Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi: రాహుల్..గేమ్ ఛేంజర్ ?

Rahul Gandhi: రాహుల్..గేమ్ ఛేంజర్ ?

గాంధీ కుటుంబం-కాంగ్రెస్ ఇవి రెండూ విడదీయరానివిగా మారాయి కాంగ్రెస్ పార్టీకి. అందుకే నిత్యం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లను స్మరించకుండా ఎంతటివారికైనా కాంగ్రెస్ పార్టీలో పూట గడవదు. వ్యూహాత్మకంగా మల్లికార్జున్ ఖర్గేకు పార్టీ బాధ్యతలు అప్పగించాక కూడా మనసులో మాట చెప్పడం లేదా నోరు జారడం ద్వారా సల్మాన్ ఖుర్షీద్ వంటివారు నిత్యం గాంధీ కుటుంబ నామస్మరణ బాహాటంగానే చేస్తూ, ఖర్గేను ఖాతరు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. ఇది ఖర్గేతో సహా మనందరికీ తెలిసి బహిరంగ రహస్యమే. పైగా ఖర్గేది నామమాత్రపు పదవి మాత్రమే. అదో అలంకారప్రాయమైన అత్యున్నత పదవి కూడా. గాంధీ కుటుంబ వీర విధేయుడికి కట్టిన పట్టం అని రాజకీయ పండితుల నుంచి ఆమ్ ఆద్మీ వరకూ అందరికీ తెలిసినదే.

- Advertisement -

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోస్టర్ బాయ్ నిస్సందేహంగా రాహుల్ గాంధీనే. ఇదే విషయాన్ని కమలనాథ్ ప్రకటించేశారు కూడా. పైగా కాంగ్రెస్ తో కూటమి కట్టే పార్టీలు ముందుకు వస్తే విపక్షాల ప్రధాన మంత్రి ముఖచిత్రం కూడా రాహుల్ గాంధీనే అంటూ ముందే కుండ బద్ధలు కొట్టేసింది హస్తం పార్టీ.

భవిష్యత్ కార్యచరణ కోసమంటూ ఆర్గనైజేషన్ ఫేస్ లిఫ్ట్ చేసేందుకు, పార్టీ నేతలు, కార్యకర్తల్లో హుషారు నింపేందుకు కొన్ని కార్యక్రమాలు షెడ్యూల్ చేసుకుంది పార్టీ. కొత్త ఆఫీస్ బేరర్స్, కొన్ని రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జులు, కొత్త పీసీసీలు అవసరమైన చోట రిక్రూట్ చేసి పార్టీలో జోష్ నింపేందుకు కసరత్తు సాగుతోంది. ఇదంతా సరే కానీ పార్టీలో ఉన్న ఇద్దరు మాజీ అధ్యక్షులను ఏం చేయాలో, వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో పార్టీకి బోధపడట్లేదు అందుకే కొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

అందుకే పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత సభ్యులుగా నియమించే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది. ఎందుకంటే సీడబ్ల్యూసీ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థ. కాట్టి సోనియా, రాహుల్ కు ఇందులో పర్మినెంట్ గా స్థానం కల్పించి, వారి నిర్ణయాలను పార్టీ అనుసరించేలా స్కెచ్ వేస్తున్నారన్నమాట. ఇలా చేస్తే పార్టీలో వీరిద్దరి స్థానాలు పదిలంగా ఉంటాయికూడా.

రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 24-26 తేదీల్లో జరిగే ఈ కీలక ప్లీనరీ సమావేశాల్లో మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నట్టు పునరుద్ఘాటిస్తూ ప్రకటించనుంది. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరుగలేదు కనుక రాయ్ పూర్ ప్లీనరీ సెషన్స్ లో మాత్రం ఎన్నికలు జరిగే సూచనలున్నాయి. పార్టీకి సంబంధించిన పొలిటికల్, ఎకనామిక్, ఇంటర్నేషనల్ అఫైర్స్, అగ్రికల్చర్, ఫార్మర్స్, సోషల్ జస్టిస్, ఎంపర్మెంట్, యూత్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ వంటి అంశాలపై పార్టీ విధానాలను ప్రకటిస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ వివరించారు. ఈ కీలక అంశాలపై తమ పార్టీ మంచి వ్యూహాలతో కూడిన తీర్మానాలు చేసి ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా పార్టీ కార్యచరణను ప్రచారం చేసి, రానున్న 2024 ఎన్నికలకు సమర శంఖం ఊదే ప్రయత్నంలో అధిష్ఠానం ఉంది. మూడు రోజులపాటు సాగే 85వ ప్లీనరీ సమావేశాలు పార్టీకి సరికొత్త దశ-దిశను నిర్దేశిస్తాయని పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

సీడబ్ల్యూసీని కాంగ్రెస్ అధ్యక్షుడే నామినేట్ చేస్తారని, ఒకవేళ ఎన్నికలు నిర్వహించమంటే ప్లీనరీలోనే ఈ తంతు కూడా ముగించనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సాధారణంగా ఉండేది.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, 23 మంది ఇతర సభ్యులు..వీరిలో 12 మందిని ఏఐసీసీ ఎంపిక చేసుకుంటుంది. మిగతావారిని పార్టీ అధ్యక్షుడే నామినేట్ చేసి అపాయింట్ చేస్తారు.

ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంచి జోష్ లో కొనసాగుతోంది. రాహుల్ కు మంచి పొలిటికల్ మైలేజ్ వస్తోంది, మరోవైపు ఈమధ్య కాలంలో మొట్టమొదటిసారి పార్టీపై యువకుల్లో, సెలబ్రిటీల్లో కాస్త క్రేజ్ పుట్టుకొచ్చింది ఈ పాదయాత్ర వల్లే. దీంతో తన పాదయాత్రను కొనసాగిస్తూ భారత్ జోడోయాత్ర 2.0 ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేలా, మీడియాలో ఉండేలా రాహుల్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో వచ్చే ఏడాది ఎన్నికలు సమీపించే వరకూ రాహుల్ ప్రజల మధ్యే ఉండనున్నారు. దీనికి తోడు ప్రతి రాష్ట్ర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ దేశవ్యాప్తంగా పాదయాత్రలు ఊపందుకోనున్నాయికూడా. దీంతో పార్టీ జెండానిత్యం ప్రజల్లోకి పోయి..అజెండాను వివరించే ప్రయత్నం చేస్తుంది.

ఖర్గే కూడా నిత్యం తన గొంతును వినిపిస్తూ, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను పదేపదే చెబుతూ ఊదరగొడుతున్నారు. పార్లమెంట్ లోపల, బయట, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన కాంగ్రెస అజెండాను వివరిస్తూ, బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి భేటీలను నిర్వహిస్తూ పార్టీని మరింత పటిష్ఠం చేసే పనుల్లో ఖర్గే తలమునకలై ఉండటం విశేషం.

న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వార్ రూంలో ఈ భేటీ 2024 లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. పీ చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మేకన్, రణదీప్ సూర్జేవాలా, ప్రియాంక గాంధీ, సునీల్ కనుగోలు వంటివారు ఈ టాస్క్ ఫోర్స్ భేటీలకు హాజరవుతున్నారు. టాస్క్ ఫోర్స్ 2024లో భాగంగా అత్యధిక లోక్సభ స్థానాలు గెలిచే ప్రయత్నాల్లో పార్టీ మునిగితేలుతోంది. మోడీ హ్యాట్రిక్ కొట్టకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతున్నా పరిస్థితులు ప్రస్తుతానికి కాంగ్రెస్ కు అనుకూలంగా లేకపోవటం పార్టీకి కూడా తెలిసిన విషయమే.

ప్రస్తుతానికైతే మంచి ఇమేజ్ వచ్చి.. గేమ్ ఛేంజర్ గా ఎదుగ గలరని ఇటు కార్యకర్తల్లో అటు కొందరు కాంగ్రెస్ సీనియర్లలో భరోసా ఇస్తున్నారు రాహుల్. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఈయన ఇంకా పూర్తిగా అర్థం కావటం లేదు. అక్కడికీ శివసేన నేత సంజయ్ రౌత్ వంటివారు రాహుల్ పొలిటికల్ ఛేంజ్ తెస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కు ఆరా ఉందని ‘సామ్నా’ కూడా రాస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రాహుల్ హవా, కాంగ్రెస్ హవా వస్తుందని, నెక్ట్స్ జనరల్ ఎలక్షన్స్ లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా రాహుల్ నిలుస్తారనే అంచనాలు సంజయ్ రౌత్ వేస్తున్నారు.

కానీ అసలు ఏ అంశాన్ని ఎత్తుకుని 2024 ఎన్నికల్లో ప్రచారంలోకి దిగాలనే ప్రశ్న కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. మతతత్వ అంశాలు కాకుండా ఇతర అంశాలు ఏవీ పనికొచ్చేలా కనిపించక పోవటం పెద్ద సవాలుగా మారింది. విభజన రాజకీయాలు అంటూ మెజార్టీ ప్రజలకు దూరమైతే అధికారానికి శాశ్వతంగా దూరమైనట్టే అంటూ సాఫ్ట్ హిందుత్వ కాదు మెజార్టీని కలుపుకు పోవాలని ఏకే ఆంటోనీ వంటి కురు వృద్ధులు కాంగ్రెస్ పార్టీకి స్వరం పెంచి హెచ్చరిస్తున్నారు. అందుకే రాహుల్ కూడా ప్రతి యాత్రకు ముందు, యాత్రలో భాగంగా, తన ప్రతి పర్యటనలోనూ స్థానికంగా ఉన్న ఆలయాలు, మఠాలను తప్పకుండా దర్శిస్తూ తనకు హిందుత్వంపై విశ్వాసం ఉందని నోటితో చెప్పకుండా చేతలతో చాటుకుంటూ, మెజార్టీలను సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News