మీదే ప్రభుత్వం దృష్టిపెట్టిందేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది. మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థల పట్ల నమ్మకం పెరిగినందువల్ల ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం మూలపడిందనే అనుకోవచ్చు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ప్రశంసించడాన్ని ఏదో సాధారణ విషయంగా తీసి పారేయడానికి వీల్లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News