తెలుగు వారిని అలరించి, ఉర్రూతలూగించిన కళా స్వరూపాల్లో అపురూపమైనది ‘హరికథ’. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణ దాసు. ఈ ప్రక్రియకు కొత్త రూపును, సరికొత్త ప్రాపును తీసుకు వచ్చినవాడు నారాయణ దాసు. సంగీత సాహిత్య సార్వభౌముడిగా, లయబ్రహ్మగా ఆయన ప్రసిద్ధుడు. హరికథా పితామహుడిగా సుప్రసిద్ధుడు. కేవలం తెలుగువారే కాదు, ఇతర భారతీయులు, ఆంగ్లేయులు సైతం ఆయన ప్రతిభా పాటవాలకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం, బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము. కథాగానం చేస్తూ, ఏక కాలంలో శరీరంలోని అయిదు భాగాలతో అయిదు తాళాలను మేళవించడం ఒక అతిమానుష శక్తిగా మహాకవులు, పండితులు, కళామూర్తులు ఆయనను కొనియాడారు. రెండు చేతులు, రెండు కాళ్లు, తలతో అయిదు తాళాలకు దరువు వేసి చూపించే ప్రజ్ఞ ప్రపంచంలో మరెవరికీ లేదు. మిగిలిన రాష్ట్రాల్లో సంగీతానికి, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం ఉండేవి కావు. అయితే, సంగీతం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ కళారూపం ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తింది.
హాస్య ప్రసంగాలు, పిట్లకథలు, విసుర్లు, చెణుకులు, చమత్కారాలు, చాటు పద్యాలతో నారాయణ దాసు హరికథా ప్రదర్శన చేస్తుంటే కొన్ని వేల మంది ఒళ్లు మరచి, ఆ రస సముద్రంలో ఓలలాడేవారు. ఆదిభట్ల హరికథా గానాన్ని చూసి మంత్రముగ్ధులైపోయినవారిలో రవీంద్ర నాథ్ ఠాగూర్, సరోజినీ దేవి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఎందరో ఉన్నారు. విజయనగరంలో అయిదు తాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి, ‘పంచముఖీ పరమేశ్వర’ బిరుదును గెలుచుకున్న ఘనుడు ఆదిభట్ల. ఆయన హరికథలే కాదు, అష్టావధానాలను కూడా చేసేవారు. తెలుగు, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, అరబ్, ఇంగ్లీష్, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. ఆయన శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని, సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్విక సిద్ధాంత గ్రంథాలు కూడా రాశారు. హరికథలు, ప్రబంధాలు, శతకాలు, నాటకాలు, అనువాదాలు ఇలా అనంత ముఖంగా ఈ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయాం రుబాయీలను తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేశారు.
ఆయన రాసిన నవరస తరంగిణి, దశవిధ రాగ సవతి కుసుమ మంజరి, నూరుగంట, మొక్కుబడి, వేల్పువంద, తల్లి విన్కి, వెన్నుని వేయిపేర్ల వినికిరి వంటి గ్రంథాలు సాటిలేని మేటి గ్రంథాలు. అనేక అచ్చతెనుగు పదాలను ఆయన సృష్టించారు. ఆయన పేరును నోబెల్ బహమతికి నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఆసక్తి చూపినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆయన స్పృశించని కళ లేదు. ఆయనకు దక్కని బిరుదులు, సత్కారాలు లేవు. తెలుగునాట హరికథా గానం చేసే ప్రతి హరిదాసూ మొట్టమొదటగా తలచుకునేది నారాయణ దాసు పేరునే. ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. చెన్న పట్టణానికి చెందిన కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని, నారాయణ దాసు ‘ధ్రువ చరిత్రం’ అనే హరికథా గ్రంథాన్రి రాశారు. అదే ఆయన మొదటి గ్రంథం. విజయనగరం వేణుగోపాల స్వామి ఆలయంలో 20 ఏళ్ల వయసులో అంటే 1883లో తొలిసారి గజ్జెకట్టి మొదటిసారిగా హరికథా గానం చేశారు. శ్రీకాకుళంలోని ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా అష్టావధానం చేశారు. రాత్రికి రాత్రి అంబరీషోపాఖ్యానం హరికథను రూపొందించారు. ఆయన ఏక సంథాగ్రాహి. చిన్నతనంలోనే కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు, కీర్తనలు హృదయస్థం చేసుకున్నారు. 1945లో కాలధర్మం చెందిన నారాయణ దాసుకు గత ఆగస్టు 31న జయంత్యుత్సవాలు జరిగాయి.