Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Reservations are of no use !: రిజర్వేషన్‌ ఉన్నా పురోగతి శూన్యం

Reservations are of no use !: రిజర్వేషన్‌ ఉన్నా పురోగతి శూన్యం

థర్డ్ జెండర్ పట్ల ట్రాన్స్ డిస్క్రిమినేషన్

కేంద్ర ప్రభుత్వ సూచనలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనేక రాష్ట్రాలు ట్రాన్స్‌ జెండర్ల కోసం చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాయి కానీ, ఇంత వరకూ ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నవారే లేరని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2011లో బెంగళూరు విశ్వవిద్యాలయం తమ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ఒక శాతం సీట్లను ట్రాన్స్‌ జెండర్ల కోసం కేటాయించింది. అయితే, ఇంతవరకూ ఆ కోర్సుల్లో చేరినవాళ్లు లేరు. ఈ వర్గం వారిని ప్రధాన జీవన స్రవంతిలో కలపాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం వీరికి ఉద్యోగంలో ఒక శాతం రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించింది. ఈ సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలనే ఆసక్తి వీరిలో ఎక్కడా కనిపించడం లేదని ఇటీవల జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, ఈ వర్గం వారిలో ఎక్కువ మంది హైస్కూలు స్థాయిలోనే చదువులు ఆపేయడం జరుగుతోంది. ఫలితంగా వీరిలో అత్యధిక శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు కూడా కారని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, కుటుంబం నుంచి మద్దతు లభించకపోవడం, సమాజంలో ఈ వర్గం వారి పట్ల వివక్ష ఉండడం వంటి కారణాల వల్ల వీరు మధ్యలోనే చదువులు ఆపేయాల్సి వస్తోంది.
ఆసక్తికర విషయమేమిటంటే, 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌ జెండర్లలో 82 శాతం మంది విద్యాసంస్థల్లో వివక్షకు, వేధింపులకు గురవుతున్నారు. వారి లైంగిక ప్రాధాన్యాల కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరుగుతోంది. అంతేకాకుండా, భద్రత లేకపోవడం వల్ల ఇందులో 32 శాతం మంది పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికే భయపడుతున్నారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాల కారణంగా ఈ రాష్ట్రంలో ట్రాన్స్‌ జెండర్లకు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే, ఉద్యోగాలకు కనీసార్హత ఉన్నందువల్ల ఇందులో చాలామంది ఈ ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితి ఏర్పడింది. 2022 జూన్‌ నెలలో 15,000 ఉపాధ్యాయ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇందులో 150 ఉపాధ్యాయ ఉద్యోగాలను ట్రాన్స్‌ జెండర్లకు రిజర్వు చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 70 వేల దరఖాస్తులు రాగా, అందులో రెండు మాత్రమే ట్రాన్స్‌ జెండర్ల నుంచి రావడం జరిగింది. ఇందులో చాలా మందికి బి.ఇడి డిగ్రీ లేకపోవడం ఒక కారణం కాగా, సామాజిక వివక్ష మరో కారణం అని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.
రాజ్యాంగపరంగా వీరికి విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం వంటి కీలక అంశాలలో ఉన్న హక్కులను గుర్తించిన ప్రభుత్వాలు వీరి కోసం ప్రత్యేక విధానాలను రూపొందించి, అమలు చేయడం జరుగుతోంది. అయితే, ఈ అంశాలన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వీరి హక్కుల సంరక్షణకు పోరాడుతున్న, ఉద్యమిస్తున్న సంస్థలు, సంఘాలు వీరి బాధ్యతలను మహిళా, శిశు సంరక్షణ విభాగానికి కాకుండా, సాంఘిక సంక్షేమ విభాగానికి అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాయి. ప్రభుత్వాలు ఈ వర్గం వారి కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రశంసనీయమైన విషయమే కానీ, వీరికి ప్రత్యేకంగా విద్యా సౌకర్యాలు, శిక్షణ వ్యవస్థలను నెలకొల్పనిదే ఈ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. విద్యా సంస్థలో ఇతర విద్యార్థులు, అధ్యాపకులు వారి పట్ల వివక్ష ప్రదర్శించకుండా అవగాహన, చైతన్యం కలిగించడంతో పాటు, వారిని వేధించకుండా, వెలి వేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యాధికారుల మీద ఉంది. వారికి నాణ్యమైన విద్యనందించి, వారికి సరైన ఉద్యోగా వకాశాలు కల్పించి, వారికి ఆర్థిక సుస్థిరత కల్పించినప్పుడే వారు సమాజంలో హుందాగా బతికే అవకాశం ఏర్పడుతుంది. వారి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News