Sunday, July 14, 2024
Homeఓపన్ పేజ్Rich family kids too are facing malnutrition: సంపన్నులలోనూ పౌష్టికాహార లోపం

Rich family kids too are facing malnutrition: సంపన్నులలోనూ పౌష్టికాహార లోపం

పూర్తి స్థాయి అవగాహన..

భారతదేశంతో పాటు అనేక ప్రపంచ దేశాల్లో బాలల ఆరోగ్యంపై పౌష్టికాహార లోపాలు చూపిస్తున్న ప్రభావాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నట్టు ఇటీవల యూనిసెఫ్‌ వెల్లడించింది. యూనిసెఫ్‌ ఇటీవల విడుదల చేసిన బాలల పౌష్టికాహార నివేదిక ప్రకారం, సుమారు 18.10 కోట్ల మంది అయిదేళ్ల లోపు పిల్లలు ఆహార దారిద్య్రంతో బాధపడుతున్నారని తెలిసింది. ఇందులో 65 శాతం మంది బాలలు భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ దేశాలకు చెందిన వారేనని కూడా అది పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికా దేశాలున్నాయని కూడా అది తెలియజేసింది. అభివృద్ధి చెందని దేశాలు, వర్ధమాన దేశాల్లో జరిపిన అధ్యయనాల ప్రకారం, ప్రతి ముగ్గురు బాలలలో ఇద్దరు ఆహార దారిద్య్రంతో బాధపడుతున్నవారే. కాగా, ప్రతి నలుగురిలో ఒకరు అత్యంత తీవ్ర స్థాయి ఆహార దారిద్య్రంతో బాధ పడడం కూడా జరుగుతోంది. భారతదేశం విషయానికి వస్తే సుమారు 40 శాతం బాలలు తీవ్రస్థాయి పౌష్టికాహార కొరతతో బాధపడుతున్నారని ఈ నివేదిక తెలియజేసింది.
పౌష్టికాహార లోపాలకు, కొరతలకు ప్రధాన కారణం కుటుంబాలలో నెలకొన్న పేదరికమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే, తక్కువగా భుజించడమన్నది మాత్రమే పౌష్టికాహార లోపానికి కారణమని భావించనవసరం లేదు. చాలీ చాలకుండా భోజనం చేయడం, వేళా పాళా లేకుండా ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం కూడా పౌష్టికాహార లోపానికి కారణమవుతాయని యూనిసెఫ్‌ నివేదిక పేర్కొంది. అయిదేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందుబాటులో లేకపోవడం, రసాయనాలు, విషతుల్యమైన పదా ర్థాలతో తయారు చేసిన ఆహారాన్ని భుజించడం కూడా పౌష్టికాహార లోపాలకు దారితీస్తున్నట్టు ఈ నివేదిక సోదాహరణంగా తెలియజేసింది. మరొక ముఖ్యమైన విశేషమేమిటంటే, కుటుంబ ఆదాయాన్ని బట్టి పిల్లల పౌష్టికాహార స్థాయిని నిర్ణయించలేమని అది తెలిపింది. తీవ్రస్థాయి ఆహార దారిద్య్రాన్ని అనుభవిస్తున్న పిల్లల్లో సగం మంది సంపన్న కుటుంబాలకు చెందినవారేనని అది దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. పౌష్టికాహార కొరతల వల్ల అనారోగ్యాల పాలవు తున్న పిల్లల్లో 46 శాతం మంది పేద కుటుంబాలకు చెందినవారు కాగా, 54 శాతం మంది పిల్లలు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు చెందినవాళ్లేనని ఈ నివేదిక వివరించింది.
అనేక దేశాలలో పౌష్టికాహార లోపాలు, కొరతలపై జరిపిన అధ్యయనాల్లో తేలిందేమిటంటే, పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించడంలో లోపాలున్నాయి. సరైన సమయంలో సరైన ఆహారాన్ని అందించకపోవడం వల్ల పౌష్టికాహార లోపాలు పెరుగుతున్నాయి. పైగా, చౌకబారు, అనారోగ్యకర ఆహార పదార్థాలను పిల్లలకు అందించడం జరుగుతోంది. కుటుంబ కలహాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు కూడా ఇందుకు వీలైనంతగా దోహదం చేస్తున్నాయి. ఇక ఆహార పదార్థాలు ధరలు పెరగడం కూడా పౌష్టికాహార లోపానికి కారణం అవుతోందని యూనిసెఫ్‌ అధ్యయనంలో తేలింది. పాలు, భోజనం మాత్రం తీసుకునే పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంటోంది. తల్లి పాలతో పాటు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, చేపలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వగైరాలన్నీ ఉన్న ఆహార పదార్థాలను రోజుకు రెండు మూడుసార్లు తీసుకోవడం అన్నది అనివార్యం అవుతోంది.
పౌష్టికాహార లోపాల కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను విశదంగా, వివరంగా ప్రస్తావించడంతో పాటు యూనిసెఫ్‌ ఈ లోపాలను సవరించుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా తెలియజేసింది. ప్రపంచంలోని అనేక కుటుంబాలు ఈ మార్గదర్శక సూత్రాలను తప్పని సరిగా పాటించడం అవసరం. కాగా, భారతదేశానికి ఈ విషయంలో రెండు రకాల సవాళ్లు ఎదుర వుతున్నాయి. పేద కుటుంబాలకు, పేదపిల్లలకు పౌష్టికాహారం అందాలన్న పక్షంలో ప్రభుత్వం ముందుగా పేదరిక నిర్మూలన మీద పోరాటాలు జరపాలి. మౌలికమైన ఆహారం లభించినంత మాత్రాన పౌష్టికాహారాన్ని అందించినట్టుగా భావించకూడదు. తల్లులు, మహిళలు, శిశువులు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహార పథకాల్లో పౌష్టిక విలువలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. పౌష్టికాహారం అవసరమైన వారందరికీ ఇది అందడం లేదు. ఇక పిల్లలకు పౌష్టికాహారం అందించే విషయంలో ప్రభుత్వం దేశంలోని కుటుంబాలన్నిటికీ పూర్తి స్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అనేక కుటుంబాల్లో పౌష్టికాహార లోపం, పౌష్టికాహార కొరత ఏర్పడడానికి కారణం వనరుల కొరత కాదని, అవగాహన లోపమే కారణమని గుర్తించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News