తెలుగు రాష్ట్రాల్లో ముప్పాళ రంగనాయకమ్మ పేరు వినని వారుండరు. 1939 సెప్టెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని బొమ్మిడి గ్రామంలో పుట్టి పెరిగిన రంగనాయకమ్మ చదువుల్లో సాటిలేని మేటి అయినప్పటికీ, పేదరికం కారణంగా ఆమెను ఉన్నత విద్యకు పంపించడం జరగలేదు. పదవ తరగతితో చదువు ఆపేసినప్పటికీ, ఆమె సుమారు 1955 నుంచి సొంతంగా రచనలు చేయడం ప్రారంభించి, 15 నవలలు, 70కి పైగా కథలు, అనేక వ్యాసాలు రాయడం జరిగింది. ఒక రచయిత్రిగానే కాక, విమర్శకురాలుగా కూడా ప్రసిద్ధి చెందిన రంగనాయకమ్మ బాల్యం నుంచి సంస్కరణాభిలాషి. ముఖ్యంగా లైంగిక వివక్ష మీద పోరాడిన వ్యక్తి. పెళ్లయినప్పటికీ 12 ఏళ్ల తర్వాత భర్తతో పొసగక ఆమె ఆ వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఆమె రచనలన్నీ కలిపి ఒక 60 సంకలనాలుగా రూపొందించడం జరిగింది.
ఆమె ఏ నవల రాసినా, ఏ కథ రాసినా అందులో లైంగిక సమానత్వానికి పెద్ద పీట వేసేవారు. దేశంలో వైవాహిక జీవితం ఏ విధంగా, ఏ స్థాయిలో ఉందో ఆమె రచనల్లో వ్యక్తమవుతూ ఉండేది. ఆమె నవలల్లో, కథల్లో ఆలోచింపజేసే విషయాలు అనేకం ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కదాన్ని చదివినా చదివిన వ్యక్తితో మార్పు చోటు చేసుకుంటుందని విమర్శకులు సైతం అంగీకరిస్తారు. ప్రతి రచనలోనూ సానుకూల దృక్పథం కనిపిస్తూ ఉంటుంది. ఒక కొత్త సమాచారం ఉంటుంది. అంతకు మించి ‘కనువిప్పు’ కలిగించే విశేషమేదో ఉంటుంది. స్త్రీల హక్కుల గురించి, వారిని పురుషులతో సమానంగా చూడాల్సిన అవసరం గురించి ఇరవయ్యవ శతాబ్దంలో పలువురు రచయితలు అనేక రచనలు చేసినప్పటికీ, అనేక పోరాటాలు సాగించినప్పటికీ రంగనాయకమ్మ తీరు మాత్రం ఆ రచయితలందరికీ భిన్నంగా ఉంటుంది. ఏ విషయమైనా డొంక తిరుగుడుగా చెప్పడమనేది ఆమె నైజం కాదు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే ఆమెకు అలవాటు. ఆమె మొదటి నుంచీ వ్యావహారిక భాషలోనే రాసేవారు. ‘మనం వాడుక భాషే రాస్తున్నామా?’ అనే శీర్షికతో ఆమె రాసిన వ్యాస సంపుటి పత్రికా రచయితలతో సహా రచయితలందరికీ ఒక ప్రామాణిక గ్రంథంగా మారిపోయింది.
ఇక 1950లలో ఆమె రాసిన మొట్టమొదటి నవల ‘కృష్ణవేణి’ రెండు రకాల వివాహాలకు అద్దం పట్టింది. ఇవి విఫలమైన వివాహాలు. ఆమె వివాహాలు విఫలం కావడానికి దోహదం చేసిన కారణాలను సంస్కరణ దృక్పథంతో చక్కగా మలచారు. ఇందులో ఒక వివాహం సుఖాంతం కాగా, మరొక వివాహం విషాదాంతం. వీటిల్లో కులాంతర వివాహాలకు, వితంతు వివాహాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కులాంతర వివాహాల మీదా, వితంతు పునర్వివాహాల మీదా అప్పట్లో ఉన్న దురభిప్రాయాలను ఆమె తార్కికంగా, హేతుబద్ధంగా తొలగించారు. 1973లో మార్క్సిస్టు భావజాలంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమె రచనలన్నీ ఆ భావజాలంతోనే కొనసాగాయి. 1974లో ఆమె వెలువరించిన ‘రామాయణ విష వృక్షం’ ఈ మార్క్సిస్టు భావజాల దృక్పథంతోనే రాయడం జరిగింది. మూడు సంపుటాలతో ఆమె రచించిన ఈ గ్రంథాన్ని ఆ తర్వాత ఇంగ్లీషులోకి కూడా అనువాదం చేయడం జరిగింది.
కార్ల్ మారక్స్ రాసిన దాస్ క్యాపిటలిజం అనే పుస్తకాన్ని తెలుగువారికి పరిచయం చేసే విధంగా ఆమె రాసిన మారక్స్ క్యాపిటలిజం పరిచయం పాఠకులను బాగా ఆకట్టుకుంది. మూడు సంపుటాలలో ఆమె రాసిన నవల ‘జానకి విముక్తి’ లైంగిక సమానత్వం అవసరాన్ని గురించి చెప్పకనే చెబుతుంది. కుల వ్యవస్థ గురించి అంబేద్కర్ రాసిన వ్యాసాలు, గ్రంథాలలో పొంతన లేని అంశాలున్నాయని పేర్కొంటూ ఆమె 2005లో ఒక గ్రంథం రాశారు. కుల వ్యవస్థకు మార్క్సిస్టు భావ జాలమే పరిష్కారమని ఆమె వాదించారు. 1965లో ఆమె రాసిన ‘బలిపీఠం’ అనే నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1975లో ఈ నవల ఆధారంగా చిత్ర నిర్మాణం కూడా జరిగింది. నిజానికి ఆమె అవార్డులను, పురస్కారాలను స్వీకరించేవారు కాదు. ఎప్పుడు ఎవరు అవార్డు ప్రకటించినా ఆమె వెంటనే తిరస్కరించేవారు. మార్క్సిజం భావజాలాన్ని విస్తరించాలని, బోధించాలనే ఆలోచనతో ఆమె క్రమంగా తన రచనా వ్యాసంగాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ‘చైనాలో ఏం జరుగుతోంది?’, ‘సోవియట్ రష్యాలో ఏం జరిగింది?’ పేర్లతో ఆమె రాసిన రెండు గ్రంథాలు మార్క్సిజం విషయంలో ఆమె తపనకు అద్దం పడతాయి.
Ranganayakamma: చిరస్మరణీయమైన సంస్కరణ రచయిత్రి
లైంగిక వివక్ష మీద పోరాడే అక్షరాలు