దాదాపు 1960ల నుంచి నాలుగు దశాబ్దాల పాటు తెలుగు దేశాన్ని డిటెక్టివ్ సాహిత్యం ఉర్రూతలూగించింది. పుంఖానుపుంఖాలుగా డిటెక్టివ్ నవలలు వెలువడ్డాయి. ఎందరో రచయితలు కొంత స్వయంగానూ, కొంత పాశ్చాత్య నవలలకు అనుకరణగానూ డిటెక్టివ్ సాహిత్యాన్ని వండి వార్చారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ యువతనే కాక ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్న డిటెక్టివ్ సాహిత్యం మాత్రం మధుబాబు సృష్టించిందే. మధుబాబు సృష్టించిన షాడో పాత్ర కొన్ని దశాబ్దాల పాటు తెలుగు పాఠకులను, ముఖ్యంగా కుర్రకారును ఒక ఊపు ఊపిందనడంలో సందేహం లేదు. ఆ షాడో పాత్ర పాఠకుల డ్రీమ్ హీరో. ఆయన డిటెక్టివ్ నవలలు పాఠకులను కన్నార్పకుండా, ఏక బిగిన చదివించేవి. పేజీ తిప్పితే తర్వాత ఏం జరుగుతుందో అని పాఠకుడు ఊపిరి బిగబట్టి చదివేవారు. అటువంటి అద్భుత కథనాలు, ఇతివృత్తాలు ఆయనకు మాత్రమే తోస్తాయనిపించేది. ప్రతి పేజీలోనూ సస్పెన్స్. ప్రతి పేజీలోనూ ఉత్కంఠ. మెరుపు వేగంతో కథ నడిచేది. షాడో ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో గంగారామ్ కామెడీ ట్రాక్. కుల్కర్ణి అసైన్మెంట్లు.
ఒకటేమిటి? మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ప్రతి అక్షరం పాఠకులను పరుగులు పెట్టి స్తుంది. విచిత్రమేమిటంటే, మధుబాబు మరో పుస్తకం రాస్తున్న సంగతి ఏదో విధంగా బయటికి సమాచారం వచ్చేది. ఇక అప్పటి నుంచి పాఠకులు బుక్ సెంటర్ల చుట్టూ తిరుగుతుండే వారు. ఎగబడి కొనేవాళ్లంటే అందులో అతిశయోక్తేమీ లేదు. తెలుగు పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పేరు షాడో. అటువంటి షాడో పాత్రను సృష్టించిన మధు బాబును మరచిపోయే అవకాశమే లేదు.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు గ్రామంలో 1948లో పుట్టిన మధుబాబు రాసిన నవలలన్నీ హిట్టయ్యాయి. 1970-90లలో ఆయనంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. స్వాతి, నవ్య వంటి వారపత్రికల్లోనూ, నది అనే మాసపత్రికలోనూ ఆయన రాసిన ధారావాహికలు పాఠక ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన సినిమాలకే కాకుండా టీవీ చానల్స్ కు కూడా కథా రచన, సంభాషణల రచనలు చేశారు. ఇక 2022 మేలో ఆయన సొంతగా ఒక పోడ్ కాస్ట్ యూట్యూబ్ చానల్ ప్రారంభించి తన నవలలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లోని స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ చేసిన మధుబాబు చివరికి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
ఆయన రాసిన సుమారు 140 నవలలు, 26 సాంఘిక నవలలు, 29 ఫాంటసీ నవలలు ఇప్పటికీ చదివిస్తాయి. ఇవి కాకుండా ఈటీవీ, జెమినీ టీవీలో ఆయన అనేక సిరీస్ లను సృష్టించడం జరిగింది. ఆయన అసలు పేరు వల్లూరు మధుసూదన రావు అయినప్పటికీ, ఆయన మధుబాబు గానే ప్రసిద్ధులు. డిటెక్టివ్ సాహిత్యానికి సామాజి కంగా ఒక హోదాను కల్పించడంలో, గౌరవ మర్యాదలను పెంపొందించడంలో మధుబాబు వంటివారి కృషి సాటిలేనిది. డిటెక్టివ్ నవలలను రహస్యంగా, చాటు మాటున చదివే స్థాయి నుంచి బహిరంగంగా చదవగల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత మధుబాబుకే దక్కుతుంది. ఎక్కడా అశ్లీలతకు, అసభ్యతకు తావు లేకుండా కాల్పనిక సాహిత్యాన్ని సైతం వాస్తవిక సాహిత్యం స్థాయిలో సరికొత్తగా పండించిన మధుబాబు పాశ్యాత్య దేశాల థ్రిల్లర్లకు దీటుగా రచనలు సాగించేవారు. అనుకరణలకు, అనువాదాలకు అతీతంగా ఆయన తెలుగు పాఠకుల కోసం, తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా సరికొత్త డిటెక్టివ్ సాహిత్యాన్ని సృష్టించారు.