బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు అక్షర రూపం పుట్టపర్తి నారాయణాచార్యులు. సాహిత్యానికి సంబంధించినంత వరకూ ఆయన స్పృశించని విభాగం లేదు. ఆయన కవి, సంగీతజ్ఞుడు, గేయ రచయిత, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు. అంతేకాక, ఆయనకు వచ్చినన్ని భాషలు మరే సాహితీవేత్తకూ రావంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆయన మొత్తం 14 భాషల్లో పండితుడు, పరిశోధకుడు. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామంలో పుట్టి పెరిగిన నారాయణాచార్యులు చిన్నప్పటి నుంచే తల్లితండ్రుల కారణంగా తెలుగు సాహిత్యాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఆయన తండ్రి పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్య పండితుడు, పరిశోధకుడు, ప్రవచనకర్త. ఆయన తల్లి కొండమ్మ కూడా పండితురాలు, కవి, సంగీతజ్ఞురాలు. ఈ లక్షణాలన్నీ నారాయణాచార్యులకు చిన్నప్పటి నుంచే వంటబట్టాయి. ఆయన ఒక పక్క తెలుగు, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తూనే మరొక పక్క సంగీతాన్ని, నాట్య శాస్త్రాన్ని ఔపోసన పట్టడం ప్రారంభించారు. ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రత్యేకంగా గురు శుశ్రూష ద్వారా నేర్చుకున్నారు.
ఆయనలోని సాహితీ పిపాస అంతటితో తీరిపోలేదు. ఇంగ్లీషు సాహిత్యాన్ని మదించడం ప్రారంభించారు. తనకు దగ్గర బంధువైన ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ దగ్గర ప్రాకృతం కూడా నేర్చుకున్నారు. క్రమంగా కన్నడ, తమిళం, మలయాళం, పర్షియన్, ఫ్రెంచి, లాటిన్ భాషలు కూడా నేర్చుకుని, ఆ భాషల్లోని సాహిత్యాన్ని కూడా అభ్యసించడం మొదలుపెట్టారు. ఆయనకు 14వ సంవత్సరం వచ్చే సరికే ఇవన్నీఆయనకు కరతలామలకమయ్యాయి. కాగా, ఆయన పెళ్లి చేసుకున్న కనకమ్మ కూడా కవి, పండితురాలు కావడం విశేషం. ఆమె రాసిన ‘గాంధీజీ మహాప్రస్థానం’, ‘అగ్నివీణ’ గ్రంథాలు బాగా సాహితీవేత్తలను ఆకట్టుకున్నాయి. ఆమె ఎన్నో భక్తి గీతాలను కూడా రచించారు. 1975లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ మహిళా రచయిత్రి పురస్కారాన్ని కూడా అందజేసింది.
పుట్టపర్తి నారాయణాచార్యులు తమ జీవిత కాలంలో మొత్తం మీద 50 కావ్యాలు వెలయించారు. పది వరకూ అనువాద గ్రంథాలను రాశారు. తనకు వచ్చిన భాషలన్నిటిలోనూ కలిపి వందలాది వ్యాసాలు రాశారు. సుమారు 7000 గేయ రచనలు చేశారు. ఆయన రాసిన జనప్రియ రామాయణం గ్రంథానికి 1979లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇక ఆయన రాసిన ‘శ్రీనివాస ప్రబంధం’ అనే ఐతిహాసిక గ్రంథానికి 1988లో కలకత్తాకు చెందిన భారతీయ భాషా పరిషత్తు వారి ఉత్తమ గ్రంథ రచయిత పురస్కారం లభించింది. ఇక 20 ఏళ్ల వయసులోనే ఆయన రాసిన ‘లీవ్స్ ఇన్ ది విండ్’ అనే ఇంగ్లీషు గ్రంథానికి ఉత్తమ ఆంగ్ల రచయిత పురస్కారం లభించింది. పండిట్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ నుంచి ఆయన ఆ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ‘ది హీరో’ పేరుతో ఆయన రాసిన ఇంగ్లీషు నాటకానికి దేశ విదేశాల్లో ప్రాచుర్యం లభిం చింది. రుషీకేశ్ కు చెందిన స్వామి శివానంద ఆయనను ‘సరస్వతీ పుత్ర’ బిరుదుతో సత్కరించారు. భారత ప్రభుత్వం కూడా 1972లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది.
ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒక భాషలో అత్యుత్తమ గ్రంథాలను చదువుతూ ఉండేవారు. సాహితీ విమర్శలు చేస్తుండేవారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అక్కడి వారి పుస్తకాలను వారి భాషలోనే సమీక్షించడం, విమర్శనాత్మక వ్యాసాలు రాస్తుండడం చేసేవారు. ఆయన గుర్తుకు వచ్చారంటే ఆయన రాసిన శివతాండవం కావ్యం గుర్తుకు రాకుండా ఉండదు. ఆయన 1990 సెప్టెంబర్ నెలలో పరమపదించారు.