ప్రస్తుతానికి జనాభా లెక్కల సేకరణకు అవకాశం కనిపించడం లేదు. అత్యంత వేగంగా దేశ జనాభా అభివృద్ధి చెందడం, జనాభాలో చోటు చేసుకుంటున్న మార్పులను పరిశీలించడానికి, అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. అయితే, జనాభా లెక్కల సేకరణను కేంద్ర ప్రభుత్వం పదే పదే వాయిదా వేస్తూ వస్తున్నందువల్ల ఆమె ప్రకటన సారాంశం ఏమిటో అంతుబట్టడం లేదు. 1881 తర్వాత జనాభా లెక్కల సేకరణను ఇంత కాలం పాటు వాయిదా వేయడం అన్నది ఎప్పుడూ జరగలేదు. భారత దేశం అత్యధిక జనాభా కలిగిన దేశమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే, 2020లో చేపట్టిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల నివేదిక, 2020-21 మధ్య చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికను బట్టి, దేశంలో పునరుత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతోంది. ఈ విషయంలో బీహార్, మణిపూర్, మేఘాలయ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో మాత్రమే కొద్దిగా పెరుగుదల కనిపిస్తోంది. అంటే కొత్త శతాబ్దంలో జనాభా పెరుగుదలను చాలావరకు అరికట్టడం జరిగింది.
విద్య, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వలసలు వగైరాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా బాగా తగ్గిపోతోంది. 1951లో 26 శాతం వంతున పెరిగిన జనాభా 2011 నాటికి 21 శాతానికి తగ్గిపోయింది. ఇటువంటి సర్వేలు, అధ్యయనాలు దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అద్దం పట్టడం అనేది నిజమే కానీ, ఇవి జనాభా లెక్కల సేకరణకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాలేవు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర అంశాలకు ఇస్తున్నంత ప్రాధాన్యాన్ని జనాభా లెక్కల సేకరణకు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ పాలనలో ప్రధాన భాగమైన జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశ జనాభాలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఆయుర్దాయం పెరగడం వంటివి దేశానికి అనేక సవాళ్లు సృష్టించడంతో పాటు, అనేక అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
భారతదేశం వంటి వర్ధమాన దేశంలో ఉపాధి, ఉద్యోగాలకు పనికి వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగావకాశాలను పెంచాల్సిన అవసరం కనిపించి, ఆ దిశగా స్పష్టమైన అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది. ఏ వర్గానికి ఏ స్థాయిలో సామాజిక భద్రత కలిగించాలన్నది అర్థమవుతుంది. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగావకాశాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉత్పాదకత స్థితిగతులు, నైపుణ్యాల మెరుగుదల వంటివి ఏ దశలో ఉన్నాయో, చేసింది ఎంతో, చేయాల్సిందేమిటో తెలుసుకోవాలన్న పక్షంలో, భావి భారత ప్రగతికి ఇంకే మార్గాలు అనుసరించాలో అర్థం చేసుకోవాలన్న పక్షంలో ముందుగా జనాభా లెక్కల గణనను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కోవిడ్ కారణంగా, ఆర్థిక మాంద్యం, యుద్ధాల కారణంగా ఈ అంశాలు కొద్దిగా వెనుకబడ్డాయన్నది వాస్తవం.
అతివేగంగా చోటు చేసుకుంటున్న పట్టణీకరణ, యాంత్రికీకరణల కారణంగా ఉద్యోగాలు, సామాజిక భద్రత, ఇతర సవాళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ఉన్నత స్థాయి కమిటీ ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వదిలిపెట్టి ఇతరత్రా ప్రభుత్వ ప్రయోజనాల మీద ఈ కమిటీ దృష్టి పెట్టినా లేక మరేవైనా అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినా అసలు ప్రయోజనం దెబ్బతినడం ఖాయం. దీని ప్రభావం చివరకు ప్రభుత్వం మీద పడే అవకాశం
కూడా ఉంటుంది. ఈ కమిటీ లక్ష్యాలు, ఉద్దేశాలు, మార్గాల విషయంలో ప్రభుత్వం ఇతరత్రా అన్ని వర్గాలు, ప్రాంతాలవారితో ముందుగా సంప్రదించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వ్యవహరించడం మంచిది.