Saturday, July 27, 2024
Homeహెల్త్Winter skin masks: చలికి చర్మానికి ఈ మాస్కులు వేయాల్సిందే

Winter skin masks: చలికి చర్మానికి ఈ మాస్కులు వేయాల్సిందే

స్కిన్ గ్లో కోసం..

చలికాలంలో చర్మానికి వంటింటి మాస్కులు..
చలికాలం మొదలైంది. దీంతోపాటు చర్మ సమస్యలు కూడా షురూ అవుతాయి. ఈ సీజన్ లో కూడా మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా, మెరిసేలా చేసే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు.

- Advertisement -

తేనె

ఇది మన వంటింట్లో దొరికే వస్తువే. ఇది చర్మానికి చేసే మేలు ఎంతో. తేనె, టొమాటోలు కలిపి చర్మానికి అప్లై చేస్తే మీరు పొందే ప్రయోజనాలు ఎన్నో. ఈ రెండింటి మిశ్రమం మీ చర్మానికి కావలసిన తేమను ఇవ్వడంతో పాటు చర్మాన్ని మరింత మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల టమోటా జ్యూసు, ఒక టేబుల్ స్పూన్ తేనె రెడీ పెట్టుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.

జొజొబా ఆయిల్

జొజొబా ఆయిల్ చలికాలంలో చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. జొజొబా ఆయిల్ ని బాదం ఆయిల్ తో కలిపితే రెండింటిలోని సుగుణాలతో మీ చర్మం పట్టులా మెరిసిపోతుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ జొజొబా ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ తీసుకోవాలి. ఈ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు శుభ్రంగా కడుక్కున్న
ముఖానికి సున్నితంగా మసాజ్ చేస్తూ రాసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మీ ముఖం చూసుకుంటే అది ఎంత కాంతితో మెరుస్తుందో గమనించగలరు.

అలొవిరా
పొడిచర్మం ఉన్నవారు చలికాలంలో అలొవిరా జెల్ వాడితే చర్మం తేమతో మెరుస్తుంది. అలొవిరాలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఎన్నో ఉన్నాయి. చర్మాన్ని ఇవి బాగా హైడ్రేట్ చేస్తాయి. చర్మంపై రంధ్రాలు బిగువుగా ఉండేలా చేస్తాయి. శీతాకాలంలో పొడిచర్మం ఉన్న వాళ్లు అలొవిరా జెల్ ముఖానికి రాసుకుంటే మాయిశ్చరైజర్ చర్మానికి బాగా అంది సహజకాంతితో మీ చర్మ సౌందర్యం చూపరులను ఇట్టే
ఆకట్టుకుంటుంది. ఇందుకు అలొవిరా జెల్ ఉంటే చాలు. అలొవిరా ఆకు నుంచి గుజ్జు లేదా ఆర్గానిక్ అలొవిరా జెల్ తీసుకుని అందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మంపై సున్నితంగా మసాజ్ చేస్తూ రాయాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఆ పేస్టును ముఖంపై అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

పసుపు, పెరుగు
చలికాలంలో ముఖానికి పెరుగు, పసుపు మిశ్రమం రాసుకుంటే కూడా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది యాంటి ఏజింగ్ ఫేస్ ప్యాక్. ఇది రాసుకుంటే చర్మం యాక్నే బారిన పడదు. ఈ ఫేస్ ప్యాక్ చలికాలంలో మచ్చలేని ఆరోగ్యకర చర్మ సౌందర్యాన్నిఇస్తుంది. ఇది తయారుచేయడానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అరటీస్పూను పసుపు రెడీగా పెట్టుకోవాలి. ఈ రెండింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చర్మానికి నిత్యం చేసుకునేలాగే టోన్, మాయిశ్చర్ రాసుకోవాలి. వారానికి
ఒకసారి లేదా రెండుసార్లు ఈ మాస్కును ముఖానికి రాసుకోవచ్చు.

ఓట్మీల్-పెరుగు
ఓట్మీల్, పెరుగు మిశ్రమం కూడా చలికాలంలో చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. ఓట్మీల్ చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. పెరుగు చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఓట్మీల్, పెరుగు కలిపి
స్క్రబ్ లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉండే మృతకణాలు పోయి బాగా మెరుస్తుంది. ఈ స్క్రబ్ తో ముఖాన్ని కొద్దిసేపు మసాజ్ చేయాలి. పది పదిహేనునిమిషాల పాటు అలాగే ఉంచుకుని శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి.

చక్కెర-తేనె-ఆలివ్ ఆయిల్

చక్కెర, తేనె, ఆలివ్ ఆయిల్ మూడింటి మిశ్రమంతో చర్మం మెరుపులు చిందిస్తుంది. తేనె, ఆలివ్ లు రెండూ చలికాలంలో చర్మానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అందులో నిమ్మ, చక్కెర కలిపాలి. ఇవి చర్మనికి మంచి ఎక్స్ ఫొయిలేటర్స్ గా ఉపయోగపడతాయి. అరటేబుల్ స్పూన్ చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల తేనె,ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, మూడు లేదా నాలుగు నిమ్మరసం చుక్కలు రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటే అదనంగా కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను ఇరవై నిమిషాల దాకా అలాగే
ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చలికాలంలో పొడిచర్మం వారు చర్మానికి కొబ్బరినూనె రాసుకుంటే ఎంతో మంచిది. కొబ్బరినూనెలో యాంటాక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శీతాకాలంలో చర్మం పొడారకుండా సంరక్షిస్తాయి. చర్మంపై ఏజింగ్ ను కూడా కనిపించనివ్వదు.

కొబ్బరి నూనె

శీతాకాలంలో చర్మం మెరవడానికి కొబ్బరి నూనెను నిత్యం రాసుకుంటే ఎంతో మంచిది. రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకొని అలాగే పడుకోవాలి. ఉదయం లేవగానే మీ చర్మం మృదువుగా ఉండడమే కాదు ఎంతో చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముఖాన్ని మైల్డ్ క్లీన్సర్ తో శుభ్రం చేసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News