Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Sahithi vanam: సాటి లేని మేటి గ్రంథకర్త ‘కావ్యకంఠ’

Sahithi vanam: సాటి లేని మేటి గ్రంథకర్త ‘కావ్యకంఠ’

వెంకట కవుల వంటి సాహితీవేత్తలకు గురువు

తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన భగవాన్‌ రమణ మహర్షికి అంతేవాసి అయిన కావ్యకంఠ గణపతి ముని సంస్కృతాంధ్ర భాషలకు చెందిన సాహితీవేత్తల్లో ఒక భగవదవతారంగా గుర్తింపు పొందిన మహనీయుడు. ఈ రెండు భాషల్లోనే కాక, తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో కూడా అత్యున్నత స్థానంలో ఉన్న గణపతి ముని అసలు పేరు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి. 1878లో బొబ్బిలి ప్రాంతంలోని కలువరాయి అనే గ్రామంలో నరసింహ శాస్త్రి, నరస మాంబలకు జన్మించిన గణపతిశాస్త్రి చిన్న వయసులోనే 1936లో కాలధర్మం చెందారు. సుమారు 18 సంవత్సరాల వయసుకే అనేక శాస్త్రాలను, పురాణాలను అవపోశన పట్టిన గణపతి శాస్త్రి తన విజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు, ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఇల్లు విడిచి దేశాటనకు బయలుదేరడం జరిగింది. భువనేశ్వర్‌ లో ఉద్దండులైన పండితుల దగ్గర శాస్త్ర రహస్యాలు తెలుసుకుంటూనే ఆయన తన ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా తపస్సులో ఎక్కువ సమయం గడిపేవారు.
భువనేశ్వర్‌ లో కొంత కాలం పాటు ఈ విధంగా గడిపిన తర్వాత ఆయన అక్కడి నుంచి కాశీ వెళ్లారు. కాశీలో కూడా పలువురు పండితుల దగ్గర శుశ్రూష చేసిన గణపతి ముని అనేక సంస్కృత కావ్యాల్లో పరిశోధనలు చేసి, పాండిత్యాన్ని పెంచుకుని, తపస్సులో గడిపి, కొంత కాలం తర్వాత తిరిగి అక్కడి నుంచి బయలుదేరారు. పశ్చిమ బెంగాల్‌ లో కలకత్తా నగరానికి దగ్గరలో ఉన్న నవద్వీప్‌ అనే ప్రాంతంలో పండిత పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసి ఆయన అక్కడికి వెళ్లి పండితుల వాగ్వివాదాల్లో పాల్గొన్నారు. ఆయనలోని అసమాన పాండితీ ప్రకర్షకు మెచ్చిన పండితులు ఆయనకు ‘కావ్యకంఠ’ అనే బిరుదును ప్రసాదించారు. ఆయనలోని తపశ్శక్తిని గుర్తించిన ఆధ్యాత్మికవేత్తలు ఆయనకు ముని అనే బిరుదునిచ్చారు. ఫలితంగా ఆయన పేరు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి స్థానంలో కావ్యకంఠ గణపతిగా స్థిరపడిపోయింది. అప్పుడాయన వయస్సు 22 మాత్రమే.
ఇక సుమారు 25 ఏళ్ల వయసులో స్వస్థలానికి తిరిగి వచ్చిన గణపతి ముని, కొద్ది కాలానికే కాంచీపురం వెళ్లడం జరిగింది. కాంచీపురంలో కొంత కాలం ఉన్న తర్వాత అక్కడికి దగ్గరలోని తిరువణ్ణామలైలో ఒక బాల తపస్వి ఉంటున్న విషయం తెలిసి ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణ స్వామి పేరుతో గుర్తింపు పొందని స్వామి ద్వారా ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్న గణపతి ముని ఆ బ్రాహ్మణ స్వామికి రమణ మహర్షి అని పేరు పెట్టారు. రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్‌. రమణ మహర్షి కూడా గణపతి మునిని ‘నాయన’ అని సంబోధించేవారు. రమణ మహర్షిని గణపతి ముని తన గురువుగా భావించేవారు. 1904లో వేలూరు వెళ్లి అక్కడొక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరిన గణపతి ముని ఆ తర్వాత చాలా కాలంపాటు అక్కడే ఉండి పోయారు. ఆయన తెలుగులోనే కాకుండా సంస్కృతంలో కూడా అనేక గ్రంథాలు రాశారు. తెలుగుతో పాటు సంస్కృతంలో కూడా సహస్రావధానాలు చేసిన ఘనత ఆయనది.
ఆయన సంస్కృతంలో రాసిన ఉమా సహస్రం, ఇంద్రాణీ సప్తశతి, దశమహా విద్యలు, మహా విద్యాది సూత్రావళి వంటి అపురూపమైన, అమూల్యమైన గ్రంథాలను రచించడం జరిగింది. మంత్ర శాస్త్రం, తంత్రశాస్త్రం పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడంలో ఈ గ్రంథాలు కీలక పాత్ర పోషించాయి. గాంధీజీ, రాజేంద్ర ప్రసాద్‌ వంటి స్వాతంత్య్రోద్యమ నాయకులతో పాటు స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొన్న గణపతి ముని హరిజనోద్ధరణ, స్త్రీవిద్య వంటి సంస్కరణలను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టేటట్టు చేయడం జరిగింది. తిరుపతి వెంకట కవుల వంటి సాహితీవేత్తలకు గురువుగా వెలిగిన గణపతి ముని విశాలాక్షి అనే తపస్విని వివాహం చేసుకున్నారు. ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ సంస్కృత పండితులకు మార్గదర్శకాలుగా ఉంటున్నాయి. దేశాటన చేస్తూ ఆయన 1936లో ఖరగ్‌ పూర్‌లో తనువు చాలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News