Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Rapid development: అతి వేగంగా దేశ పురోగతి

Rapid development: అతి వేగంగా దేశ పురోగతి

మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పాలక, ప్రతిపక్షాల ప్రచారాలు, వ్యూహ, ప్రతివ్యూహాలు కొంత ప్రత్యక్షంగా, కొంత పరోక్షంగా ఊపందుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వ సాఫల్యాలను, విజయాలను ఏకరువు పెట్టారు. అంతకు ముందు రోజున, కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ, చొరలేని, మారుమూల ప్రాంతాలకు కూడా తమ అభివృద్ధి ఫలాలను అందించడానికి తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం కాలం చెల్లిన విధానాలను సమూలంగా మార్చేస్తోందని, అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఉన్నామని మోదీ కూడా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు మరో ఏడాది కాలంలో జరగబోతుండడం, త్వరలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుండడం వల్ల వీరి ప్రసంగాలు, ప్రకటనలు అర్థం చేసుకోదగినవే. ఇందులో తప్పకుండా రాజకీయ ఉద్దేశాలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏదైనా ఒక అంశం మనసులో కలకాలం నిలిచిపోవాలన్న పక్షంలో దానిని పదే పదే చెబుతూ పోవడమే మార్గమని మోదీకి తెలుసు. తమ పార్టీ భావజాలంతో ఏకీభవించని వారిని సైతం మోదీ తన మాటలతో ఏకీభవించగలరు.
ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలు సైతం ఒకే తాటి మీదకు వచ్చే ప్రయత్నంచేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మీదకు తమ అస్త్రశస్త్రాలన్నీ ఎక్కుపెడుతూ, మోదీకి ఒక పారిశ్రామికవేత్తతో ఉన్న సన్నిహిత సంబంధాలను అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌తో సహా ఈ పార్టీలన్నిటి ఉమ్మడి విమర్శ, ఉమ్మడి ఆరోపణ ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థ చప్పగా చతికిలబడిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, దేశంలో ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది, పేదలు, మధ్య తరగతివారి కష్టాన్ని ఫణంగా పెట్టి కొద్దిమంది సంపన్నులను అభివృద్ధి చేయడానికే ప్రభుత్వ సమయమంతా గడిచిపోతోంది. ఇవన్నీ విధ్వంసకర విధానాలని ఆ పార్టీలన్నీ కోడై కూస్తున్నాయి. ప్రజలు లేదా ఓటర్లు ఏమనుకుంటున్నారనే విషయం బ్యాలెట్‌ బాక్సులను తెరచినప్పుడు కానీ ఎవరికీ తెలియదు. అయితే, ఈ లోగా దేశంలో చోటు చేసుకున్న కొన్ని అభివృద్ధి వ్యవహారాలను మాత్రం స్మరించకుండా ఉండలేం.
అంతర్జాతీయ పత్రికల ప్రశంసలు
వామపక్ష భావజాలం కలిగిన ఒక అంతర్జాతీయ స్థాయి పత్రిక ‘ఎకనామిస్ట్‌’ మోదీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకి అన్న విషయం తెలిసిందే. మోదీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడినప్పటి నుంచీ ఈ పత్రిక నిప్పులుచెరగడం ప్రారంభించింది. ప్రధాని పదవికి ఆయన అనర్హుడని ప్రచారం చేసింది. అయితే, ఇటీవలి కాలంలో ఆ పత్రిక రాసిన కొన్ని పరిశోధనాత్మక వ్యాసాలు మోదీకి అనుకూలంగా ఉండడం గమనించాల్సిన విషయం. మోదీ నాయకత్వంలో రవాణా రంగం సమూలంగా మార్పులకు లోనవుతోందని, రోడ్లు, రైలు మార్గాలు ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అది గణాంకాలు, ఫోటోలతో సహా వివరిస్తూ ఒక సుదీర్ఘమైన వ్యాసం రాసింది. అవి అత్యంత ఆధునికంగా మారడమే కాకుండా కనెక్టివిటీ బాగా పెరిగిందని కూడా అది పేర్కొంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఒకటి రెండు కార్యక్రమాల్లో తమ శాఖలు సాధిస్తున్న అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. దేశంలో ప్రాథమిక సదుపాయాల కల్పన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆ పత్రిక వివరంగా రాసింది. దేశంలో ద్విచక్ర వాహనాల రంగంలో ఎలక్ట్రానిక్‌ వాహనాలు వెల్లువలా ఉత్పత్తి అవుతుండడాన్ని కూడా ఈ అంతర్జాతీయ పత్రిక ప్రశంసించింది. త్వరలో ఎలక్ట్రానిక్‌ కార్లు ఉత్పత్తి కావడం కూడా జరుగుతుందని అది తెలిపింది. గడ్కరీ కూడా ఇదే విషయం వెల్లడించారు.
భారత దేశ జనాభా చైనా జనాభాను మించిపోవడాన్ని కూడా ఈ పత్రిక ప్రశంసించింది. దీనివల్ల భారతదేశ అభివృద్ధికి ఇక హద్దు ఉండదని, భారత మార్కెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపింది. ఆపిల్‌ సంస్థ అధిపతి టిమ్‌ కూక్‌ భారతదేశంలో పర్యటించడం, చైనా నుంచి తమ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తరలించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుండడం తదితర పరిణామాలను ఆ పత్రిక ఎంతగానో కొనియాడింది. దేశంలో ఎన్నో అభివృద్ధి పథకాలు ఆచరణలోకి వస్తున్నాయని అది వివరించింది. ప్రధానిమోదీ దీనినే ‘అమృత్‌కాల్‌’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోదీ హయాంలో జన్‌ధన్‌, మొబైల్‌, ఆధార్‌ వంటి వినూత్న కార్యక్రమాలు రూపుదిద్దుకుని విజయవంతంగా అమలు జరగడం కొన్ని విదేశీ పత్రికలను బాగా ఆకట్టుకుంది. మోదీని ఘాటుగా, తీవ్రంగా విమర్శించే అంతర్జాతీయ పత్రికలు సైతం మోదీని ప్రశంసించే దిశగా దారి మళ్లుతున్నాయి. డిజిటల్‌ చెల్లింపులను కేంద్ర మాజీ ఆర్థికమంత్రి మొదట్లో ఎగతాళి చేసిన విషయాన్ని మోదీ ఇటీవల ఉదహరిస్తూ, ఇప్పుడు అదే నాయకుడు ఈ చెల్లింపులను మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారతదేశ యు.పి.ఐ విధానాన్నే ఇతర దేశాలు అనేకం అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. మొదట్లో అందరూ విమర్శించిన జి.ఎస్‌.టి సైతం ఇప్పుడు అ ందరి మన్ననలనూ పొందుతోందని మోదీ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా దేశంలో పెద్ద ఎత్తున చేపట్టడానికి ఈ జి.ఎస్‌.టిఎంతగానో తోడ్పడుతోందని ఆయన వివరించారు.
పేదరికంలో మార్పులు
కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు సగానికి సగం భారతదేశం తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించిన దేశాలు ఆ తర్వాత భారత్‌ నుంచే వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకోవడం జరిగిందని, కోవిడ్‌ సమయంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండడం కూడా ఇతర దేశాలకు మార్గదర్శకంగామారిందని ఇప్పుడు అంతర్జాతీయ పత్రికలు కొనియాడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నరష్యా నుంచి భారత్‌ తగ్గింపు రేట్లకు ఆయిల్‌ను దిగుమతి చేసుకోవదాన్ని కూడా పత్రికలు ఇప్పుడు మెచ్చుకుంటున్నాయి. మొదట్లో ఈ చర్యను తీవ్రంగా విమర్శించిన పాశ్చాత్య దేశాలు ఇప్పుడు భారత్‌ చర్యకు కితాబులిస్తున్నాయి. మరికొన్ని చర్యలు కూడా మోదీ ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. అమెరికాకు చెందిన సి.ఎ.టి.ఒ అనే ఒక అధ్యయన సంస్థ కూడా మోదీ ప్రభుత్వ చర్యలను కొన్నింటిని ప్రశంసించడం జరిగింది. కోవిడ్‌మొదట్లో దేశంలో పేదరికం పెరిగిపోతోందంటూ వ్యాసాలు రాసిన ఈ సంస్థ ఇప్పుడు పేదరికం ఏమాత్రం పెరగకపోగా, బాగా తగ్గుముఖంపట్టిందని గణాంకాలతో సహా వివరించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఆహార ధాన్యాలను, నిత్యావసరాలను పంపిణీ చేయడం వల్ల దేశంలో ఎక్కువ మంది ప్రయోజనం పొందడంజరిగిందని ఈ సంస్థ పేర్కొంది. ప్రజల మౌలిక సౌకర్యాలు బాగా పెరిగాయని, పేదల జీవన ప్రమాణాలలో కూడా బాగా మెరుగుదల కనిపిస్తోందని అది తెలిపింది. ఇంతకూ ఇవన్నీ ఓట్లుగా మార్పు చెందుతాయా అన్నది వేరే విషయం. దేశ పౌరులుగా మనం మన సాఫల్యాలు, విజయాలనే అంగీకరించే స్థితిలో లేమా అన్న ప్రశ్న మాత్రం ఇక్కడ తప్పకుండా ఉదయిస్తుంది.

- Advertisement -

డాక్టర్‌ వి. కనకదుర్గ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News