ప్రతి సమాచారమూ విజ్ఞానంగానో, నాలెడ్జ్‌నో మారాల్సిన అవసరం లేదు. భారతదేశ పౌరుల తీరుతెన్నులను చూసిన వారికి అదే అనిపిస్తుంది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వగైరా సమాచార, ప్రసార సాధనాల ద్వారా ఎంతో సమాచారం వెలువెడుతూనే ఉంటుంది. కానీ, అది సమాచారం స్థాయిలోనే ఆగిపోతుంది. కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందని ప్రపంచమంతా కోడై కూస్తున్నా భారతీయ పౌరుడు మాత్రం ఎటువంటి స్పందనా లేకుండా, తనకేమీ పట్టనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉంటాడు. కోవిడ్ వైరస్ కాటు వేయక మునుపే మూడోసారి వ్యాక్సిన్ వేయించుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గొంతు చించుకుని అరుస్తున్నప్పటికీ, ప్రజల్లో ఏ మాత్రం చలనం లేదు. మూడోసారి వ్యాక్సిన్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య ఒక్క శాతం కూడా లేదంటే ఆశ్చర్యం కలుగు తుంది. కోవిడ్ వ్యాప్తికి సంబంధించి ఇంటర్నెట్లో సమాచారం వెల్లు వెత్తుతోంది. తన చేతిలోని ఫోన్లో దీనికి సంబంధించిన సమాచారం వరదలా ప్రవహిస్తున్నా జనం పట్టి ంచుకోకపోవడంతో వ్యాక్సిన్ విషయంలో మిగిలిన దేశాలన్నిటికంటే భారత్ ఎంతో వెనుకబడిపోయి ఉంది.
నిజానికి, 75 రోజుల పాటు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర ప్రభుత్వం గత జూలైలోనే ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన వారిలో 25 శాతం మంది కూడా వ్యాక్సిన్ వేయించుకోవ డానికి ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కలుగు తుంది. మొదటి రెండు డోసుల విషయంలో మాత్రం కేంద్ర ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా 95 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకు న్నట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. మూడో డోసు విషయానికి వచ్చే సరికి ఒకటి రెండు రాష్ట్రాలలో మాత్రం ప్రజలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో 100 శాతం మంది పెద్దవారు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. కానీ, అత్యధిక రాష్ట్రాలలో 25 శాతం కంటే తక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోగా, 18-59 ఏళ్ల వయసువారిలో ఎక్కువ మంది మూడో డోసు వేయించు కోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయానికి సంబంధించినంత వరకూ 45.5 శాతంతో తెలంగాణ మాత్రం ఆధిక్యంలో ఉంది. జాతీయ సగటు 19 శాతాన్ని మించడం లేదు.
చిత్తశుద్ది అవసరం
ప్రజల సహకారం లేనిదే వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తరించే ప్రసక్తి లేదు. ఇక, 18-59 ఏళ్లవారు ముందుకు రాకపోవడానికి మూడవ డోసు ధర, బూస్టర్ ధర ఎక్కువగా ఉంద నేది కారణం కానే కాదు. ఇందుకు చాలా అంశాలు, చాలా కారణాలు దోహదం చేస్తు న్నాయి. ఈ కొత్త వైరస్ ప్రాణాలకు ముప్పేమీ లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. భారతదేశానికి సంబంధించినంత వరకూ ఏ ఆరోగ్య పథకాన్ని మె దలుపెట్టినా, దేశ జనాభాను, వైవిధ్యతను, దేశ పరిణామాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేశ ప్రజలు ఒక పట్టాన దేన్నీ పట్టించుకోరు. నిర్లక్ష్యం చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా జలుబు తగ్గినా, ఇన్ఫెక్షన్ తగ్గినా వ్యాక్సిన్ అక్కరలేదను కుంటారు. పైగా, రెండు వ్యాక్సిన్ వేంయించుకున్న వారిలో కూడా చాలా మంది చనిపోయారు కదా అనే వాదన లేవదీస్తారు. ఇప్పుడు మరో వేరియంట్ వ్యాపిస్తున్నంతదువల్ల ప్రజలు మరింతగా అప్రమత్తం కావాల్సి ఉంది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.
వ్యాక్సిను డిమాండ్ తగ్గడం వల్ల దాని ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. బూస్టర్ డోసు వేసుకో వాలంటూ కేంద్రం చేసిన ప్రచారాన్ని ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. తీరా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండే సరికి, వ్యాక్సిన్ నిల్వలు లేక ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. బూస్టర్ డోసు ఉత్పత్తిని పెంచి, పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ తగ్గిపోతోందనే ఉద్దేశంతో ఇతర దేశాలు ఈ బూస్టర్ డోసును ఇవ్వడం ఆపేసి ఉంటే, భారతదేశం కూడా ఆపేసి ఉండేది. కానీ, ఇతర దేశాల్లో ఇది కొనసాగుతూనే ఉంది. భారతదేశ ప్రజలకు అవ గాహన ఏర్పడాలి. ప్రభుత్వాలే ఆ అవగాహనను కలిగించాలి. రాజకీయ చిత్తశుద్ధితో ఇందుకు నడుం బిగించాలి. గతంలో కోవిడ్ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా బాగా నష్టపోయిన విషయాన్ని పాలకులు మరచిపోకూడదు.
– జి. రాజశుక