మోదీ అనే ఇంటిపేరుకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు రెండేళ్లు స్టే ఇవ్వడం ఆయనకు ఎంతో ఊరటనిచ్చింది. ఆయన రాజకీయ జీవితం మళ్లీ ఊపందుకుంది. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని ఆ పార్టీ ఛాతీ విరుచుకోవడానికి కూడా అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఆయన కేసు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకూ ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధణ కావడానికి సుప్రీంకోర్టు స్టే అవకాశం ఇచ్చింది. మళ్లీ ప్రజాజీవితంలో క్రియాశీలంగా వ్యవహరించడానికి, తన వాయనా్‌డ పార్లమెంటరీ సీటులో కొనసాగడానికి కూడా ఆయనకు అవకాశం లభించింది. ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఇదే గరిష్ఠమైన శిక్ష.
సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేసిన ఫలితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. ఆయనకు విధించిన శిక్షా కాలం ఒక్క రోజైనా తగ్గి ఉంటే, ఆయనకు అనర్హత వర్తించేది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయనకు ఇంత శిక్ష విధించడానికి దోహదం చేసిన కారణాలను సూరత్ కోర్టు వివరించి ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సూరత్ కోర్టు గానీ, హైకోర్టు గానీ స్టే ఇచ్చే విషయంలో ఈ కారణాలను పరిశీలించలేదని కూడా అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. రాఫేల్ కేసులో మోదీని రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్ హై’ అని చేసిన వ్యాఖ్యపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని మాత్రం సూరత్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు సుప్రీం కోర్టు ఈ కేసులో ఆయనను మందలించింది. అయితే, రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆ కేసును అక్కడితో ముగించింది.
మోదీ అనే ఇంటి పేరు గలవారిని రాహుల్ గాంధీ విమర్శించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు బట్టింది. ఇది ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రకటనలు, వ్యాఖ్యలు చేసే ముందు రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఆచితూచి వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, తాను తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అడ్డం పెట్టుకుని తనతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం న్యాయ ప్రక్రియకు విరుద్ధమని ఆయన వాదించారు.
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించిన వెంటనే లోక్ సభ సచివాలయం ఆయన లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడనే ప్రకటన చేసింది. ఇప్పుడు సహజ న్యాయం కింద ఆ సచివాలయం వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. ఆలస్యం చేయడమనేది దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. ఒకప్పుడు ఎన్.సి.పి పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి పది వారాల సమయం పట్టింది. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో తప్ప, దేశ రాజకీయాల్లో ఈ కొత్త పరిణామం పెద్దగా సంచలనం సృష్టించలేదు. ఆయన రాజకీయాలు యథాప్రకారం కొనసాగుతున్నందువల్ల పెద్దగా తేడా కనిపించలేదు. అయితే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన కొద్దిగా తీవ్ర విషయంగానే తీసుకోవడం మంచిది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు అయి ఉండి, ఆయన ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసంగా కనిపించకపోగా, అది ఆయన అభిరుచి చౌకబారుతనాన్ని అంటగట్టే అవకాశం ఉంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊహించని ఊరట
లోక్ సభ సభ్యత్వం పునరుద్ధణ కావడానికి సుప్రీంకోర్టు స్టే