Tuesday, February 27, 2024
Homeఓపన్ పేజ్Russia-Ukraine war enters 3rd year: మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టిన రష్యా -...

Russia-Ukraine war enters 3rd year: మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టిన రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం

14,000 మందికి పైగా మరణించారు

రష్యా – ఉక్రెయిన్‌లో యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆయా దేశాలకే కాకుండా ప్రపంచం మీద కూడా ఈ యుధ్దం ప్రభావం ఉంటుందని శాంతి భద్రతలకు సంఘర్షణ వల్ల నష్టం కలిగే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి రాజకీయ వ్యవహారాల అధికారి ఫిబ్రవరి 6 వ తేదీన తెలిపారు. యు యన్ మానవ హక్కుల కార్యాలయం లెక్కల ప్రకారం ఫిబ్రవరి 2022లో రష్యా పూర్తి స్థాయి యుధ్దం ఆరంభించిన నుండి సుమారు 10,382 మంది మరణించారు. మరో 19,659 మంది గాయపడ్డారు. ఈ జనవరిలో 158 మంది పౌరులు మరణించారు. 483 మంది గాయపడ్డారు.ఇంతకు ముందరి నెలలతో పోలిస్తే డిసెంబర్ 2023 మరియు జనవరిలో పౌర మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాస్తవ సంఖ్యలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రతా మండలి రాజకీయ మరియు మరియు శాంతి నిర్మాణ వ్యవహారాల చీఫ్ డికార్లో ” పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఎక్కడ జరిగినా అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధించబడుతుందని, అవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు.

- Advertisement -

అలామొదలయింది :
రష్యా-ఉక్రేనియన్ యుద్ధం ఫిబ్రవరి 2014 లో నాంది జరిగింది. ఉక్రెయిన్లో రెవల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ తరువాత రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకుంది. డాన్బాస్ యుద్ధంలో ఉక్రేనియన్ సైన్యంతో పోరాడుతున్న రష్యా అనుకూల వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చింది. రెవల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ లేదా మైదాన్ తిరుగుబాటు అనేది 21 నవంబర్ 2013న కైవ్‌లోని మైదాన్ నెజాలెజ్నోస్టిలో పెద్ద నిరసనలతో ప్రారంభమైంది. ఉక్రెయిన్ అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ యూరోపియన్ యూనియన్ – ఉక్రెయిన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడమే కాకుండా రష్యా మరియు యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలన్న ఆకస్మిక నిర్ణయంతో ఈ నిరసనలు చెలరేగాయి. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది రష్యా మరియు యురేషియాలో ఉన్న ఐదు సోవియట్ అనంతర రాష్ట్రాల ఆర్థిక సంఘం. కాని యూరోపియన్ యూనియన్తో ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఉక్రెయిన్ పార్లమెంట్ మొగ్గుచూపింది. రష్యా దానిని తిరస్కరించాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చింది. యనుకోవిచ్ ప్రభుత్వం రాజీనామా చేయాలనే పిలుపులతో నిరసనల పరిధి విస్తరించింది. విస్తృతమైన ప్రభుత్వ అవినీతి , అధికార దుర్వినియోగం , మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిని నిరసనకారులు వ్యతిరేకించారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ యనుకోవిచ్‌ని ప్రపంచంలోని అవినీతికి అత్యుత్తమ ఉదాహరణగా పేర్కొంది. నవంబర్ 30న నిరసనకారులును హింసాత్మకంగా చెదరగొట్టడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఇది యూరోమైదాన్ 2014 రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీకి దారితీసింది. తిరుగుబాటు సమయంలో కైవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ (మైదాన్) వేలాది మంది నిరసనకారులచే ఆక్రమించబడి భారీ నిరసనలకు వేదికైంది. నిరసనకారులు ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. తిరుగుబాటు ఫిబ్రవరి 18-20 తేదీలలో క్లైమాక్స్‌కు చేరుకుంది. మైదాన్ కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య కైవ్‌లో జరిగిన భీకర పోరు ఫలితంగా దాదాపు 100 మంది నిరసనకారులు మరియు 13 మంది పోలీసులు మరణించారు . ఫలితంగా యనుకోవిచ్ మరియు పార్లమెంటరీ ప్రతిపక్షాలు మధ్యంతర ఐక్యత ప్రభుత్వం, రాజ్యాంగ సంస్కరణలు మరియు ముందస్తు ఎన్నికలను తీసుకురావడానికి ఫిబ్రవరి 21న ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. మరుసటి రోజు పార్లమెంటు యనుకోవిచ్‌ను పదవి నుండి తొలగించింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . రెవల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ వలన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం మరియు తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అశాంతి అనేవి చివరికి రష్యా-ఉక్రేనియన్ యుద్ధంగా మారింది . 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు ఉక్రెయిన్ యుద్ధభూమిగా మారింది. దేశం ఆగ్నేయంలోని డాన్‌బాస్ ప్రాంతంలో వేర్పాటువాదులకు ఆయుధాలను అందించడం ప్రారంభించింది. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరోపియన్ రాజ్యం మరొకరి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మొదటిసారి. 2014 మరియు 2021 మధ్య డాన్‌బాస్‌లో జరిగిన పోరాటంలో పద్నాలుగు వేల మందికి పైగా మరణించారు. ఇది 1990ల బాల్కన్ యుద్ధాల తర్వాత ఐరోపాలో అత్యంత రక్తపాతమైన సంఘర్షణ.

ఆ తరువాత ఇలా…!!!
ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది మరియు దేశంలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించడం ప్రారంభించింది. మొదటి ఎనిమిది సంవత్సరాల సంఘర్షణలో నావికాదళ సంఘటనలు, సైబర్‌వార్‌ఫేర్ మరియు రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో యు యన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ( ఐ ఎ ఇ ఎ ) అధిపతి రాఫెల్ గ్రాస్సీ ఐరోపాలో అతిపెద్దదైన జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. దాదాపు 18 నెలలుగా షట్‌డౌన్‌లో ఉన్న ఆరు రియాక్టర్లు ప్లాంట్‌కు ఇది నాలుగో సందర్శన. ఈ మిషన్ యొక్క లక్ష్యం ప్లాంట్ యొక్క భద్రత మరియు సైట్‌లోని అర్హత కలిగిన సిబ్బంది స్థాయిలకు అవసరమైన ప్రస్తుత శక్తి మరియు శీతలీకరణ వ్యవస్థల స్థితిని అంచనా వేయడం. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఐ.ఎ.ఇ.ఎ యొక్క తాజా అప్‌డేట్ మరియు ఆక్రమిత ప్లాంట్ నుండి వచ్చిన కొత్త ప్రకటన ప్రకారం ఉక్రెయిన్ జాతీయ న్యూక్లియర్ ఆపరేటర్ ఎనర్‌గోటామ్ యొక్క ఉద్యోగులు ఎవరూ సైట్‌లో పని చేయడం కొనసాగించడానికి అనుమతించబడరు. ఈ సంఘటనలు అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశాలని, సాంకేతిక అంశాలకు అతీతంగా ఇప్పుడు మరియు భవిష్యత్తులో – అక్కడ ఏమి జరుగుతుందో దాని యొక్క ప్రాథమిక చిక్కులపై సంభాషణ చేయడం కూడా చాలా ముఖ్యం అని గ్రాస్సీ అనడం కొసమెరుపు.

జనక మోహన రావు దుంగ
8247045230
అధ్యాపకుడు
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News