ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఆంధ్ర వాఙ్మయ చరిత్ర వంటి పరిశోధక గ్రంథాలు ఇప్పటికీ తెలుగు సాహిత్యానికి ప్రామాణిక గ్రంథాలుగా పండిత లోకంలో పరిగణన పొందుతున్నాయంటే అందుకు ఈ గ్రంథాల రచయిత పింగళి లక్ష్మీకాంతమే కారణం. తెలుగు సాహిత్య పరిశోధకులు ఇక ఎప్పటికీ ఇతర గ్రంథాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆయన ఈ అత్యుత్తమ పరిశోధక గ్రంథాలను రాశారు. తెలుగు సాహిత్యాన్ని ఆపోశన పట్టడం అనేది ఆయన రక్తంలోనే, ఆయన జన్యువుల్లోనే ఉందనుకోవాలి. ఆయన పూర్వీకుడు పింగళి సూరన అష్టదిగ్గజాల్లో ఒకరు. పింగళి లక్ష్మీకాంతం ‘పింగళి కాటూరి జంట కవులు’లో ఒకరు. అంతేకాదు, పాండవ ఉద్యోగ విజయాలను రాసిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రికి అనుంగు శిష్యులు కూడా. ఇన్ని అర్హతులున్న పింగళి లక్ష్మీకాంతం సహజంగానే తెలుగు సాహిత్యం మీద తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారు.
ఆయన రాసిన ప్రతి పుస్తకాన్నీ ప్రతి తెలుగు అభిమానీ చదవాల్సిందే. ఆయన గ్రంథాలను చదివితే తెలుగేతర వ్యక్తికి కూడా తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద అపారమైన అభి మానం పెరుగుతుంది. 1894 జనవరి 10న కృష్ణాజిల్లా ఆర్తమూరులో పుట్టి పెరిగిన లక్ష్మీకాంతం ప్రాథమిక విద్యాభ్యాసాన్ని రేపల్లెలో పూర్తి చేసుకుని, మచిలీపట్నం లో హైస్కూల్, కాలేజీ విద్యలలో ఉత్తీర్ణత సాధించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ పట్టా తీసుకున్న అనంతరం ఆయన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి దగ్గర సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యం పొందారు. మచిలీపట్నం లోనే నోబుల్ కళాశాలకు చెందిన హైస్కూలులో సంస్కృతాంధ్ర పండితుడుగా కొంత కాలం పని చేశారు. ఆ తర్వాత మద్రాసు విశ్వ విద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంత కాలం పని చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం లోనూ చాలా కాలం పాటు అధ్యాపకుడుగా పని చేశారు.
ప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త కాటూరి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన ఆంజనేయ స్వామిపై శతకం చెప్పారు. వీరిద్దరూ జంట కవులుగా ముదునూరు, తోట్లవల్లూరు, నెల్లూరు తదితర పట్ట ణాల్లో కవితా ప్రదర్శనలు, పద్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, శతావధానాలు కూడా చేశారు. అంతేకాదు, ఈ జంట కవులు పాండవోద్యోగ విజయాలు, ముద్రా రాక్షసం నాటకాలలో ధర్మ రాజుగా, రాక్షస మంత్రిగా పాత్రలు పోషించి, ప్రశంసలు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ కూడా వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆయన మొత్తం మీద రాసిన పదహారు పరిశోథక గ్రంథాలు తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన కొన్ని అనువాద గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ఆయన రాసిన సాహిత్య శిల్ప సమీక్ష, మధుర పండిత రాజము, సంస్కృత కుమార వ్యాకరణము, గౌతమ వ్యాసాలు, ఆంగ్లేయ దేశ చరిత్రము వంటివి తెలుగు విద్యార్థుల నుంచి పరిశోథకుల వరకు ప్రతి ఒక్కరికీ వారి పరిశోధనల్లో ఉపకరించాయి.
Sahithi Vanam: పరిశోధకుల్లో మేటి పింగళి లక్ష్మీకాంతం
ఈయన పూర్వీకుడు పింగళి సూరన అష్టదిగ్గజాల్లో ఒకరు