Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Solar Energy: సౌరశక్తిపై కేంద్రం సరైన నిర్ణయం

Solar Energy: సౌరశక్తిపై కేంద్రం సరైన నిర్ణయం

రాష్ట్రాలకు కూడా వెసులుబాటు

దేశంలో సుమారు కోటి మంది ఇళ్లపై సౌరశక్తి ఫలకాలను అమర్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న సందర్భంగా ప్రకటించడం హర్షణీయమైన విషయం. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15,000 పైబడి ఆదా అవుతుంది. ప్రతి నెలా 300 యూనిట్లలోపు విద్యుత్తును వినియో గిస్తున్నవారికి ప్రభుత్వం సొంత ఖర్చుతో 1-2 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సౌరశక్తి ఫలకాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వానికి దీనివల్ల ఏటా లక్ష కోట్ల రూపాయల మేరకు ఖర్చవుతుందని అంచనా. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటి పైన ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ కు 40 శాతం సబ్సిడీ చెల్లిస్తోంది. దీన్ని ఇప్పుడు కొత్త పథకం కింద 60 శాతానికి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విద్యుదుత్పత్తి సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ సంస్థలు భరించడం జరుగుతుంది. దీనివల్ల ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం, పని చేయించడం తేలిక అవడమే కాకుండా నాణ్యమైన సేవలు కూడా అందుతాయి.

- Advertisement -

అంతేకాదు, వీటికొక నెట్ మీటరును కూడా అమర్చుతారు. దీనివల్ల మిగులు విద్యుత్తును ఆ ఇంటివారు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా క్లిష్టంగానూ, జటిలంగానూ ఉంటే ఉండవచ్చు. అయితే, ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. నిజానికి 300 యూనిట్ల లోపు విద్యుత్తును ఉపయోగించడం చాలా తక్కువే. ఏసీలు, గీజర్లు ఉపయోగిస్తున్న ప్రస్తుతం సమయంలో ఇంత తక్కువ విద్యుత్ వినియోగానికి అవకాశం ఉండదు. అయితే, దేశవ్యాప్త వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇది సమంజసమైన నిర్ణయమే. దేశంలో సగటు విద్యుత్ వినియోగం నెలకు 100 యూనిట్ల నుంచి 120 యూనిట్ల వరకు ఉంటోంది. సుమారు 80 శాతం నుంచి 85 శాతం కుటుంబాలలో విద్యుత్ వినియోగం 120 యూనిట్లు దాటడం లేదు. అంటే దాదాపు 30 కోట్ల కుటుంబాలన్న మాట. అందువల్ల కోటి ఇళ్లకు సౌర శక్తి ఫలకాలను అమర్చడం అనేది ఏమంత కష్టమైన
వ్యవహారం కాదు.

ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం సౌరశక్తికి సంబంధించి విధానాలను రూపొందించింది. అయితే, అవి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల పనితీరుకు, విధానానికి విరుద్ధంగా ఉండేది. ఒక దానికొకటి పొసగకపోవడంతో సౌరశక్తి విధానాలేవీ ముందుకు వెళ్లలేదు. పైగా రాష్ట్రస్థాయి విద్యుదుత్పత్తి సంస్థల్లో చాలావరకు నష్టాల్లో నడుస్తున్నందు వల్ల అవి సౌరశక్తి ఫలకాల ఏర్పాటుకు సబ్సిడీలను ఇచ్చే అవకాశం కనిపించ లేదు. అంతేకాక, అవి విద్యుత్ వినియోగం విషయంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేస్తున్నందు వల్ల సౌరశక్తి వినియోగం వల్ల మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని ఈ పథకాన్ని ముందుకు తీసుకువస్తున్నందు వల్ల రాష్ట్రాలకు కూడా వెసులుబాటు లభించే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 40 గిగావాట్ల సౌరశక్తి ప్యానెల్స్ ను ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు కానీ, ఇంతవరకూ 12 గిగావాట్ల ప్యానెల్స్ ను మాత్రమే నెలకొల్పడం జరిగింది. ఇందులో కూడా 27 గిగావాట్లను గృహ వినియోగానికి, మిగిలిన గిగావాట్లను వాణిజ్యపరమైన వినియోగానికి నిర్దేశించడం జరిగింది. దేశీయమైన ప్యానెల్స్ ను మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఇందులో ప్రతి అంశంలోనూ రాష్ట్రాలకు కూడా ప్రమేయం కల్పించదలచుకుంది. ఈసారి ఈ పథకం విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News